logo

మాది పట్టిసీమ.. నీది ఒట్టిసీమ!

‘‘తెదేపా ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ పట్టిసీమ అభివృద్ధికి రూ.1,300 కోట్లు కేటాయించింది. కానీ... పట్టిసీమను ఒట్టిసీమ అని అసెంబ్లీలో ఎగతాళి చేసిన జగన్‌.. నేడు పట్టిసీమతో ప్రజలకు జరిగే మేలును కళ్లు తెరిచి చూడాలని’’ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Published : 11 Jul 2024 04:06 IST

ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడు జగన్‌
మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

ఈనాడు డిజిటల్‌ - అమరావతి, న్యూస్‌టుడే - ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌: ‘‘తెదేపా ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ పట్టిసీమ అభివృద్ధికి రూ.1,300 కోట్లు కేటాయించింది. కానీ... పట్టిసీమను ఒట్టిసీమ అని అసెంబ్లీలో ఎగతాళి చేసిన జగన్‌.. నేడు పట్టిసీమతో ప్రజలకు జరిగే మేలును కళ్లు తెరిచి చూడాలని’’ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ కాలువలకు మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, కలెక్టర్‌ సృజన తదితరులతో కలిసి మంత్రి నిమ్మల బుధవారం నీరు విడుదల చేసి మాట్లాడారు. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

పట్టిసీమ ఎత్తిపోతలతో ప్రజల తాగు, సాగునీరు కష్టాలు తీరుతాయన్నారు. చంద్రబాబు ముందుచూపుతో పట్టిసీమ ఎత్తిపోతల ప్రారంభించారని.. గోదావరి జలాలతో కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాలకు సాగు, 30 లక్షల మందికి తాగునీరు ఇవ్వడం సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురైన పట్టిసీమ, తాడిపూడి, పురోషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ జలాలను తొలిప్రాధాన్యం కింద ప్రజలు తాగునీరు... తర్వాత ఖరీఫ్‌ నారుమళ్లకు ఉపయోగించుకోవాలని సూచించారు. కృష్ణా డెల్టా పరిధిలో చెరువులను నింపి లక్షల ఎకరాల సాగునీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కాలువలు, డ్రెయిన్లలో పూడిక, గుర్రపు డెక్క, తూటికాడ తొలగించలేదని.. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారని రామానాయుడు వివరించారు.

మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వాహణను గాలికొదిలేసిందన్నారు. దీంతో చిన్నపాటి వర్షాలు కురిసినా పంట నీట మునిగి రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారన్నారు. నూజివీడు, మైలవరం, తిరువూరుకు ఆధారమైన చింతలపూడి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో 2.8 లక్షలకు ఎకరాలు బీళ్లుగా మారాయన్నారు. చింతలపుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపి త్వరలోనే మెట్టప్రాంత ప్రజలు కష్టాలు తీరుస్తారన్నారు.

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. వైకాపా పాలనలో కాలువలు, డ్రెయిన్లలో పూడిక తీయకుండానే బిల్లులు చేసుకున్నారనీ... జగన్‌ హయాంలో కృష్ణా డెల్టా ప్రజలు సాగు, తాగునీటీకి తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వీటి నుంచి గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని.. చివరి ఎకరాకూ సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని