logo

ప్రాణం విలువ తెలియని వయసు

ద్విచక్ర వాహనంపై స్నేహితుడితో కలిసి సరదాగా వెళ్తున్న బాలుడిని విభాగిని రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన అల్లారుముద్దుగా పెంచుకుంటున్న అతని తల్లిదండ్రులకు తీరని వ్యథను మిగిల్చింది.

Published : 18 Jan 2022 03:35 IST

బైకు చేతబట్టి బలైన బాలుడు

మృతుడు రవికిరణ్‌

పెదనెమలిపురి(రాజుపాలెం), న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై స్నేహితుడితో కలిసి సరదాగా వెళ్తున్న బాలుడిని విభాగిని రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన అల్లారుముద్దుగా పెంచుకుంటున్న అతని తల్లిదండ్రులకు తీరని వ్యథను మిగిల్చింది. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాజుపాలెం మండలం పెదనెమలిపురి వద్ద ద్విచక్ర వాహనం రోడ్డు విభాగినిని ఢీకొన్న ఘటనలో ఒక బాలుడు మృతి చెందగా మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న కుంచాల రవికిరణ్‌ (13), అక్కడి రంగారాయుడు చెరువు సమీపంలోని పీవీఆర్‌ మున్సిపల్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న అక్కల ప్రభాకర్‌ ప్రతి ఆదివారం ఒక ప్రార్థనా మందిరానికి వెళ్తుంటారు. అక్కడ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. సోమవారం రవికిరణ్‌ రిజిస్ట్రేషన్‌ నెంబరు లేని ద్విచక్ర వాహనం తీసుకుని పాఠశాలకు వెళ్తున్న ప్రభాకర్‌ వద్దకు వచ్చాడు. అనంతరం ఇద్దరూ కలిసి హైదరాబాద్‌ వెళ్దామనుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పెదనెమలిపురి వద్ద అదుపుతప్పి రోడ్డు విభాగినిని ఢీకొట్టారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న రవికిరణ్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ప్రభాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మాచవరం 108 సిబ్బంది ప్రేమ్‌సాగర్‌, రవితేజ క్షతగాత్రుడిని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ఒంగోలు తీసుకెళ్తున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. రవికిరణ్‌ మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై కలగొట్ల అమీర్‌ కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని తల్లిదండ్రులు సత్తెనపల్లిలో అచేతనంగా పడి ఉన్న బిడ్డను చూసి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

గాయపడిన ప్రభాకర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని