logo

ఆయనలా.. వెలిగిపోతున్నాడు!

ఆయన... రెండు జిల్లాలకు ఒకే అధికారి. గతంలోనూ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశారు. అందులోనూ.. ఈ జిల్లావాసే. వైకాపా ప్రభుత్వంలో బదిలీ చేస్తే.. పది రోజుల్లో రద్దు చేయించుకున్నారు.

Updated : 11 Jul 2024 05:32 IST

జిల్లాను వదలనంటున్న అధికారి
పదోన్నతి వరకు బదిలీ చేయొద్దట
విద్యుత్తు శాఖ ఎస్‌ఈకి మంత్రుల సిఫార్సు
ఈనాడు, అమరావతి

యన... రెండు జిల్లాలకు ఒకే అధికారి. గతంలోనూ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశారు. అందులోనూ.. ఈ జిల్లావాసే. వైకాపా ప్రభుత్వంలో బదిలీ చేస్తే.. పది రోజుల్లో రద్దు చేయించుకున్నారు. తాజాగా బదిలీ కాకుండా ఉత్తర్వులు పొందారు. ప్రభుత్వం ఏదైనా.. ఆయన మాత్రం కదలరంతే. ఇదీ... ఏపీ సీపీడీసీఎల్‌ పర్యవేక్షణ ఇంజినీరు (ఎస్‌ఈ, ఆపరేషన్‌) మురళీమోహన్‌ తీరు. తాజాగా ఆయన సీఈగా పదోన్నతి పొందే జాబితాలో ఉన్నారు. పదోన్నతి వరకు ఆయనను బదిలీ చేయవద్దని ప్రభుత్వ ఆదేశాలు పొందడం విద్యుత్తు శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బీఏవీపీ కుమారరెడ్డి సీపీడీసీఎల్‌ ఛైర్మన్, ఎండీకి ఈమేరకు లేఖ రాశారు. విద్యుత్తు ఎస్‌ఈ మురళీ మోహన్‌ను అదే పోస్టులో కొనసాగించాలని ఆదేశించారు. ఈమేరకు సీపీడీసీఎల్‌ ఉన్నతాధికారులు ఆయనను కొనసాగించాలని నిర్ణయించారు. 2022 నుంచి మురళీమోహన్‌ జిల్లాలో ఎస్‌ఈగా కొనసాగుతున్నారు.

గత ప్రభుత్వంలోనూ చక్రం..!

గత ప్రభుత్వంలోనూ ఆయన హవా నడిచింది. ప్రస్తుతం ముందుగానే బదిలీ కాకుండా ఉత్తర్వులు పొందారు. ఇటీవల కానూరు ఏడీఈ పోస్టుకు చేసిన బదిలీ పెద్ద దుమారం రేపింది. ఏకంగా ఎస్‌ఈ స్థాయి అధికారి గత కొన్నేళ్లుగా ఒకే పోస్టులో కొనసాగడమే కాదు.. ఈ జిల్లానూ వదలడం లేదు. ఏడీఈగా ఇదే జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశారు. ఒకే ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేయడంతో ఆయన రాజకీయ సంబంధాలపై విమర్శలు వస్తున్నాయి. 2022 నుంచి ఎస్‌ఈగా ఉన్న మురళీ మోహన్‌కు గత ప్రభుత్వంలో ఒకసారి బదిలీ జరిగింది. మధ్యలో గుణదల విద్యుత్తు నియంత్రణ కేంద్రం (స్కాడా) ఎస్‌ఈగా బదిలీ జరిగింది. స్కాడా ఎస్‌ఈ సత్యానందంను ఆపరేషన్స్‌ ఎస్‌ఈగా నియమించారు. పరస్పరం బదిలీ జరిగితే.. దీనికి నాటి జగ్గయ్యపేట ఎమ్మెల్యే అడ్డుపుల్ల వేశారు. కేవలం పదిరోజుల్లో తిరిగి ఎవరిని వారి స్థానాలకు బదిలీ చేశారు. మురళీమోహన్‌ తిరిగి ఎస్‌ఈ ఆపరేషన్స్‌గా నియమితులయ్యారు. అంతకు ముందు ఏడీఈ పట్టణం, ఏడీఈ గ్రామీణంగా విజయవాడలోనే ఎక్కువ రోజులు విధులు నిర్వహించారు. ప్రస్తుతం మంత్రి పార్థసారథి ద్వారా సిఫార్సు లేఖ సాధించారు. ఆయన మురళీమోహన్‌ను ఇక్కడే కొనసాగించాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు సిఫార్సు లేఖ ఇచ్చారు. ఆయన ద్వారా ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి నుంచి జాయింట్‌ సెక్రటరీ కుమారరెడ్డి సీపీడీసీఎల్‌ సీఎండీకి ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఇంత తతంగం జరిగింది. ఆయనను ఎందుకు బదిలీ చేయకుండా కొనసాగించాలనేదానిపై స్పష్టత లేదు.

విద్యుత్తు శాఖ తీరుపై..!

సీపీడీసీఎల్‌ ఎస్‌ఈగా ఉన్న మురళీమోహన్‌ హయాంలో పలు ఆరోపణలు వచ్చాయి. పలు కొత్త సబ్‌స్టేషన్‌లలో షిప్ట్‌ ఆపరేటర్‌ల పోస్టులు భారీగా అమ్మకాలు జరిగాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కో సబ్‌స్టేషన్‌లో నలుగురు ఉండాలి. దీనికి పోస్టుకు రూ.5-10 లక్షల వరకు నేతల ఆధ్వర్యంలోనే వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జగ్గయ్యపేటలో ఒక హెచ్‌టీ లైన్‌ మార్పిడిలో రూ.40 లక్షలు గోల్‌మాల్‌ అయిన ఫిర్యాదులు ఉన్నాయి. నున్న నుంచి గుణదల ప్రాంతంలో కొన్ని లైన్లు మార్చేశారు. ఇక్కడా భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలిసింది. గన్నవరం పరిధిలో నాటి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఒక లిప్టు ఇరిగేషన్‌కు పూర్తిగా 24 గంటలు సరఫరా చేశారు. మీటరు లేకుండా విద్యుత్తు వాడారు. వైకాపా ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేశారు. అప్పటికప్పుడు విద్యుత్తు లైన్లు మార్చేశారు. నాటి సీఎం జగన్‌ విజయవాడలో రోడ్‌షో.. గులకరాయి ఘటన వేళ విద్యుత్తు సరఫరా ఆపేసినప్పుడు ఎస్‌ఈగా మురళీమోహన్‌ కీలకంగా ఉన్నారు. మరోవైపు గన్నవరం మండలం కేసరపల్లిలో కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సైతం విద్యుత్తు సరఫరాలో పలుమార్లు అంతరాయం కలిగింది. ఈవిషయంలో అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం తిరువూరు పరిధిలో విద్యుత్తు లైన్ల మార్పిడిలోనూ అవకతవకల ఆరోపణలు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని