logo

ముగిసిన పల్నాడు వీరారాధన ఉత్సవాలు

పల్నాటి వీరారాధనోత్సవాలలో మంగళవారం చివరి రోజు కల్లిపాడు కార్యక్రమాన్ని ఆచారవంతులు నిర్వహించారు. కోడిపోరు రోజు ఉదయం నుంచి తెల్లవార్లూ గ్రామోత్సవంలో ఉన్న కొణతాలు ఉదయం పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ ఇంటికి వెళ్లి సేవ చేసి

Published : 08 Dec 2021 05:58 IST


గ్రామోత్సవంలో కొణతాలు (దైవాలు)

కారంపూడి, న్యూస్‌టుడే : పల్నాటి వీరారాధనోత్సవాలలో మంగళవారం చివరి రోజు కల్లిపాడు కార్యక్రమాన్ని ఆచారవంతులు నిర్వహించారు. కోడిపోరు రోజు ఉదయం నుంచి తెల్లవార్లూ గ్రామోత్సవంలో ఉన్న కొణతాలు ఉదయం పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ ఇంటికి వెళ్లి సేవ చేసి ఆయనతో సహా వీర్ల దేవాలయ ప్రాంగణంలోని లంకన్న ఒరుగు బండ వద్దకు చేరారు. అప్పటికే ఆచారవంతుడు మందపోరులో గోవులను కాపాడేందుకు అసువులు బాసిన వీరుడు లంకన్న వేషధారణలో పడుకొని ఉండగా అతనిపై బాణాలను ఉంచారు. అక్కడికి కొణతాలతో కలిసి చేరుకున్న ఆచారవంతులు లంకన్న మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. బ్రహ్మన్న వేషధారణలో పీఠాధిపతి అలనాడు లంకన్నకు శంకుతీర్థమిచ్చి బ్రహ్మనాయుడు వైకుంఠప్రాప్తిని ప్రసాదించిన రీతిన క్రతువు కొనసాగించారు. లంకన్నను కొణతాలతో కలిపి నాగులేరు గంగదారి మడుగుకు తీసుకెళ్లి అక్కడ పవిత్ర స్నానాలు చేయించారు. ఈ క్రమంలో కొణతాలకు వీరగంధం పూసి తిరిగి వీర్లదేవాయం చేరారు. రాత్రికి కొణతాలను తీసుకొని ఆచారవంతులు చెన్నకేశవస్వామి, అంకాళమ్మ దేవాలయాల్లో పూజలు చేసి తీర్థాలు తీసుకొని శంఖుతీర్థ మండపంలో బ్రహ్మన్న వేషంలో ఉన్న పీఠాధిపతితో శంకుతీర్థం తీసుకొని కల్లితోరణం లోంచి యుద్ధక్షేత్రం పోతురాజుగుట్టలోని పోతురాజుశిల వద్ద ఏర్పాటు చేసిన పొలిమండెలపై (తంగెడు మండెలు) వాలి యుద్ధంలో వీరులు (ఆయుధాలు) మృతి చెందినట్లుగా చూపి ఎవరి గ్రామాలకు వారు తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం పొలి మండల కోసం పలు గ్రామాలకు చెందిన ప్రజలు పోటీపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని