logo

నిఘా ఏదీ?

గ్రామాల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నెట్‌వర్క్‌ ఉంది.. ఒక్కో గ్రామాన్ని ఒక్కో కానిస్టేబుల్‌కు దత్తత ఇచ్చి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నాం..  పోలీసు ఉన్నతాధికారులు చెప్పేవి ఉత్తి మాటలేనని తేలిపోయింది.

Published : 18 Jan 2022 03:35 IST

దత్తత గ్రామాల్లో ప్రజలతో మమేకమైతే ఒట్టు

పల్నాడులో వరుస ఘటనలతో బెంబేలు

ఈనాడు, గుంటూరు

గ్రామాల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నెట్‌వర్క్‌ ఉంది.. ఒక్కో గ్రామాన్ని ఒక్కో కానిస్టేబుల్‌కు దత్తత ఇచ్చి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నాం..  పోలీసు ఉన్నతాధికారులు చెప్పేవి ఉత్తి మాటలేనని తేలిపోయింది. తాజాగా జిల్లాలో చోటుచేసుకున్న వరుస ఉదంతాలే అందుకు నిదర్శనం. ఈనెల 13న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెదేపా గ్రామ నాయకుడు తోట చంద్రయ్య హత్య, నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించి పట్టుకుపోవడం వంటివి పోలీసుల నిఘా వైఫల్యాన్ని చాటుతున్నాయి.

ఈ ఘటనల పర్యవసనాలు జిల్లాలో వైకాపా-తెదేపా వర్గీయుల మధ్య భగ్గుమన్నాయి. ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ, పోటాపోటీ ధర్నాలకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల సమస్యకు దారి తీశాయి. పోలీసులకు తెలియకుండానే ఆ ఘటనలు చోటుచేసుకున్నాయంటే వారి నిఘా ఎలా ఉందో ఊహించుకోవచ్చు. జనం అంతా చూస్తుండగానే నడిరోడ్డుపై చంద్రయ్యను తల, కాళ్లు పట్టుకుని అత్యంత దారుణంగా హతమార్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అది రాజకీయ హత్యకాదని పోలీసు, అధికార వైకాపా నేతలు బుకాయిస్తున్నారు. వారు చెబుతున్నట్లే రాజకీయ హత్య కాకపోయినా రెండువర్గాల మధ్య పాతకక్షల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రతీకార హత్యే అయినా అది జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులిది కాక మరెవరిదో గుర్తెరగాలి. గుంటూరు రూరల్‌, అర్బన్‌ జిల్లా పోలీసుల పరిధిలో ఎక్కడా కూడా దత్తత గ్రామాలు, వార్డులు, డివిజన్ల కాన్సెప్టు విధానం పకడ్బందీగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.

రెండు గ్రామాలు  స్టేషన్‌కు దగ్గరే

గ్రామాలు, పట్టణాలపై ఏ మాత్రం పట్టు ఉన్నా అరాచకాలకు తావుండదని విశ్రాంత పోలీసులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని బాకాలు ఊదుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జరగాల్సిన నష్టం జరిగాక ఎన్ని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా ఆ నష్టాన్ని పూడ్చలేమని అంటున్నారు. చంద్రయ్య హత్యకు గురైన గుండ్లపాడు, విగ్రహాలు మాయమైన జొన్నలగడ్డ గ్రామాలు రెండూ కూడా స్టేషన్‌కు ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. సూత్ర, పాత్రధారులకు ఏ మాత్రం పోలీసులు అంటే భయం లేదనేది స్పష్టమవుతుంది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు దత్తత గ్రామాలను తరచూ సందర్శిస్తూ అక్కడ ప్రజలతో మమేకమవుతూ ఉంటే  అనేక విషయాలు అక్కడి ప్రజలే చెబుతారని కానీ ఈ రకమైన పరిశీలన పోలీసులకు లోపించడంతో గ్రామాల్లో ఏం జరిగినా, జరగబోతున్నా ఎవరికీ చెప్పాలో తెలియక మిన్నకుండిపోతున్నారనే అభిప్రాయం లేకపోలేదు.

విగ్రహం  మాయమైనా..

నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఈనెల 13న వైఎస్సార్‌ విగ్రహం మాయమైంది. ఇది రాజకీయంగా బాగా వివాదస్పదమైంది. వైకాపా, తెదేపా పోటాపోటీ ధర్నాలతో మూడు రోజులు జొన్నలగడ్డ, నరసరావుపేట పట్టణంలో రణరంగాన్ని తలపించాయి. అసలు ఆ గ్రామంలో విగ్రహాలు మాయమయ్యే పరిస్థితి ఉన్నా.. ఒక పథకం ప్రకారం దాన్ని పట్టుకుపోయినా అందుకు కారకులెవరో పోలీసులకు గ్రామ రాజకీయాలపై ఒక అవగాహన ఉంటే కొంతవరకు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చి ఉండేవారు. ఆ కోణంలో విచారణ జరిపి ఉంటే కేసును చేధించేవారు. ఘటన జరిగిన నాలుగు రోజులైనా ఇప్పటికీ విగ్రహం లభ్యం కాలేదంటే పోలీసుల పనితీరు, వారి నిఘా ఎంత తీసికట్టుగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. స్టేషన్‌ పరిధిలో ఏం జరుగుతున్నా స్టేషన్‌ పోలీసులే కాదు.. స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్సీ పోలీసులకు తెలియాలని అనేక దశల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పరచుకొని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇవేం వారి దృష్టికి రాలేదంటే అది నిఘా వైఫల్యమా? ఇంకేమైనా కారణాలా అనేది ఉన్నతాధికారులే గుర్తెరిగి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. సచివాలయాల వ్యవస్థ వచ్చాక గ్రామానికో మహిళా పోలీసు ఉన్నారు. వారికేం తెలియకుండా ఈ ఘటనలు చోటుచేసుకున్నాయంటే నమ్మశక్యం కావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని