logo

అరాచకంపై.. ప్యూహాత్మకం..!

అధికారమే హద్దుగా రెచ్చిపోయి గన్నవరంలో అరాచకం సాగించిన వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులపై తెదేపా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

Published : 11 Jul 2024 03:25 IST

తప్పుడు కేసులపై తెదేపా గురి 
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే 

ధికారమే హద్దుగా రెచ్చిపోయి గన్నవరంలో అరాచకం సాగించిన వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులపై తెదేపా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. బూతులు, దాడులు, కేసులతో తమ పార్టీ శ్రేణుల్ని నాలుగేళ్ల పాటు భయబ్రాంతులకు గురిచేసిన వారి లెక్క తేల్చేందుకు వీలుగా చిట్టాలు సిద్ధం చేయిస్తోంది. ఇప్పటికే గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి 15 మందిని అరెస్టు చేసిన పోలీసులు, మరో 70 మందికి పైగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మంత్రి లోకేశ్‌ ప్రతిపక్షంలో ఉండగా చేసిన యువగళం పాదయాత్రలో సృష్టించిన రగడ, బనాయించిన అక్రమ కేసుల్ని తిరగదోడి, దీనికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

కేసులే కేసులు..

బాపులపాడు మండలం రంగన్నగూడెంలో గతేడాది ఆగస్టు 24న జరిగిన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే రీతిలో వైకాపా కార్యకర్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ వివాదానికి సంబంధించి తెదేపా నేతలు, కార్యకర్తలపై పోలీసులు అప్పట్లో కేసులు నమోదు చేశారు. మొత్తం మూడు ఫిర్యాదులకు సంబంధించి నమోదైన ఈ కేసుల్లో ప్రస్తుత జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా, తెదేపా కీలక నేతలతో పాటు, పలువురిపై ఎస్సీ, ఎస్టీ వేధింపులతో పాటు కొట్లాట, దౌర్జన్యం ఆరోపణలతో ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావులపైనా కేసులు నమోదయ్యాయి. వైకాపా వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలను కేసుల్లో చేర్చారు.

ఫిర్యాదులు బుట్టదాఖలు

వైకాపా వర్గీయులు కావాలని రెచ్చగొట్టి, కర్రలతో తమ శ్రేణులపై దాడులకు తెగబడ్డారని దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావులు అప్పట్లో వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ దీనిపై మాత్రం ఎలాంటి కేసు నమోదు కాలేదు. వైకాపా పెద్దల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు.. ఇంకా విచారించాల్సి ఉందంటూ ఈ ఫిర్యాదులను బుట్టదాఖలు చేయడం గమనార్హం. పోలీసులు కనీస విధుల్లో భాగంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే 48 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ వేయాల్సి ఉంది. ఆ నిబంధన కూడా పక్కనపెట్టేసిన వీరవల్లి పోలీసులు నాటి అధికార పార్టీకి తమ వీర విధేయత చాటుకున్నారు.

40 రోజుల అజ్ఞాతం

ఈ గొడవకు సంబంధించి వీరవల్లి పోలీసులు ఎడాపెడా కేసులు నమోదు చేసి, అరెస్టులకు రంగం సిద్ధం చేయడంతో కీలక నాయకులు, కార్యకర్తలు రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయారు. దాదాపు 50 మందిపై కేసులు నమోదు కావడంతో, వీరంతా ఇళ్లను వదిలేసి, 40 రోజుల తర్వాత ముందస్తు బెయిల్‌ తెచ్చుకుని తిరిగి గ్రామాలకు వచ్చారు. 447, 427, 323, 506, 290 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద, 323, 506 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, 307, 324 రెడ్‌విత్‌ 34 ఐపీసీతో పాటు, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద ఘటనా స్థలంలో లేనివారిని కూడా చేర్చి కేసులు నమోదు చేశారు.

విచారణకు పట్టు?

తమను అక్రమ కేసుల్లో ఇరికించి గ్రామాలను, ఇళ్లను వదిలి పారిపోయేలా చేశారని, తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని స్థానిక నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ వ్యవహారం చేరడంతో.. ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. వైకాపా నాయకులు తప్పుడు కేసులు పెట్టినా.. ఎఫ్‌ఐఆర్‌లు కట్టి, ఛార్జిషీట్లు వేసిన క్రమంలో వాటిల్లో తిరిగి దర్యాప్తు చేయడానికి పెద్దగా ఏమీ ఉండదని, తెదేపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదులు పట్టించుకోని నేపథ్యంలో వాటిని పరిశీలించి కేసు నమోదు చేసేలా పోలీసు ఉన్నతాధికారులను కోరడంతో పాటు, అవసరమైతే న్యాయస్థానంలో ప్రైవేటు కేసు వేసి తమపై దాడులకు దిగిన వైకాపా నాయకులకు తగు గుణపాఠం నేర్పాలన్నది తెదేపా నాయకుల వ్యూహంగా కనిపిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని