logo

పీఆర్సీని అంగీకరించేది లేదు

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ, దాన్ని అమలు చేస్తూ జారీ చేసిన జీవోలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలోని ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం ఆందోళనలు, ర్యాలీలతో కదం తొక్కాయి. ఆయా మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు

Published : 19 Jan 2022 03:31 IST

జీవోల జారీపై ఉపాధ్యాయుల కన్నెర్ర
ఈనాడు, అమరావతి

మంగళవారం గుంటూరు మండల విద్యావనరుల కేంద్రం వద్ద మానవహారంగా ఏర్పడి జీవోల జారీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ, దాన్ని అమలు చేస్తూ జారీ చేసిన జీవోలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలోని ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం ఆందోళనలు, ర్యాలీలతో కదం తొక్కాయి. ఆయా మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు హోరెత్తాయి. నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు విధులకు హాజరై వినూత్నంగా నిరసన తెలిపారు. యధావిధిగానే బోధనకు ఉపక్రమించారు. ఆయా ప్రాంతాల్లో తహసీల్దార్‌, ఎంఈవో కార్యాలయాలు, బస్టాండ్‌ ప్రదేశాలు, ప్రధాన కూడళ్ల వద్ద మానహారంగా ఏర్పడి జీవో ప్రతులు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలుగా వెళ్లి పలుచోట్ల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తున్నామని, తక్షణమే అమలు జీఓలను నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాప్టోగా ఏర్పాటై ఒకే గూటి కిందకు వచ్చి నిరసన తెలిపాయి. జిల్లా కేంద్రం గుంటూరులోని ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ఫ్యాప్టో నాయకులు బసవలింగారావు తదితరులు జీవో ప్రతులను తగలబెట్టారు. మంగళగిరి, పెదకూరపాడు, క్రోసూరు, పెదనందిపాడు, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, కారంపూడి, యడ్లపాడు, దుగ్గిరాల, అమృతలూరు, పెదనందిపాడు, పిడుగురాళ్ల, నూజెండ్ల, కాకుమాను, గురజాల, నిజాంపట్నంలో తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఫిరంగిపురం, మేడికొండూరులో ఎంఈఓ కార్యాలయాలు, మాచర్ల బస్టాండ్‌కూడలి, నరసరావుపేటలో ప్రధాన రహదారిలో ర్యాలీలు చేశారు. పీఆర్సీ చరిత్రలో ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తక్కువగా ఇచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని, ఆ విధంగా తీసుకున్న ఉద్యోగులు లేరని ప్యాప్టో నాయకుడు బసవలింగారావు గుర్తు చేశారు. పీఆర్సీకి సంబంధించి అశుతోష్‌ మిశ్రా ఇచ్చిన కమిటీ నివేదికను బయటపెట్టాలని, ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ ఎక్కువ ప్రకటించాలని, హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబుల విధానాన్ని అమలుపరచాలి, సీసీఏ అలవెన్సులు యధావిధిగా కొనసాగించాలి, 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేస్తామని చెప్పడాన్ని ఉపసంహరించుకోవాలి, ఐఆర్‌కన్నా ఫిట్‌మెంట్‌ ఎక్కువగా ప్రకటించే వరకు దశలవారీగా జిల్లాలో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తాజా పీఆర్సీతో ప్రస్తుతం ఇచ్చే జీతాల్లోనే కోతపడుతుందని ప్రభుత్వానికి తెలియజేస్తే, అది ఏ మాత్రం ఆలకించకుండా రాత్రికి రాత్రే అమలు జీవోలు ఇవ్వటం దుర్మార్గమని పలువురు ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులతో పాటు తమ కుటుంబాలు ఖండిస్తున్నాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు పాఠశాలల వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఏపీఎన్జీఓ తరఫున మాత్రం ఉద్యోగులు ఆందోళనలు చేయకపోయినా విధులకు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనలను నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని