logo

Kodali Nani: గుడివాడలో కొడాలి నానిపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం

గుడివాడలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా మున్సిపల్‌ నిధులతో నిర్మించిన రాజేంద్రనగర్‌ పార్కుకు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేరు ఉండడం ఏమిటని తెదేపా నాయకులు గురువారం సాయంత్రం ఆ పేరును తొలగించారు.

Updated : 07 Jun 2024 09:14 IST

పార్కు ప్రవేశ ద్వారంపై ఆయన పేరు తొలగింపు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా మున్సిపల్‌ నిధులతో నిర్మించిన రాజేంద్రనగర్‌ పార్కుకు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేరు ఉండడం ఏమిటని తెదేపా నాయకులు గురువారం సాయంత్రం ఆ పేరును తొలగించారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పని చేసిన కొడాలి నాని గుడివాడలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని తెదేపా నాయకుడు కడియాల గణేష్‌ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజేంద్రనగర్‌ పార్కుకు కొడాలి నాని పేరు తొలగించడం తప్పుకాదని.. ప్రజలకు మంచి చేయని నేతల పేర్లు శిలాఫలకాలు, పార్కులపైనా ఉండాల్సిన అవసరం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. తొలుత పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపాన్ని ఆనుకొని నిర్మించిన చెత్తకుండీని ఆర్యవైశ్యులు ధ్వంసం చేశారు. ఆర్యవైశ్యులపైన కక్షతోనే నాని కావాలని కల్యాణ మండపాన్ని ఆనుకొని భారీగా చెత్తకుండీ నిర్మించారని.. ఇబ్బందికరంగా ఉన్న దీన్ని ధ్వంసం చేసినట్లు ఆ సంఘీయులు ప్రకటించారు.


దొండపాడులో శిలాఫలకాలు ధ్వంసం

 దొండపాడు రైతు భరోసా కేంద్రంలో శిలాఫలకాలు తొలగించారిలా..

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆగ్రహంతో పలు గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ప్రారంభించిన పలు ప్రభుత్వ కార్యాలయాల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. దొండపాడు రైతు భరోసా కేంద్రంలోని రెండు, ఆరోగ్య కేంద్రంలో ఒకటి, జల్‌జీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన రక్షిత మంచినీటి పథకం ట్యాంకు ప్రారంభ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కొడాలి నాని పేరుతో ఉన్న ప్రతి శిలాఫలకాన్ని నాశనం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని