logo

భూవర్గీకరణ మతలబు

రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో 7.22 ఎకరాల విస్తీర్ణాన్ని నదీపాతం నుంచి మెట్టగా మార్పు చేశారు. వీటితోపాటు మరికొన్ని సర్వేనంబర్లను కూడా నదీపాతం నుంచి మెట్టగా మార్చడం రాజధాని ప్రాంతంలో భూఅక్రమాల అంశం చర్చనీయాంశమైంది.

Published : 08 Dec 2021 06:03 IST

తెర వెనుక చక్రం తిప్పిన నేతలు

రాజధాని ప్రాంతంలో ఇదీ సంగతి
రాయపూడి లంకలోని నదీపాతం భూములు

ఈనాడు-అమరావతి: రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో 7.22 ఎకరాల విస్తీర్ణాన్ని నదీపాతం నుంచి మెట్టగా మార్పు చేశారు. వీటితోపాటు మరికొన్ని సర్వేనంబర్లను కూడా నదీపాతం నుంచి మెట్టగా మార్చడం రాజధాని ప్రాంతంలో భూఅక్రమాల అంశం చర్చనీయాంశమైంది. రాయపూడి రెవెన్యూ పరిధిలో 15ఏ, 15బీ, 16ఏ, 16బీ, 17ఏ సర్వేనంబర్లలో 7.22 ఎకరాల విస్తీర్ణం భూమిని నదీపాతం నుంచి మెట్టభూమిగా మార్పు చేశారు. ఈ భూమిని రాయపూడి గ్రామానికి చెందిన కొందరికి వారసత్వంగా వచ్చినట్లు రికార్డుల్లో నమోదుచేశారు. అనంతరం ఈభూమిని తహశీల్దారు కుటుంబసభ్యులు, మరికొందరికి విక్రయించారు. అయితే ఈభూమికి సంబంధించి రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌(ఆర్‌ఎస్‌ఆర్‌) పరిశీలిస్తే ఇది నిమ్మగడ్డ కోటయ్య తదితరుల పేర్లతో ఉంది. నిమ్మగడ్డ కోటయ్య కాకుండా ఇతరులు భూమిని విక్రయించడం గమనార్హం. నిమ్మగడ్డ కోటయ్య పేరు ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉంటే ఇటీవల అమ్మినవ్యక్తులకు భూమి ఎలా సంక్రమించిందన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈభూమిని విక్రయించిన వ్యక్తికి భూమి ఎలా వచ్చిందన్న విషయమై దస్త్రాలు అందుబాటులో లేకపోవడం సందేహాలకు తావిస్తోంది. భూవర్గీకరణ మార్పు చేసే క్రమంలో ఇప్పటివరకు జరిగిన లావాదేవీలు పరిశీలించాలి. ఈసర్వేనంబర్ల పక్కనే ఉన్న వాటిలో 1906లో కొన్ని సర్వేనంబర్లను ఆర్‌ఎస్‌ఆర్‌లో మెట్ట భూమిగా ఉన్నప్పటికీ వాటిని 1945లో నదీపాతం భూములుగా మార్పు చేశారు. 1906 నుంచి 2021 వరకు సదరు సర్వేనంబర్లపై జరిగిన లావాదేవీలు మొత్తం విశ్లేషించిన తర్వాతే భూవర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలి. దీంతోపాటు సీఆర్‌డీఏ ఏర్పడిన తర్వాత నదీపాతం భూములుగా కొన్ని సర్వేనంబర్లను గుర్తించి వాటిని పక్కాగా నమోదుచేశారు. వీటిన్నిటిని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవన్న వాదన తెరపైకి వచ్చింది.


తీగ లాగితే కదిలిన డొంక

రాయపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో నది మధ్యలో ఉన్న సర్వేనంబర్లు 19, 19బీ, 71, 72, 1ఎం, 1-12లో నదీపాతం భూమిని మెట్టగా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఇటీవల జరిగిన మార్పులే నిదర్శనం. నదీపాతంలో ప్రైవేటు పట్టా భూములను గుర్తించిన అధికారి ఒకరు రాయపూడి గ్రామంలోని కొందరు వ్యక్తుల పేర్లతో వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో నమోదుచేసి వారికి లబ్ధి చేకూర్చినట్లు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగానే కొంత భూమిని అధికారి కుటుంబసభ్యులకు నజరానాగా ఇచ్చినట్లు సమాచారం. వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో అక్రమంగా నదీపాతం భూములను మెట్టగా మార్చిన అధికారి మళ్లీ నదీపాతం భూములుగా మార్చడం గమనార్హం. 1ఎం సర్వేనంబరుకు సంబంధించిన భూమి ఎక్కడుందో గుర్తించాల్సి ఉంది. సదరు సర్వేనంబరులో 2.18 ఎకరాల భూమి ఈఏడాది జూన్‌ వరకు నదీపాతంగా ఉంది. ఈసర్వేనంబరును ఆగస్టు 23న మెట్టభూమిగా అడంగల్‌లో మార్పు చేసి సీలింగ్‌భూములుగా నమోదుచేశారు. తొలుత ఓ ప్రైవేటు వ్యక్తికి వారసత్వంగా వచ్చినట్లు నమోదుచేసి గంటల వ్యవధిలోనే అదే వ్యక్తికి కొనుగోలు ద్వారా భూమి సంక్రమించినట్లు రికార్డుల్లో నమోదుచేశారు. ఇవన్నీ ఒకరోజు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రిలోపు జరిగినట్లు రెవెన్యూరికార్డుల్లో నమోదయింది. ఇటీవల భూవర్గీకరణ మార్పు వివాదాస్పదం కావడంతో వెంటనే సర్వేనంబరు 1ఎంలో ఉన్న భూమిని అడంగల్‌లో నదీపాతం భూమిగా మార్పు చేయడం గమనార్హం.


నిబంధనలకు నీళ్లు....

భూవర్గీకరణ చేసే ముందు క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామరెవెన్యూఅధికారి, గ్రామ, మండల సర్వేయర్లు నుంచి నివేదిక తీసుకోవాలి. వీరు ఇచ్చిన నివేదిక ఆధారంగా సంబంధిత దస్త్రాలు పరిశీలించి నదీపాతం భూమిని మెట్టగా మార్చడానికి అర్హత ఉన్నట్లయితే ఆర్డీవో ద్వారా జిల్లా సంయుక్త పాలనాధికారికి నివేదిక పంపాలి. రాయపూడి గ్రామంలో చేసిన భూవర్గీకరణ విషయంలో క్షేత్రస్థాయి యంత్రాంగం నివేదిక లేకుండా ఏకపక్షంగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో యంత్రాంగం గుర్తించింది. భూమి పుట్టుక నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై నివేదిక లేకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆర్‌ఎస్‌ఆర్‌లో ప్రైవేటు పట్టాగా ఉన్నంతమాత్రాన సంబంధిత దస్త్రాలు లేకుండా వర్గీకరణ చేయడానికి వీలులేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. నదీపాతంలో సుమారు 600 ఎకరాలు భూమి ప్రైవేటు పట్టా ఉంటే కేవలం 7.22 ఎకరాలకు ఎందుకు మార్చారన్న విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈవ్యవహారం వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం డిప్యూటీ కలెక్టర్‌ను విచారణాధికారిగా నియమించింది. విచారణలో బాధ్యులను గుర్తించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని