logo

కలిసే కానరాని లోకాలకు...

నలుగురూ మిత్రులు...చివరకు కలిసే కానరాని లోకానికి వెళ్లిపోయారు. మంగళగిరిలోని యర్రబాలెం వద్ద సోమవారం రాత్రి చెరువులోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో నలుగురు జల సమాధి అయ్యారు. మంగళగిరికి

Published : 18 Jan 2022 03:35 IST

సాయి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి

మంగళగిరి, న్యూస్‌టుడే:నలుగురూ మిత్రులు...చివరకు కలిసే కానరాని లోకానికి వెళ్లిపోయారు. మంగళగిరిలోని యర్రబాలెం వద్ద సోమవారం రాత్రి చెరువులోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో నలుగురు జల సమాధి అయ్యారు. మంగళగిరికి చెందిన సాయి, వాసా శ్రీనివాసరావు, నరేంద్రకుమార్‌, యర్రబాలేనికి చెందిన తేజరాంజీ కారులోనే విగతజీవులయ్యారు. సాయి మంగళగిరి పెదకోనేరు వీధిలో ఉంటున్నారు. డాక్యుమెంట్‌ రైటర్‌గా పనిచేస్తున్నారు. చెరువులో పడి తన కుమారుడు మృతి చెందాడన్న సమాచారం తెలిసి తల్లి కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహంపై పడి ఆమె బోరున విలపించారు. తేజరాంజీ మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ప్రైవేటు టైపిస్టు నరేంద్రకుమార్‌, వాసా శ్రీనివాసరావులు మెకానిక్‌లు. శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలు. చీకట్లో చెరువుగట్టున ఉన్న మృతదేహాల వద్దకు సాయి తల్లి మాత్రమే వచ్చారు. మిగిలినవారి బంధువులకు సమాచారం అందకపోవడంతో పోలీసులు ఆటోలో మృతదేహాలను ఎన్‌.ఆర్‌.ఐ. జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహాలను తరలించటంలో మంగళగిరికి చెందిన స్వచ్ఛంధ సంస్థ ఖిద్మత్‌ టీమ్‌ సభ్యులు సహకరించారు.

మరణించిన వాసా శ్రీనివాసరావు

వేగంగా రాయిని ఢీకొట్టి... నలుగురు కృష్ణాయపాలెం నుంచి కారులో రాత్రి 8.30 గంటలకు బయలుదేరారు. రోడ్డు పరిసరాల పట్ల అవగాహన ఉన్న వీరంతా ఊహించని రీతిలో యర్రబాలెం మలుపు వద్ద చెరువులోకి పడిపోయారు. కారు అత్యంత వేగంగా రోడ్డు పక్కన ఆర్‌అండ్‌బీ వారు ఏర్పాటు చేసిన హద్దు రాయిని ఢీకొట్టి చెరువులో బోల్తా పడింది. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్థులు వచ్చి చెరువులోని కారు అద్దాలు పగలగొట్టి అందులోని వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే వారంతా విగతజీవులయ్యారు. మృతదేహాలను గట్టుకు చేర్చారు. అటుగా వెళ్తున్న లారీని ఆపి కారును బయటకు తీశారు.  

మృతులు తేజరాంజీ, నరేంద్రకుమార్‌

రక్షణగోడ లేక...యర్రబాలెంలో ఇది అతి పెద్ద చెరువు. రోడ్డు పక్కనే ఉన్న దీనికి రక్షణగోడ లేదు. రాజధానిలోని  అసెంబ్లీ, హైకోర్టు, రాష్ట్ర సచివాలయానికి వెళ్లి వచ్చే మార్గం ఇది. కీలకమైన ప్రాంతంలో ఉన్న చెరువు నీటి ఉద్ధృతికి రోడ్డు కూడా కోతకు గురైంది. మలుపులో కూడా రివిట్‌మెంట్‌ వాల్‌ ఏర్పాటు చేయకపోవటంతో ప్రమాదం జరిగింది. ఇటీవల ఒక కారు చెరువులోకి దూసుకెళ్లింది. అయితే కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని