logo

లక్ష్యంపై గురి.. లక్షణంగా చేరి!

వారంతా పేద పిల్లలు.. గ్రామీణ నేపథ్యంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లోనే పదోతరగతి వరకు చదివారు. అనంతరం ప్రతిభ చూపి ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు సాధించారు. అక్కడ ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ..

Published : 18 Jan 2022 05:07 IST

సబ్జెక్టుపై పట్టు సాధిస్తే కొలువు సులువే..

ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌ ఎంపికల్లో విద్యార్థుల సత్తా

న్యూస్‌టుడే, నూజివీడు

వారంతా పేద పిల్లలు.. గ్రామీణ నేపథ్యంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లోనే పదోతరగతి వరకు చదివారు. అనంతరం ప్రతిభ చూపి ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు సాధించారు. అక్కడ ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ.. సబ్జెక్టుపై పట్టు పెంచుకుని రు.లక్షల కొలువులను కైవసం చేసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో సుమారు రూ.20 లక్షల ప్యాకేజీతో ఆర్జీయూకేటీ నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు పలువురు ఉద్యోగాలు పొందారు. గతేడాది ఆగస్టు నుంచి నుంచి డిసెంబరు వరకు సుమారు 40 కంపెనీలు నిర్వహించిన ఎంపికల్లో ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు క్యాంపస్‌ నుంచి 366మంది, శ్రీకాకుళం క్యాంపస్‌ నుంచి 302 మంది చొప్పున మొత్తం 668 మంది విద్యార్థులు చివరి సంవత్సరం పూర్తికాకుండానే వివిధ సంస్థల్లో కొలువురు సాధించారు. వీరిలో బెంగళూరుకు చెందిన ఎన్‌లాగ్‌ డివైసెస్‌ కంపెనీలో లాంగ్‌ టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికై, ప్రస్తుతం నెలకు రూ.30 వేలు స్టైఫండ్‌ తీసుకుంటూ.. సంవత్సరానికి రూ.20 లక్షల ప్యాకేజీని నలుగురు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది చివరి పరీక్షలు ముగియగానే వీరు కొలువుల్లో చేరనున్నారు. ఈ సందర్భంగా వారి ప్రతిభాపాఠవాల గురించి ‘న్యూస్‌టుడే’తో ఇలా పంచుకున్నారు.

మూడో ఏడాదిలోనే ఉద్యోగం..

నా పేరు జి.సాయికృష్ణ, నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ చివరి ఏడాది చదువుతున్నాను. మా స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. నాన్న శంకరరావు, అమ్మ సరస్వతి వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఇంజినీరింగ్‌లో చేరిన మొదటి సంవత్సరం నుంచే సబ్జెక్టులో పట్టు సాధించేందుకు కృషి చేశా. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ వచ్చాను.. మూడో సంవత్సరం ఎన్‌లాగ్‌ డివైసెస్‌ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో లాంగ్‌ టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌ సాధించాను. ప్రస్తుతం రూ.30వేల స్టైఫండ్‌తో వారే శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది చివరి పరీక్షలు పూర్తి కాగానే రూ.20 లక్షల ప్యాకేజీ ఇస్తామన్నారు. ముఖాముఖికి హాజరయ్యే వారు సబ్జక్టులోని అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.

కొత్త విషయాలు తెలుసుకోవాలి..

నా పేరు షేక్‌ రేష్మా, ఈసీఈ చివరి ఏడాది చదువుతున్నాను. గుంటూరు జిల్లా, రాజుపాలెం స్వగ్రామం. నాన్న వలి వ్యవసాయం చేస్తుంటారు. అధ్యాపకుల సూచనల మేరకు ఇంగ్లీష్‌ ల్యాబ్‌ను పూర్తిగా వినియోగించుకున్నాను. ప్రస్తుతం మారుతున్న సాంకేతిక అంశాల గురించి తెలుసుకుంటూ అన్ని రకాలుగా అప్‌డేట్‌ అయ్యాను. దీంతోపాటు సబ్జక్టులోని క్లిష్టమైన విషయాల గురించి నిత్యం తోటివారితో చర్చించేదాన్ని. ఇవన్నీ ఇంటర్వ్యూలకు బాగా ఉపయోగపడ్డాయి. రూ.20లక్షల ప్యాకేజీతో కొలువు సాధించాను.

అమ్మానాన్నల ఆకాంక్ష కోసం...

నా పేరు గోపిశెట్టి నాగసత్యశ్రీ, ఈసీఈ చివరి ఏడాది చదువుతున్నాను. మాది తూర్పుగోదావరి జిల్లా పొడగట్లపల్లి గ్రామం. నాన్న గ్రామంలో బ్రాంచి పోస్టు మాస్టర్‌గా పనిచేస్తారు. నన్ను బాగా చదివించాలనేది అమ్మా, నాన్నల ఆకాంక్ష. వారి ఆశలను ఒమ్ముచేయకుండా ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలోనే ఎన్‌లాగ్‌ డివైసెస్‌ కంపెనీలో లాంగ్‌ టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యాను. అధ్యాపకుల సహకారంతోపాటు, ప్రతి విషయాన్ని మూలాల వరకు తెలుసుకుంటాను. దీంతో ముఖాముఖిలో క్లిష్టప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగాను. మంచి ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉంది.

పెద్ద సంస్థలో చేరడం సంతోషంగా ఉంది...

నా పేరు ఎస్‌.పూర్ణ శివతేజ, ఈసీఈ చివరి ఏడాది చదువుతున్నాను. మాది తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ పరిధిలోని సర్పవరం గ్రామం. నాన్న ప్రసాదరావు టైలర్‌. ట్రిపుల్‌ఐటీలో పీయూసీ నుంచే ఐటీ గురించి పాఠాలు ఉంటాయి. వాటి గురించి అధ్యాపకులు బోధిస్తున్నప్పుడు ప్రణాళికాబద్ధంగా చదివాను. సబ్జెక్టు పరంగా అధ్యాపకుల సూచనల మేరకు వివిధ పుస్తకాలు రిఫర్‌ చేసుకున్నాను. దీంతో నేను ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలోనే ఎన్‌లాగ్‌ డివైసెస్‌ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో లాంగ్‌టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యా. ప్రస్తుతం రూ.30 వేల స్టైఫండ్‌తో పని చేస్తున్నాను. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ పూర్తికాగానే రూ.20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఖరారు అవుతుంది.

బోధనా సిబ్బంది కృషే కారణం.. - ఆచార్య జీవీఆర్‌ శ్రీనివాసరావు, నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌

క్యాంపస్‌లోనే విద్యార్థులకు రూ.లక్షల ప్యాకేజీతో కొలువులు వచ్చాయంటే దీని వెనుక బోధనా సిబ్బంది కృషి ఎంతో ఉంది. విద్యార్థులు సైతం అధ్యాపకులతో సక్యతగా ఉండి.. వారి సూచనలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఆర్జీయూకేటీ ప్రవేశపెట్టిన లాంగ్‌ టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని