logo

దళారులకే ధాన్యం

కంకిపాడుకు చెందిన ఆయన మోతుబరి రైతు. మొత్తం 10మంది రైతులకు చెందిన దాదాపు 90 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరానికి 30 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. నేరుగా ఓ మిల్లుకు తరలించారు. సొమ్ములు మిల్లరు చెల్లించారు. 

Published : 08 Dec 2021 04:54 IST

ఈనాడు, అమరావతి

కంకిపాడుకు చెందిన ఆయన మోతుబరి రైతు. మొత్తం 10మంది రైతులకు చెందిన దాదాపు 90 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరానికి 30 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. నేరుగా ఓ మిల్లుకు తరలించారు. సొమ్ములు మిల్లరు చెల్లించారు. మద్దతు ధర కాకుండా తేమ శాతాన్ని బట్టి కొంత తగ్గించి చెల్లించారు. కానీ ఈ ధాన్యం మాత్రం ఆర్‌బీకేలో నమోదైంది. రైతు ఆర్‌బీకేలో విక్రయించినట్లు ఉంటుంది. దీని లావాదేవీలు చూసేది మాత్రం ఓ మధ్య దళారీ. దీనికి ఆయనకు కొంత మొత్తం లాభం రానుంది. ఇది ఆ ఒక్క రైతే కాదు.. జిల్లాలో పెద్ద రైతులందరూ మధ్య దళారులకే ధాన్యం విక్రయిస్తున్నారు.

రైతుభరోసా కేంద్రాల్లో నేరుగా ధాన్యం విక్రయిస్తే.. ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. ధాన్యం తీసుకునేంత వరకు తిరగాలి. తర్వాత సొమ్ములు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇదంతా ఎందుకు..? తెలిసిన వ్యాపారికి విక్రయిస్తే సరి..! ఎంతో కొంత తగ్గించి ఇస్తారు. వెంటనే సొమ్ములు వస్తాయి.. అనే ఆలోచనతో రైతులు ఉన్నారు. ఇది దళారుల పంట పండిస్తోంది. రైతుల దగ్గర కొనుగోలు చేసి తిరిగి రైతుల పేరుమీదనే ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. మద్దతు ధర వ్యాపారులకు దక్కుతోంది. జిల్లా యంత్రాంగం సాంకేతికంగా ఎన్ని మార్పులు చేసినా.. మిల్లర్లదే పైచేయిగా మారింది. రైతు భరోసా కేంద్రాలతో సత్సంబంధాలు పెట్టుకుని ప్రభుత్వానికే విక్రయిస్తున్నారు.

జిల్లాలో ధాన్యం అమ్మకాలు ముమ్మరమైన విషయం తెలిసిందే.  734 ఆర్‌బీకేలలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాలేదు. ఇటీవల వాతావరణ పరిస్థితుల కారణంగా కొంత ఆలస్యంగా కోతలు ఆరంభమయ్యాయి. ఈ ఏడాది మద్దతు ధర ఏగ్రేడు క్వింటాకు రూ.1960, సాధారణ రకం రూ.1940గా ఉంది. 17శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 18శాతం ఉన్నా.. అనుమతిస్తున్నారు. దీనికి ఒక కేజీ తరుగు తగ్గిస్తున్నారు. అయితే కళ్లాల్లో ధాన్యం మాత్రం 20శాతం పైగా తేమ ఉంటోంది. ఇది దళారులకు కలిసి వచ్చింది. జిల్లాలో ప్రతి మిల్లుకు ఇద్దరు ముగ్గురు మధ్యవర్తులు ఉంటున్నారు. సాధారణ రకం క్వింటా రూ.1960 ఉంటే.. తేమ పేరుతో ధరను తగ్గించి రూ.1400కే కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కేవలం రూ.1200కే కొనుగోలు చేశారు. ఆర్‌బీకేల నుంచి మిల్లుకు వచ్చినట్లు ఉంటుంది. కానీ రైతులకు వ్యాపారి డబ్బులు ముందుగానే చెల్లిస్తున్నారు. తర్వాత రైతుల ఖాతాలో పడిన సొమ్మును మిల్లర్లు తీసుకుంటారు. క్వింటాకు దాదాపు రూ.500 వరకు లాభం దళారీలకు ఉంటుంది. వడ్డీ వరకు తమకు మిగులుతుందని మిల్లుల యజయానులు అంగీకరిస్తున్నారు. పెనమలూరు, కంకిపాడు, విజయవాడ గ్రామీణం, నందిగామ, కంచికచర్ల, తోట్లవల్లూరు, గుడివాడ, చల్లపల్లి, మోపిదేవి తదితర మండలాల్లో ఇదే తంతు జరుగుతోంది.

ఇంకా సన్నద్దం కాలేదు..!

కొన్ని గ్రామాల్లో ఆర్‌బీకేలు ఇంకా సన్నద్ధం కాలేదు.  గన్నీ సంచులు లభించడం లేదు. తేమ కొలిచే యంత్రాలు లేవు. ఆర్‌బీకేలలో ఇంకా ధాన్యం కొనుగోలు కాలేదని సిబ్బంది సమాధానం చెబుతున్నారు. తహసీల్దార్లు దీనిపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌, జేసీ ఆదేశించారు. అయినా ఇంకా సన్నద్ధం కాలేదు. తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పలువురు రైతులు తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని దళారులకు విక్రయించారు. మద్దతుధర, రవాణా ఛార్జీలు దళారులకే దక్కుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని