Ap News: రివర్స్‌ టెండరింగ్‌ తరహాలో రివర్స్‌ ఫిట్‌మెంట్‌ ఇచ్చారు: ఉద్యోగ సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను

Updated : 18 Jan 2022 15:13 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సంక్రాంతి తర్వాత సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్‌సీ జీవోలపై ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ ఐక్యవేదిక నేతలు విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర చరిత్రలో ఇలా జరగలేదు: బండి శ్రీనివాసరావు

‘‘రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉద్యోగులకు ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ తీసేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పెట్టారు. రాజధాని ప్రాంతంలో పని చేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మాకు కొత్త పీఆర్సీ అవసరం లేదు. ఈ జీవోలు మాకొద్దు. మేం వాటిని తిరస్కరిస్తున్నాం. ఈ పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే ఇవ్వండి. పదేళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ మాకు అవసరం లేదు. పెన్షనర్ల హక్కులు కూడా ఈ ప్రభుత్వం పోగొట్టింది. ఈ విషయంలో సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలి. రేపు, ఎల్లుండి ఉద్యోగ కమిటీ సమావేశాలు నిర్వహిస్తాం. అన్ని జిల్లాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతాం. అవసరమైతే సమ్మె కు కూడా సిద్ధంగా ఉన్నాం. పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చే వరకు పోరాడుతాం’’ అని పేర్కొన్నారు.

డీఏలు అడ్డుపెట్టుకొని పీఆర్సీ ఇచ్చారు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

‘‘ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రభుత్వానికి ప్రేమ లేదు. డీఏలు అడ్డుపెట్టుకొని పీఆర్సీ ఇచ్చారు. మాకు ఈ పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదు. పీఆర్సీపై జారీ చేసిన జీవోలు మాకొద్దు. ఇప్పటివరకు ప్రభుత్వంతో అనేక రకాల చర్చలు జరిపాం. కానీ ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా జీవోలు తీసుకొచ్చింది.ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఏకతాటిపైకి  వచ్చి ప్రకటించే కార్యాచరణ అమలు చేయాలి. సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు.

20 అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టింది: జోసెఫ్‌ సుధీర్‌బాబు 

‘‘ఉద్యోగ, ఉపాధ్యాయ చరిత్రలో ఇదొక చీకటి రోజు. మేము ప్రతిపాదించిన 20 అంశాలను ప్రభుత్వం పక్కన పెట్టింది. రివర్స్‌ టెండరింగ్‌ తరహాలో రివర్స్‌ ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. మాకు నష్టం కలిగే పీఆర్సీ వద్దు. కనీసం పాత మధ్యంతర భృతి కొనసాగించడండి. మేం నమ్మిన ప్రభుత్వమే మమ్మల్ని మోసం చేసింది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. జీవోలు వెనక్కి తీసుకోకపోతే ఎంతవరకైనా వెళ్తాం’’ అని ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జోసెఫ్‌ సుధీర్‌బాబు తెలిపారు.

ఉద్యోగుల తలరాత అనుకోవాలి: ఆస్కార్‌ రావు

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలు ఉద్యోగుల తలరాత అనుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆస్కార్ రావు అన్నారు. నెల నెలా ఇచ్చే జీతభత్యాలపైనా ఉద్యోగుల పట్ల ప్రతికూలతను, మొండి వైఖరిని బయటపెట్టి ఏకపక్ష జీవోలను విడుదల చేసిందని విమర్శించారు. శాఖలో పని ఒత్తిడి, అధికారుల వేధింపులు, ఉన్నతాధికారుల నిరాదరణ, తిట్లు, శాపనార్థాలు ఇంతకాలం భరిస్తూ వచ్చామన్నారు. కరోనాతో చాలా మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారని తెలిపారు. ఉద్యమాలు నిర్మించడంలో మారుతున్న ఉద్యోగి వైఖరి రీత్యా కొంత అలసత్వాన్ని ప్రదర్శించామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సమ్మె నోటీసు కనీసం 15 రోజులు ముందు ఇవ్వాలని.. అయితే సమయం లేనందున ఇవాళే నోటీస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈలోగా ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలియజేయనున్నట్లు ఆస్కార్ రావు వెల్లడించారు.

రేపటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన..

పీఆర్సీ జీవోలపై సచివాలయ ఉద్యోగుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సచివాలయంలో రెండు గంటల పాటు సమావేశమైన ఉద్యోగులు.. పీఆర్సీ జీవోలు జారీ చేసిన విధానంపై చర్చించారు. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏలను భారీగా తగ్గించడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన బాట పట్టాలని నిర్ణయించారు. రేపటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేయాలని నిర్ణయించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు సెక్రటేరీయేట్ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. భద్రతా సిబ్బంది కొందరిని మాత్రమే ఫస్ట్ బ్లాక్ వద్దకు అనుమతించారు. రేపటి నుంచి తాము ఆందోళన చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు. పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేసారు. సీఎస్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో విజ్ఞాపన పత్రం ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని