logo

దేవుని సొమ్ము.. దొంగలపాలు..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాదాయ శాఖ ఆస్తులను తమ సొంత జాగీరులా వైకాపా నేతలు గత ఐదేళ్లుగా వాడేశారు. పలు ఆలయాల భూములు, దుకాణాల అద్దెలు, కానుకల ఆదాయాన్ని కొల్లగొట్టారు.

Updated : 11 Jul 2024 05:29 IST

దేవాదాయశాఖలో.. చెలరేగిన అక్రమార్కులు
ఐదేళ్లలో ఆలయాలన్నింటిలో ఆదాయం పక్కదారి
ఈనాడు, అమరావతి

మ్మడి కృష్ణా జిల్లాలో దేవాదాయ శాఖ ఆస్తులను తమ సొంత జాగీరులా వైకాపా నేతలు గత ఐదేళ్లుగా వాడేశారు. పలు ఆలయాల భూములు, దుకాణాల అద్దెలు, కానుకల ఆదాయాన్ని కొల్లగొట్టారు. తమ అడుగులకు మడుగులొత్తే అధికారులను ఈవోలుగా నియమించి మరీ.. చెలరేగారు. ప్రధానంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అనుచరుల కనుసన్నల్లో ఆలయాల్లో అక్రమాలు పెచ్చరిల్లాయి. అసిస్టెంట్‌ కమిషనర్ల నుంచి.. దుర్గగుడి సహా చాలా ఆలయాల ఈవోలుగా వీరి అనుకూలురనే నియమించుకున్నారు. వీరి దెబ్బకు.. ధూపదీప నైవేద్యాలకూ నిధులు లేని దుస్థితి. ఇలాంటి అధికారుల్లో ఒకరై.. వైకాపా నేతలతో అంటకాగి.. సహాయ కమిషనర్‌గా పనిచేసిన.. కె.శాంతిపై ఇప్పటికే వేటు పడింది. 

పేట్రేగిన వారిలో ఆందోళన...

దేవాదాయ శాఖలో వివాదాస్పద అధికారిణిగా ముద్రపడిన కె.శాంతిపై వేటు పడడంతో.. వైకాపాతో అంటకాగిన మిగతా అధికారుల్లో ఆందోళన ఆరంభమైంది. శాంతి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివాదాస్పద వైఖరే. ఆలయాల్లో అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినా స్పందించలేదు. అందుకే ఆమెపై ఏకంగా తొమ్మిది అభియోగాలతో ఛార్జస్‌ ఫ్రేమ్‌ చేసి వారం కిందట సస్పెన్షన్‌ వేటు వేశారు. నాటి వైకాపా ఎంపీ ఆశీస్సులతోనే ఆమె ఇక్కడ కొలువుదీరారు. కృష్ణా బాధ్యతలూ చేపట్టి.. చక్రం తిప్పారు. ఉన్నతాధికారులకూ తెలియకుండా.. తాడేపల్లి ప్రాంతంలో లగ్జరీ విల్లా కొన్నారు. వన్‌టౌన్‌లో వెంకన్న ఆలయ దుకాణ సముదాయం, పాత శివాలయం, ఉయ్యూరు సోమేశ్వరాలయంలో అవకతవకలు, పలు ఆలయాల్లో దుకాణాల అద్దెల్లో శాఖ నష్టం వాటిల్లుతున్నా.. అక్రమార్కులకే కొమ్ముకాశారు. నీకెంత.. నాకెంత అనేలా మసలుకొన్నారు.

దుర్గగుడిలో వెలంపల్లి కనుసన్నల్లోనే..

దుర్గగుడిలో వైకాపా హయాంలో ఐదేళ్లూ వెలంపల్లికి అనుకూలంగా వ్యవహరించిన వారినే ఈవోలుగా నియమించుకున్నారు. వైకాపా ప్రభుత్వం రాగానే.. ఎం.వి.సురేష్‌బాబును ఈవోగా తెచ్చారు. ఈయన వెలంపల్లి చెప్పిందే వేదంలా వ్యవహరించారు. దుర్గగుడిలో సరకుల టెండర్ల నుంచి వేడుకల వేళ పనుల వరకూ అన్నీ వెలంపల్లి చెప్పిన వాళ్లకే కట్టబెట్టారు. ఇతని హయాంలో అక్రమాలు మరీ శ్రుతిమించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అనిశా అధికారులు దాడులు చేసి.. అక్రమాలను గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నివేదిక సైతం బయటకు రాకుండా కమిషనర్‌ స్థాయిలోనే వెలంపల్లి ఆపించారు. కేవలం కొందరిని బదిలీ వేశారు. తర్వాత ఈవోగా వచ్చిన భ్రమరాంబ కూడా వెలంపల్లి ఆదేశాలకే తలూపారు. ఈమె హయాంలోనూ అక్రమార్కులకే పెద్దపీట వేశారు. అనిశా దాడుల్లో దొరికిన వారిని కీలక స్థానాల్లో ఉంచారు. భ్రమరాంబ బదిలీ అయ్యి వెళ్లే ముందు ఆలయానికి శోభనిచ్చే రాతి మండపాన్ని (పెర్గోలా) పడగొట్టించి.. రాతి ముక్కలను మూలనపడేశారు. వీటిని రూ.5 కోట్లుపైగా వెచ్చించి ఆధ్యాత్మిక శోభ కోసం ఏర్పాటు చేయించారు.

సత్రం రాబడి కరిగించేసి..

విజయవాడలో శ్రీ చల్లంరాజు వెంకట శేషయ్య ధర్మసత్రం పరిధిలో పది దుకాణాలుంటే.. అద్దెల విషయంలో వెలంపల్లికి కొమ్ముకాసి భారీగా గండికొట్టారు. సామరంగా చౌక్‌లో రద్దీ ప్రాంతంలోని దుకాణాలకు వేలం వేస్తే రెట్టింపు ఆదాయం వస్తుంది. కానీ.. వెలంపల్లి పాతవాళ్లకు అండగా ఉండడంతో.. వారు ఎంతిస్తే అదే అద్దెగా కొనసాగుతోంది. పైగా ఈ దుకాణాలకు చెందిన ఓ ఖాళీ స్థలంలో ఓ ప్రైవేటు వ్యక్తి ఏకంగా భారీ షెడ్డు అనధికారికంగా వేస్తూ.. అడ్డంగా దొరికారు. మరమ్మతులకు అనుమతి తీసుకుని.. కొత్తగా నిర్మాణం చేపట్టారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. వెలంపల్లి దన్నుతో ఏమీ చేయలేకపోయారు. అప్పటి అసిస్టెంట్‌ కమిషనర్‌ అన్నపూర్ణ అక్రమ నిర్మాణాలు వాస్తవమని తేల్చి చర్యలు చేపడతామన్నారు. కానీ.. బాధ్యులను వదిలేసి.. ఏసీని బదిలీ చేశారు.


వెంకటేశ్వరాలయంలో అక్రమాలు..

విజయవాడ బ్రాహ్మణవీధిలో వెంకన్న ఆలయ నిధులు కొల్లగొట్టారు. ఏసీ పర్యవేక్షణలో ఏడాది కిందట దస్త్రాలు, బిల్లు పుస్తకాలను పరిశీలించి ఏకంగా 15పైగా అవకతవకలను గుర్తించి నివేదించారు. కానీ... ఆలయ ఈవోకు మద్దతుగా అప్పటి వైకాపా ఎమ్మెల్యే రంగంలోకి దిగడంతో నివేదిక బుట్టదాఖలైంది. ఆలయ దుకాణాలపై రూ.40 లక్షల వరకు డిపాజిట్లు, అడ్వాన్సుల రూపంలో తీసుకున్నా ఈ సొమ్ముకు లెక్కలు లేవు. నాలుగేళ్లుగా దుకాణాలపై నెలవారీ అద్దెల వివరాలు ఎక్కడా లేవు. భక్తులు సమర్పించే బంగారు, వెండి కానుకల లెెక్కలేవీ సరిగా లేవు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని