logo
Published : 04/12/2021 02:44 IST

పరిహారం సరే.. రంగుమారిన ధాన్యం కొనేదెప్పుడు?

కేంద్రాలు తెరవాలని కోరుతున్న రైతులు

వేమూరు, న్యూస్‌టుడే

నూర్పిడి అనంతరం కుప్పగా పోసిన ధాన్యం

వేమూరుకు చెందిన వెంకటేశ్వరరావు అనే కౌలు రైతు తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో వరిసాగు చేశారు. అయితే రెండు వారాల క్రితం ‘కంబైన్డ్‌ హార్వెస్టర్‌’తో కోత, నూర్పిడి ఒకేసారి చేసే సమయంలో వర్షం కురిసింది. ధాన్యం తడవడంతో ఆరబెట్టి, ఓ ప్రైవేటు వ్యాపారికి 75 కిలోల బస్తా రూ.1030 చొప్పున విక్రయించారు. ఈయనకు ఎకరాకు 30 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన చూస్తే ఎకరాకు 30,900 వచ్చాయి. అవి భూ యజమానికి చెల్లించిన కౌలుకు సరిపోయాయి. అదే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకుంటే బస్తాకు రూ.1470 దక్కేవి. కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఇలా ప్రైవేటు వ్యాపారులు చెప్పిన ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది.

51 వేల హెక్టార్లలో పంట నష్టం  

వ్యవసాయాధికారుల అంచనా ప్రకారం జిల్లాలో 2.18 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ వరి సాగుచేశారు. పంట దశకు చేరే సమయంలో వరస వాయుగుండాల ప్రభావంతో 51 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల నుంచి సిబ్బంది బృందాలుగా ఏర్పడి, పొలాల వెంట తిరిగి, దెబ్బతిన్న పంటను పరిశీలించి, బాధిత రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు.  

మద్దతు ధర ఇలా..  

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ‘ఎ’ గ్రేడు రకం ధాన్యం క్వింటాకు రూ.1960, కామన్‌ రకానికి రూ.1940గా నిర్ణయించింది. దీన్ని బట్టి 75 కిలోల బస్తా ‘ఎ’ గ్రేడు రకానికి రూ.1470, కామన్‌ రకానికి రూ.1455 చెల్లించాలి. ప్రస్తుతం బయట మార్కెట్‌లో ధాన్యం బస్తా రూ.1150కు మించి పలకడం లేదు. దీంతో రైతులు పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు తెరవాలని కోరుతున్నారు.

నమోదు కాని వారి సంగతేంటి?  

జిల్లాలో వేలాది ఎకరాలకు సంబంధించిన భూ యజమానులు ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉంటున్నారు. వారి భూమిని కౌలుకు తీసుకున్న రైతులకు అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు అందుబాటులో లేవు. దీంతో ఆ పొలాల్లో కౌలు రైతులు పంట సాగుచేస్తున్నా, యజమాని వేలిముద్ర, ఆధార్‌ సంఖ్య, ఖాతా నంబరు లేనందున పంట వివరాలు నమోదు కాలేదు. మా సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు అలాంటి వారి పొలాలను సాగుచేస్తున్న కౌలు రైతులు.

స్పష్టత ఏది?

రెండు వారాల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నేలవాలిన వరితో పాటు.. పాలుపోసుకునే దశలో ఉన్న వరి కంకుల్లోనూ నీరు చేరి, అవి తాలుగా మారినట్టు రైతులు చెప్తున్నారు. గత ఏడాది ఇలాగే జరిగినప్పుడు అమలవుతున్న నిబంధనల్లో 10 శాతాన్ని సడలించి.. రంగుమారి, తాలుగింజలు, మట్టి, మొలకెత్తిన వరిపంటను కూడా కొనుగోలు చేశారు. ఈ విషయంపై ఈ ఏడాది ఇటు అధికారులు కానీ, అటు పాలకులు కానీ దెబ్బతిన్న పంట కొనుగోలు గురించి స్పష్టత ఇవ్వడం లేదు.

దెబ్బతిన్న ధాన్యం కొనాలి: శ్రీమాన్‌, కౌలు రైతు, చుండూరు

నేను పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశా. ఇంకో పది రోజుల్లో కోత మొదలుపెడదామనుకున్న దశలో వర్షాలు కురిశాయి. మొత్తం పంట చాపలా నేలవాలింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున ఇచ్చే పరిహారంతో పాటు.. దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. లేకుంటే అన్నదాతులు కోలుకునే పరిస్థితి లేదు.

యజమానుల వివరాలుంటే నమోదు చేస్తాం  

క్షేత్రస్థాయి సిబ్బంది పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు. అందిన వివరాలను బట్టి ఏ మేరకు పంట నష్టం జరిగిందని వివరాలు పంపుతాం. భూ యజమాని వివరాలు అందుబాటులో ఉంటే ఇప్పుడైనా పంట నమోదు చేస్తాం.

- విజయభారతి, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు

ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాలి

ప్రస్తుతం పంట నష్టం అంచనా వేసే ప్రక్రియ జరుగుతోంది. ఆ వివరాలు ఉన్నతాధికారులకు అందిన తరవాత వారిచ్చే ఆదేశాల మేరకు దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.

- రామ్‌ప్రసాద్‌, జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల శాఖ

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని