logo
Published : 02/12/2021 05:03 IST

నగదు దోపిడీ.. రెండు గంటల్లో నిందితుల పట్టివేత

కంచికచర్ల, న్యూస్‌టుడే: లారీ డ్రైవర్‌ని కత్తితో బెదిరించి నగదు దోచుకున్న ముగ్గురిని రెండు గంటల్లో పోలీసులు పట్టుకున్నారు. ఆ వివరాలను కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి బుధవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సుబన్పూర్‌ గ్రామానికి చెందిన డ్రైవర్‌ మహ్మద్‌ ఫరీద్‌ మంగళవారం రాత్రి బియ్యం లారీతో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురానికి బయలుదేరాడు. నిద్ర రావడంతో తెల్లవారుజామున పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద లారీ ఆపి పడుకున్నాడు. కొద్ది నిమిషాల్లోనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్‌ని కత్తితో బెదిరించి నగదు, సెల్‌ఫోన్‌ లాక్కొని పరారయ్యారు. డ్రైవర్‌ వెంటనే సమీప హోటల్‌ నుంచి 100కు ఫోన్‌ చేశాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్‌ కుమారి సమాచారాన్ని నందిగామ గ్రామీణ సీఐ నాగేంద్రకుమార్‌కు చెప్పారు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఎస్సై సుబ్రహ్మణ్యం, ఏఎస్సై రమేష్‌, సిబ్బంది బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తుండగా... కంచికచర్లలో అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై తిరుగుతున్న ముగ్గురు కుమారికి తారస పడ్డారు. వెంటనే కానిస్టేబుల్‌ వారిని ఆపి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. అందులో ఒకరు పాత నేరస్థుడు. దాంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా తామే దోపిడీకి పాల్పడినట్లు కంచికచర్లకు చెందిన తుడుము అంజిబాబు, ఇక్కుర్తి నాగసాయికుమార్‌, మేచర్ల చిరంజీవి సాయితేజ ఒప్పుకున్నారు. డ్రైవర్‌ ఫరీద్‌ కూడా నిందితులను గుర్తించాడు. నిందితులపై కేసు నమోదు చేసి వారి నుంచి రూ.5,070 నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుళ్లు కుమారి, శ్యామ్‌కుమార్‌, ఉపేంద్రలను డీఎస్పీ అభినందించారు. రివార్డు అందజేశారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని