logo

Gudivada: వైకాపా కార్యాలయంపై తెదేపా ఫ్లెక్సీ

అధికారం ఉందని ఇన్నాళ్లూ చెలరేగిపోయి.. గుడివాడలో అక్రమాలు, అరాచకాలకు తెగబడుతూ.. అందర్నీ నోటికొచ్చినట్లు తిడుతూ..

Updated : 22 Jun 2024 07:02 IST

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం: అధికారం ఉందని ఇన్నాళ్లూ చెలరేగిపోయి.. గుడివాడలో అక్రమాలు, అరాచకాలకు తెగబడుతూ.. అందర్నీ నోటికొచ్చినట్లు తిడుతూ..రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కి దిమ్మతిరిగే ఝలక్‌ తగిలింది. గుడివాడలో కొడాలి నానికి సంబంధించిన వైకాపా కార్యాలయంపై శుక్రవారం తెదేపా ఫ్లెక్సీ ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. ఎనిమిదేళ్లుగా నాని బలవంతంగా ఆక్రమించి.. కార్యాలయంగా వినియోగిస్తున్న గుడివాడ బస్టాండ్‌ కూడలిలోని శరత్‌ థియేటర్‌ ప్రధాన ద్వారంపై తెదేపాకు చెందిన భారీ ఫ్లెక్సీ వెలిసింది. థియేటర్‌లో వాటాలున్న యజమానుల్లో ఒకరైన తెదేపా నేత, గుడివాడ మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు యువసేన పేరుతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ‘చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం.. కానున్నది ఆంధ్రరాష్ట్రం స్వర్ణయుగం’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పవన్‌ కల్యాణ్, వంగవీటి రంగ సహా నేతలందరి ఫొటోలతో ఈ ఫ్లెక్సీని రూపొందించారు. గుడివాడలోని శరత్‌ థియేటర్‌లో కొడాలి నాని ఎనిమిదేళ్ల కిందట వైకాపా కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు థియేటర్‌ యజమానులైన యలవర్తి శ్రీనివాసరావు, మరికొందరు కొడాలి నాని కార్యాలయాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ అనేకసార్లు కోరినా పట్టించుకోలేదు. 2019లో వైకాపా గెలవడంతో.. ఎన్నికల ఫలితాల రోజు నుంచే తెదేపా నేత యలవర్తి కారు, గుడివాడలోని ఆయన వై హోటల్, ఇంటిపై కొడాలి అనుచరులు దాడులకు దిగారు. అధికారం చేతిలో ఉండడంతో శరత్‌ థియేటర్‌లోని తన కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా కొడాలి నాని పూర్తిగా అది తనదేనన్నట్లు అయిదేళ్లుగా దౌర్జన్యం చేస్తూ వచ్చారు. కొడాలి అరాచకానికి భయపడి.. యలవర్తితోపాటు థియేటర్‌ ఇతర భాగస్వాములు కూడా మౌనంగా ఉండిపోయారు. తాజాగా తెదేపా మళ్లీ అధికారంలోకి రావడంతో కొడాలి అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. గుడివాడలో శరత్‌ థియేటర్‌పై తెదేపా ఫ్లెక్సీని యలవర్తి పేరుతో ఏర్పాటు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని