logo

స్పందన పై సంక్రాంతి ప్రభావం

విజయవాడ డివిజన్‌ కేంద్రమైన సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి పండగ నేపథ్యం.. వరుస సెలవులు రావడంతో జనం రద్దీ తగ్గింది. గత వారం 96 వినతులు రాగా..

Updated : 18 Jan 2022 05:59 IST

సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌కు సమస్యను వివరిస్తున్న మల్లవల్లి భూముల బాధితులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: విజయవాడ డివిజన్‌ కేంద్రమైన సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి పండగ నేపథ్యం.. వరుస సెలవులు రావడంతో జనం రద్దీ తగ్గింది. గత వారం 96 వినతులు రాగా.. ఈ వారం 59 అర్జీలు మాత్రమే వచ్చాయి. సబ్‌కలెక్టర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.

* నగరంలోని గుణదల, విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు బాపులపాడు మండలం మల్లవల్లిలో ఒక రియల్‌ఎస్టేట్‌ సంస్థ నుంచి 200 గజాల చొప్పున స్థలాలను కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగా.. ఈక్రమంలో గుడివాడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రంగ ప్రవేశం చేసి, సదరు భూముల చుట్టూ ముళ్ల తీగ వేశారని, తమ భూముల్లో వేసిన ముళ్ల కంచెను తొలగించేలా చూడాలని తొమ్మిది మంది బాధితులు స్పందనలో వినతిపత్రం సమర్పించారు.

* గొల్లపూడి-చినఅవుటపల్లి మధ్య ఆరు వరుసల బైపాస్‌ రోడ్డును నిర్మిస్తున్న క్రమంలో సర్వీసు రోడ్డు వేయట్లేదని, దీంతో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెదురుపావులూరుకు చెందిన పాలడుగు శివశంకర్‌ ప్రసాద్‌, పాతపాడుకు చెందిన అవుతు శంకరరెడ్డి వాపోయారు. 2013లో భూములు సేకరిస్తున్న క్రమంలో సర్వీసు రోడ్డు ఉంటుందని చెప్పి, నేడు లేదనడం సరికాదన్నారు.

ఇవీ విన్నపాలు...

వ్యవసాయ అవసరాల కోసం తీసుకునే రుణాలకు 7 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేయాలని, 13.5 శాతం వసూలు చేయడంతో రాయితీలు రాని పరిస్థితి ఏర్పడిందని ఇబ్రహీంపట్నం గుంటుపల్లికి చెందిన రైతు సమాఖ్య నాయకుడు చెరుకూరి వేణుగోపాల్‌ విన్నవించారు.

* తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని వత్సవాయి మండలం దబ్బాకుపల్లెకు చెందిన షేక్‌ మహబూబ్‌ అర్జీ అందజేశారు.

* వైఎస్సార్‌ చేయూత నిధులు జమ చేయాలని నగరంలోని వాంబేకాలనీకి చెందిన పోతల గోవిందమ్మ విజ్ఞప్తి చేశారు.

* విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడికి చెందిన మహ్మద్‌ ఖాన్‌ తన కుమార్తెకు అమ్మఒడి సొమ్ము జమ కాలేదని, వాటిని ఇప్పించాలని కోరారు.


పరిష్కారానికి చర్యలు

స్పందన వినతుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు సబ్‌కలెక్టర్‌ తెలిపారు. రెవెన్యూ శాఖకు 24, వీఎంసీకి 9, మిగతా శాఖలకు 26 వినతులు.. వెరసి 59 అర్జీలు అందినట్టు వెల్లడించారు. పారిశుద్ధ్యం సరిగా లేదని వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన క్రమంలో, ఆయా ఫొటోలను పంపి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. స్పందన అర్జీల విషయంలో సంబంధిత అధికారులు ఎండార్స్‌మెంటు ఇస్తున్నారా? వాటిని పరిష్కరిస్తున్నారా? అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ కరోనా కట్టడికి కలెక్టర్‌ నేతృత్వంలో చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి ఎస్‌.శ్రీనివాసరెడ్డి, డివిజనల్‌ పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో...

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 31 ఫిర్యాదులు వచ్చాయి. అడ్మిన్‌ డీసీపీ డి.మేరీప్రశాంతి బాధితులతో వీడియో కాన్ఫరెన్స్‌ మాట్లాడి వారి ఫిర్యాదులు సీˆ్వకరించారు. వచ్చిన మొత్తం 31 ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలకు సంబంధించినవి 8, సివిల్‌ వివాదాలు 6, నగదు లావాదేవీలపై 5, వివిధ మోసాలపై 2, అద్దె వివాదాలపై 1, దొంగతనం కేసుకు సంబంధించి 1, ఇతర ఫిర్యాదులు 8 వచ్చాయి. వీటిని పరిష్కరించాలని ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. దిశ ఏసీపీ వి.వి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని