logo
Published : 02/12/2021 06:05 IST

బాబోయ్‌ చలి.. దుప్పటి ఏదీ

వణుకుతున్న వసతి గృహాల విద్యార్థులు

పొన్నూరు, న్యూస్‌టుడే


ఓ సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో దుప్పట్లు లేకుండానే నిద్రిస్తున్న విద్యార్థులు

చలి తీవ్రమవుతోంది.. మంచూ కురుస్తోంది.. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రత బాగా తగ్గింది. జనమంతా రాత్రిళ్లు దుప్పట్లలో వెచ్చగా నిద్రించే ఈ కాలంలోనూ వణకుతూ ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూసే దుస్థితి ఆ విద్యార్థులది. తల్లిదండ్రులకు దూరంగా వసతిగృహాల్లో ఉంటూ చదువుకొంటున్న వీరిలో కొందరికి చిరిగిన, పాత దుప్పట్లుండగా, మరికొందరికైతే అవీ ఉండవు.

జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలు 72 ఉండగా, వీటిలో 3900 మంది విద్యార్థులున్నారు. అలాగే వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ వసతిగృహాలు 57 ఉండగా, 1300 మంది వీటిలో వసతి పొందుతున్నారు. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా వసతిగృహాలు మూతపడ్డాయి. ఈ ఏడాది ఆగస్టులో ఇవి పునఃప్రారంభమయ్యాయి.


మునిపల్లె హాస్టల్‌ భవన కిటికీ తలుపుల్లో ఒకటి విరిగిపోయిన దృశ్యం

ఎప్పుడు పంపిణీ చేస్తారు?

పొన్నూరు, తెనాలి, వేమూరు, సత్తెనపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల్లోని వసతిగృహాల విద్యార్థులకు దుప్పట్లు ఇంకా పంపిణీ చేయలేదు. కొన్ని హాస్టళ్లలో కిటికీల తలుపులు విరిగిపోయి లోపలికి చలిగాలులు ప్రవేశిస్తున్నాయి. బండలు, ఫ్లోరింగు కూడా కొన్ని చోట్ల దెబ్బతిన్న పరిస్థితులున్నాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలు చలికి గజగజ వణుకుతూ పడుకోవాల్సి వస్తోంది. వీరికి సకాలంలో దుప్పట్లు ఇవ్వాల్సి ఉన్నా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. కొందరు ఇళ్ల నుంచి తెచ్చుకున్న దుప్పట్లతో నెట్టుకొస్తున్నారు.

ప్రతిపాదనలు పంపాం

దుప్పట్లు, ఇతర సౌకర్యాల విషయమై సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి ఓబుల్‌నాయుడు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి వై.నరసారెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. దుప్పట్ల పంపిణీకి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపామని, ఉన్నతాధికారుల నుంచి అందగానే విద్యార్థులకు పంపిణీచేస్తామని చెప్పారు. ఇతర సౌకర్యాల కల్పన విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

తప్పని చన్నీళ్ల స్నానం

వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చడం లేదు. గీజరు సౌకర్యం కల్పించాల్సి ఉన్నా, అవెక్కడా కనపడవు. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో విద్యార్థులు గజ గజ వణకుతూనే చన్నీటి స్నానం చేస్తున్నారు. ఫలితంగా కొంతమంది దగ్గు, జలుబు తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. బీసీ వసతిగృహాలకు మంచాలు పంపిణీ చేసినప్పటికీ పరుపులివ్వలేదు. సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల్లో మాత్రం విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికార యంత్రాంగం మేల్కొని వీలైనంత త్వరగా దుప్పట్లు పంపిణీ చేయాలని, వేడినీటి సౌకర్యం కల్పించాలని, ఇతర మరమ్మతులు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని