జడ్పీ సీఈవోగా శ్రీనివాసరెడ్డి బాధ్యతల స్వీకరణ
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాపరిషత్తు సీఈవోగా డాక్టర్ జి.శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తున్న శ్రీనివాసరెడ్డిని డిప్యుటేషన్‌పై సీఈవోగా నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈనెల 3న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలుత జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్‌ని కలిసి అనంతరం జడ్పీలో ప్రస్తుత సీఈవో చైతన్య నుంచి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ విభాగాల పర్యవేక్షకులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాపరిషత్తు ఛైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో అభివృద్ధి పనులను ప్రాధాన్య క్రమంలో చేసేలా ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తానని సీఈవో వివరించారు.