logo

అక్కడి నుంచే కథ నడిచింది..

ఇటీవల వెలుగు చూసిన ఆయిల్‌ ట్యాంకర్ల కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు ట్యాంకర్లు లేకుండానే వాటికి ఆర్సీలు సృష్టించిన కేసులో మూలాలు ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే ఉన్నాయి.

Published : 19 Jan 2022 03:31 IST

అరుణాచల్‌ ప్రదేశ్‌ ఆర్టీవో కార్యాలయంలోనే బీజం
ఈనాడు - అమరావతి

టీవల వెలుగు చూసిన ఆయిల్‌ ట్యాంకర్ల కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు ట్యాంకర్లు లేకుండానే వాటికి ఆర్సీలు సృష్టించిన కేసులో మూలాలు ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే ఉన్నాయి. కథ అంతా అక్కడి రవాణా శాఖ కార్యాలయంలోనే నడిచింది. ఆ రాష్ట్రంలోని లోయర్‌ సుభాన్‌సిరి జిల్లా రవాణా కార్యాలయంలో అధికారులు డబ్బులకు కక్కుర్తి పడి లేని ట్యాంకర్ల వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌ అయిన వాహన్‌లోకి అప్‌లోడ్‌ చేశారు. అన్ని రాష్ట్రాలకు ఈ వెబ్‌సైట్‌ ప్రామాణికం. ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసే సమయంలో ఇందులోని వాహనాల వివరాలను పరిగణలోకి తీసుకుని ఆమోదిస్తుంటారు. ముఖ్యమైన ఈ సైట్‌లోనే తప్పుడు వివరాలు ఉండడం, భౌతికంగా వాహనాలను తనిఖీ చేయకుండానే ఆమోదం తెలపడంతో కుంభకోణం జరిగింది.
అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఏపీకి బదిలీ చేసేందుకు అక్కడ అధికారులకు ఇచ్చిన బీమా, కాలుష్య నియంత్రణ పత్రాలు నకిలీవి. వీటినే అక్కడి అధికారులు నమోదు చేసి, నిరభ్యంతర పత్రం జారీ చేశారు. ఈ ఎన్‌వోసీల ఆధారంగా కృష్ణా జిల్లాకు 11 ఆయిల్‌ ట్యాంకర్లు బదిలీ అయ్యాయి. వీటిలో విజయవాడ లేబర్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ గౌస్‌ మొహిద్దీన్‌ పేరున ఐదు, కొండపల్లికి చెందిన సత్యనారాయణ పేరున మరో ఐదు, గొల్లపూడికి చెందిన శివరామప్రసాద్‌ పేరున ఒకటి చొప్పున రిజిస్టర్‌ అయ్యాయి. ఈ వ్యవహారంలో నందిగామ ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే విఠల్‌ కీలక పాత్ర పోషించాడు. తన అధికార పరిధి దాటి ఎంవీఐ పాత్ర పోషించాడు. ఈ ఉదంతానికి సంబంధించి రవాణా శాఖ అంతర్గతంగా దర్యాప్తు చేసింది. దీని ఆధారంగా సూర్యారావుపేట పోలీసు స్టేషనులో ఇటీవల ఫిర్యాదు అందించారు.
నలుగురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులంతా పరారయ్యారు. వీరిలో ఒకరిపై నెల్లూరు జిల్లాలోని కుంభకోణంలోనూ ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. గత ఏడాది జూన్‌ నుంచి నవంబరు వరకు వీటిని రీ రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తేలింది. కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఉన్న కీసర, పొట్టిపాడు, బాడవ, దావులూరు, కలపర్రులోని టోల్‌ప్లాజాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కూడా పరిశీలించారు. ఆ వాహనాలు వీటి గుండా రాలేదని బయటపడింది. దీనికి తోడు పోర్టల్‌లో నమోదు చేసిన వాహనాల విన్‌ నెంబర్లు వివరాలను టాటా మోటార్స్‌, అశోక్‌లేల్యాండ్‌ కంపెనీలకు పంపించారు. అసలు ఈ నెంబర్ల గల వాహనాలను తాము తయారు చేయలేదని సమాధానం ఇచ్చాయి. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన చిరునామాలు కూడా తప్పులే. గన్నవరంలోని వాహన తనిఖీ కేంద్రంలో వీటిని పరిశీలించినట్లు సూత్రధారి విఠల్‌ నమోదు చేశాడు. కానీ.. అక్కడ ఈ ప్రక్రియ జరగలేదని తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని