logo
Published : 02/12/2021 05:03 IST

మన రైల్‌ నీరు తాగేదెప్పుడో..!

ఈనాడు, అమరావతి

విజయవాడ డివిజన్‌కు కేటాయించిన ప్రతిష్ఠాత్మకమైన రైల్‌ నీరు ప్రాజెక్టుకు మోక్షం లభించడం లేదు. భవనం పూర్తిచేసి త్వరలో అందుబాటులోనికి తీసుకొస్తామంటూ చెప్ఫి. తాజాగా మళ్లీ పట్టించుకోకుండా వదిలేశారు. 2013లో రైల్‌ నీరు ప్రాజెక్ట్‌ విజయవాడ డివిజన్‌కు మంజూరైంది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ప్రాజెక్టులను కేటాయించారు. ఇక్కడ తప్ప మిగతా ఆరూ ఎప్పుడో పూర్తయి.. ఉత్పత్తిని కూడా ఆరంభించాయి. విజయవాడలో మాత్రం రకరకాల అడ్డంకులు ఎదుర్కొంటూ వచ్చింది. చివరికి గత ప్రభుత్వం ఆధర్యంలో రైల నీరు ప్రాజెక్టు కోసం మల్లవల్లి పారిశ్రామిక ప్రాంతంలో స్థలాన్ని కేటాయించారు. 2018లో నిర్మాణం ఆరంభించారు. త్వరితగతిన పూర్తిచేసి ఉత్పత్తి ఆరంభిస్తామని చెప్పారు. కానీ ఆలస్యమైంది.. దీంతో ప్రాజెక్టును 2020 మార్చి నాటికి అందుబాటులోనికి తీసుకొస్తామని చెప్పారు. ఏడాదిన్నర దాటిపోయింది.. ఇప్పటికీ ప్రాజెక్టును పూర్తిచేసి అందుబాటులోనికి తీసుకురాలేదు. అసలు.. ఎప్పటికి పూర్తిచేస్తారో కూడా తెలియని అయోమయం ప్రస్తుతం నెలకొంది.’

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంజూరైన తొలి రైల్‌ నీరు ప్రాజెక్టు ఇదే. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నిర్మాణం, నిర్వహణ పద్ధతిలో రెండు ప్రైవేటు సంస్థలతో కలిసి రైల్‌ నీరు ప్రాజెక్టు పట్టాలెక్కింది. రూ.100 కోట్లతో కృష్ణా జిల్లా మల్లవల్లి మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 4254 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లాంటు నిర్మాణం చేపట్టారు. 2020 ఆరంభానికే దాదాపు భవన నిర్మాణ పనులను పూర్తిచేశారు. అదే ఏడాది మార్చిలో ఆరంభించాలని లక్ష్యంగా పెట్టారు. భూగర్భంలో బోర్లు, మోటార్ల ఏర్పాటుకూడా అప్పట్లోనే పూర్తిచేశారు. నిర్మాణం పూర్తయ్యాక.. సదరు ప్రైవేటు సంస్థలే దీని నిర్వహణ బాధ్యతను కొంతకాలం చూసేలా ఒప్పందం చేసుకున్నారు. మల్లివల్లిలో ప్రాజెక్ట్‌ ఉత్పత్తి ఆరంభించిన తర్వాత.. ఇక్కడి నుంచే 400 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న అన్ని రైల్వేస్టేషన్లకు మంచినీటిని సరఫరా చేయనున్నారు.

స్థానికంగానూ ఉపాధి అవకాశాలు..

రైల్‌ నీరు ప్రాజెక్టు అందుబాటులోనికి వస్తే స్థానికంగా ఉండే వారికి కూడా ఉపాధి అవకాశాలు రానున్నాయి. మొదటి దశలో 80వేల బాటిళ్ల వరకు ఉత్పత్తి చేయాలనేది ప్రణాళిక. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, విశాఖపట్నం వరకూ ఇక్కడి నుంచే వెళ్లనున్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలు, రాయలసీమ ప్రాంతంలోని స్టేషన్లకు కూడా ఇక్కడి నుంచే పంపిస్తారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి ఇక్కడికి మంచినీటి బాటిళ్లు వస్తున్నాయి.

ఆది నుంచి అనేక అడ్డంకులు..

రైల్‌ నీరు ప్రాజెక్టును తొలుత తాడేపల్లి వద్ద ఉన్న కృష్ణా కెనాల్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర నిర్మించాలని భావించారు. ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్థలం ఎంపిక చేసి, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తీసుకున్నారు. భూగర్భ పరీక్షలు చేపట్టారు. నిర్మాణం చేపట్టడానికి సిద్ధమైన సమయంలో.. ప్రాజెక్ట్‌ను నిర్మించి, నిర్వహణ చేపట్టే విషయంలో గుత్తేదారు సంస్థ, రైౖల్వే మధ్య అంగీకారం కుదరలేదు. దాంతో ప్రాజెక్టు నిర్మాణం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత నాలుగేళ్లు ప్రాజెక్టును అటకెక్కించేశారు. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడంతో.. మల్లవల్లిలో నిర్మాణం ఆరంభించారు. దానినీ ప్రస్తుతం ఆపేశారు. ప్రాజెక్టుకు అవసరమైన యంత్ర సామగ్రిని తెప్పించే విషయంలో జాప్యం అవ్వడంతో.. ప్రాజెక్టు జాప్యం అవుతున్నట్టు తెలుస్తోంది. గత మూడు నెలలుగా మల్లవల్లిలో ప్రాజెక్టు పనులను ఆపేశారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని