logo
Published : 02/12/2021 06:13 IST

మీ వంట నూనె మంచిదేనా!

పట్నంబజారు(గుంటూరు), న్యూస్‌టుడే

 

కరోనా వ్యాప్తి చెందిన నాటి నుంచి ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరిగే బదులు ప్రతి ఒక్కరూ కల్తీ లేని నాణ్యమైన నూనెలు, ఆహార పదార్థాల్ని తీసుకొంటున్నారు. ఖర్చుకు వెనుకంజ వేయకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న చందంగా అన్ని వర్గాల ప్రజలు నాణ్యమైన నూనె వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వినియోగదారులు అభిరుచులకు అనుగుణంగా నగర మార్కెట్‌లో నాణ్యమైన నూనెల్ని వినియోగదారులే నేరుగా తయారు చేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.

కల్తీల నుంచి విముక్తి...

నగర మార్కెట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో పాటు కల్తీ వంట నూనెలు ముంచెత్తుతున్నాయి. నాణ్యమైన వంట నూనెల్ని వినియోగించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండడంతో నగర మార్కెట్‌లో చెక్క గానుగ యంత్రాలు విక్రయిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇటీవల కాలంలో ఈ తరహా యంత్రాల వినియోగం పెరిగింది. వినియోగదారులే నేరుగా చెక్క గానుగ యంత్రాలను కొనుగోలు చేసి నాణ్యమైన నూనెల్ని ఇంటిలోనే తయారు చేసుకొంటున్నారు. ఈ విధానం ద్వారా కల్తీ నూనెలకు చెక్‌ పడుతుంది. ఒక్కొక్క చెక్క గానుక యంత్రం రూ.1.20 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకు ధరలు పలుకుతున్నాయి. వీటితో పాటు రూ.40 వేలు విలువ చేసే యంత్రాలు సైతం ఉన్నాయని వ్యాపారవర్గాలు వెల్లడించాయి.


వంట నూనెల్ని తయారు చేసే చెక్క గానుగ యంత్రం

నిరుద్యోగులకు ఉపాధి

కొందరు నిరుద్యోగ యువతతో పాటు, గృహిణులు చెక్క గానుగ యంత్రాలు కొనుగోలు చేసి నాణ్యమైన నూనెల్ని తీసి విక్రయించి ఉపాధి పొందుతున్నారు. వినియోగదారులు తాము మార్కెట్‌లో కొనుగోలు చేసిన శనక్కాయ గింజలు, కొబ్బరి చిప్పలు, నువ్వుల్ని ఇక్కడికి తీసుకొచ్చి నూనెల్ని తీయించుకుంటారు. చెక్క గానుగ యంత్రాలు నిర్వహించే కొందరు నాణ్యమైన గింజల నుంచి గానుగాడించి నూనెల్ని విక్రయిస్తున్నారు. పట్నంబజారు, కొరిటెపాడు, ఏటి అగ్రహారం, ఏటుకూరురోడ్డు, సంగడిగుంట ప్రాంతాల్లో ఈ తరహా యంత్రాల ద్వారా వంట నూనెల్ని తీసి యువత ఉపాధి పొందుతుంది.

ఇంటిలోనే వంట నూనెల తయారీ..

చెక్క గానుక యంత్రాల ద్వారా శనగనూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనెల్ని తయారు చేసుకోవచ్ఛు ఒక కిలో శనగక్కాయల గింజల నుంచి 400 గ్రాముల నాణ్యమైన వేరుశనగ నూనెని తీసుకోవచ్ఛు గతంలో ఈ యంత్రాల్ని కోయంబత్తూరు నుంచి దిగుమతి చేసుకొనేవారు. ప్రస్తుతం గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోనే ఇవి లభిస్తున్నాయి. కరోనా మొదలైన నాటి నుంచి చెక్క గానుగ యంత్రాల వినియోగం బాగా పెరిగింది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించే వారు ఈ తరహా యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ యంత్రం వినియోగం ద్వారా 5 కిలోల నూనెను తయారు చేసేందుకు ఒక యూనిట్‌ కరెంటు ఖర్చవుతుంది.


యంత్రాల వినియోగం పెరిగింది

కరోనా వ్యాప్తి చెందిన నాటి నుంచి అందరూ నాణ్యమైన వంట నూనె వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను. కరోనా కారణంగా దానికి స్వస్తి పలికి రూ.2 లక్షల పెట్టుబడితో గానుగ ద్వారా నూనె తీసే వ్యాపారం ప్రారంభించా. ప్రస్తుతం ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నా. నెలకు రూ.30 వేలు వస్తుంది. నూనెల గింజలు తీసుకొస్తే.. గానుగాడించి కిలోకు రూ.20 తీసుకొంటా. సొంతంగా వేరుశనగ గుళ్లు, కొబ్బరి చిప్పలు, నువ్వులు నుంచి తీసిన నూనెల్ని విక్రయిస్తున్నా. వ్యర్థాలు కిలో రూ.30 చొప్పున పశువులు, చేపల దాణాకు విక్రయిస్తుంటాను.

- బత్తుల ప్రతాప్‌, గానుగ నూనెల వ్యాపారి


కల్తీ నూనెలకు అడ్డుకట్ట

ఏడాదిన్నర నుంచి గానుగ నుంచి తీసిన నాణ్యమైన శనగనూనెను వంటల్లో వినియోగిస్తున్నాను. నెలకు 4 లీటర్లు వాడుతుంటాం. మార్కెట్‌లో లభించే నూనెల్లో కల్తీలు జరుగుతున్నాయి. రెండున్నర కిలోల శనగగుళ్లును గానుగ వద్దకు తీసుకెళ్తే కళ్లెదుటే కిలో నాణ్యమైన శనగనూనెను తీసి ఇస్తున్నారు. కిలోకు రూ.20 చెల్లిస్తున్నాను. ఆరోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత ఆసుపత్రులకు రూ.వేలు వెచ్చించే కంటే నాణ్యమైన వంట నూనెల్ని వాడితే ఆరోగ్యంగా జీవించవచ్ఛు

- జడ అనురాధ, గృహిణి


గిరాకీ బాగుంది

కరోనా వ్యాప్తి చెందిన నాటి నుంచి చెక్క గానుగ యంత్రాల ద్వారా నాణ్యమైన నూనెల్ని కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగింది. గతంలో నెలకు 5 వరకు యంత్రాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 20కు పెరిగింది. వీటి వినియోగంతో నాణ్యమైన నూనెలు తయారు చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ తరహా యంత్రాలను కొందరు కొనుగోలు చేసి నాణ్యమైన నూనెలు తీసినందుకు కొంత మొత్తాలను తీసుకొంటున్నారు.

- రాజారమణి, యంత్రాల తయారీదారు

 

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని