logo

ఆలోచనలు పంచుకున్నారు!

...హాయ్‌...మీ ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు ఎలా చెబుతున్నారు...వాటిని మీరెలా అర్థం చేసుకుంటున్నారని’ స్వయంగా పిల్లలే అడిగి తెలుసుకోవడం, టీచర్ల

Published : 18 Jan 2022 03:35 IST

ముగిసిన ట్విన్నింగ్‌ ఆఫ్‌ స్కూళ్ల పరిశీలన

ఈనాడు, అమరావతి

...హాయ్‌
...మీ ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు ఎలా చెబుతున్నారు
...వాటిని మీరెలా అర్థం చేసుకుంటున్నారని’ స్వయంగా పిల్లలే అడిగి తెలుసుకోవడం, టీచర్ల బోధనా పద్ధతులపై చర్చించుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకునే విధానానికి పాఠశాల విద్యాశాఖ ఇటీవల శ్రీకారం చుట్టింది. ఒక పాఠశాల విద్యార్థులు మరో పాఠశాలకు చెందిన పిల్లలతో ఆన్‌లైన్‌లో మమేకమై బోధనా పద్ధతుల నుంచి చదువుకునే దాకా ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకునే కార్యక్రమానికి రాష్ట్ర సమగ్రశిక్ష శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా సమగ్ర శిక్ష అధికారులు ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో దాన్ని విద్యార్థులు పరిశీలించేలా చర్యలు తీసుకున్నారు. దీన్ని కవల పాఠశాలలు (ట్విన్నింగ్‌ ఆఫ్‌ స్కూల్స్‌) అంటారు. ప్రస్తుతం ఎక్కడైతే చదువుతున్నారో అదే పాఠశాలలో పిల్లలు ఉండి ఎంపిక చేసిన మరో పాఠశాలకు చెందిన విద్యార్థులతో ఆన్‌లైన్‌లో మాట్లాడుకోవడం, టీచర్లు చెప్పే సలహాలు ఒకరికొకరు పంచుకోవడం చేశారు. ఒక పట్టణ పాఠశాల విద్యార్థులతో మరో గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులతో మమేకమయ్యేలా ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయా పాఠశాలల్లో ఉత్తమ బోధనా విధానాలను (బెస్ట్‌ ప్రాక్టీసెస్‌) ఆచరించడానికి, అమలు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ నెల 5, 7 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా 50 మండలాల్లోని 200 పాఠశాలల్లో రెండు రోజుల పాటు సమగ్రశిక్ష అధికారులు, ఉపాధ్యాయులు ట్విన్నింగ్‌ ఆఫ్‌ స్కూల్స్‌ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో 10వేల మందికి పైగా విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. దీని వల్ల పిల్లల్లో సామర్థ్యాలు సహచర విద్యార్థులకు తెలుస్తుంది. ఆపై టీచర్లతో ప్రతి విద్యార్థికి అనుబంధం ఏర్పడుతుంది.

ఎలా మాట్లాడుకున్నారంటే...

స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు వంటివి వినియోగించి విద్యార్థులు మాట్లాడుకునేలా అవకాశం కల్పించారు. ప్రతి టీచర్‌ తన వద్ద ఉన్న ఫోన్‌ను అందజేశారు. ఆన్‌లైన్‌లో పిల్లలు కనిపించేలా, ఒకరికొకరు మాట్లాడుకునేలా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకున్నారు.  దీనివల్ల ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయలు అమలు చేస్తున్న ఉత్తమ బోధనా పద్ధతుల గురించి తెలుసుకోవటానికి పిల్లలకు మంచి అవకాశం కలుగుతుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్లో మమేకమవ్వడం వల్ల ఎక్కువ సేపు పిల్లలతో మాట్లాడగలుగుతున్నామని కొందరు విద్యార్థులు చెప్పారు.

ఎంపిక చేసిన పాఠశాలల్లోనే..

ప్రతి మండలంలో ఎంపిక చేసిన నాలుగు పాఠశాలల్లో ఈ పరిశీలన చేశారు. మొదటి విడతలో 50 మండలాల్లో 200 పాఠశాలల్లో దీన్ని అమలు చేశారు. ఎంపిక చేసిన మండలంలో ఏవైనా రెండు పట్టణ పాఠశాలలు, మరో రెండు గ్రామీణ నేపథ్యం ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకుని కవల పాఠశాలల్లో బోధనా పద్ధతుల నుంచి పిల్లలు ఆ పాఠ్యాంశాలను ఎలా చదువుతున్నారు, ఎలా అర్థం చేసుకున్నారని పిల్లలే ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని