logo

కొవిడ్‌చేరికలు... వందకు పెరిగాయ్‌

జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు ఊహించని విధంగా నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే 758 వచ్చాయి. ఇది వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది. ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో మూడు రోజుల క్రితం 46 మంది ఇన్‌పేషెంట్లు ఉండగా మంగళవారం నాటికి ఆ సంఖ్య వందకు చేరింది. ప్రాథమికంగా ఏర్పాటు చేసిన పడకలన్నీ సంబంధిత రోగులతో నిండిపోయాయి.

Published : 19 Jan 2022 03:31 IST

ఎలక్టివ్‌ సర్జరీలు వాయిదా
ఈనాడు, అమరావతి

జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు ఊహించని విధంగా నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే 758 వచ్చాయి. ఇది వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది. ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో మూడు రోజుల క్రితం 46 మంది ఇన్‌పేషెంట్లు ఉండగా మంగళవారం నాటికి ఆ సంఖ్య వందకు చేరింది. ప్రాథమికంగా ఏర్పాటు చేసిన పడకలన్నీ సంబంధిత రోగులతో నిండిపోయాయి.

ఇటీవల వరకు జిల్లాలో సగటున రోజుకు వంద లోపే కేసులు నమోదు కావడం, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య బాగా స్వల్పంగా ఉండడంతో కేవలం రెండు వార్డులు మాత్రమే కొవిడ్‌ రోగులకు కేటాయించారు. ఆ రెండింటిలో ప్రస్తుతం రోగులు చేరిపోవడంతో మరికొన్ని వార్డులు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒక్కసారిగా రోగులు పెరగడంతో తాజాగా ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు (ఎలక్టివ్‌ సర్జరీలు) నిలిపివేశారు. వాటిని వాయిదా వేయాలని సూపరింటెండెంట్‌ ఆచార్య ప్రభావతి విభాగాధిపతులను ఆదేశించారు. ఇటీవల వరకు పాజిటివ్‌ కేసులు చాలా స్వల్పంగా వస్తున్నాయని ముందస్తుగా పడకలు సిద్ధం చేయలేదు. గడిచిన ఐదు రోజుల నుంచి కేసులు బాగా వస్తుండడం, ఆస్పత్రుల్లో చేరే రోగులు పెరగడంతో వారి ప్రవేశాలకు అనుగుణంగా నాన్‌కొవిడ్‌ వార్డులను ఖాళీ చేసి కొవిడ్‌ పేషెంట్లకు కేటాయించాలని ఇప్పటికే ఆసుపత్రిలోని ఆయా విభాగాల వైద్యాధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. ఎన్ని వార్డులు అయినా వారికి కేటాయించడానికి ప్రాధాన్యమిస్తామని ఆసుపత్రి అధికారులు స్పష్టం చేశారు. రోజురోజుకు వైరస్‌ బాగా వ్యాప్తి చెందుతోందని, అందువల్ల ఈసారి చాలా వరకు పడకలు కొవిడ్‌ సేవలకే కేటాయించాల్సి వస్తుందని ఆస్పత్రి వర్గాలు భావిస్తున్నాయి.

యధావిధిగా అత్యవసర శస్త్రచికిత్సలు
ఆయా విభాగాల్లో వారానికి రెండు రోజులు ఎలక్టివ్‌ సర్జరీలు నిర్వహిస్తారు. ఈ కేసులకు ఆ రోజునే చేయాల్సిన అవసరం ఉండదని వారం, పది రోజుల తర్వాత చేసిన వారికి ఎలాంటి ప్రాణపాయం ఉండదనే కేసులకు ఇప్పట్లో శస్త్రచికిత్సలు చేయకూడదని ఆసుపత్రి ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచే దీన్ని అమలు చేస్తున్నారు. కొవిడ్‌ రోగుల రద్దీ దృష్ట్యా ఆస్పత్రి ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని వాయిదా వేయడంతో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందిని కొవిడ్‌ వార్డులకు సర్దుబాటు చేయడానికి ప్రస్తుతానికి ఎలక్టివ్‌ సర్జరీలు వాయిదా వేశామని ఆసుపత్రివర్గాలు తెలిపాయి. అత్యవసర శస్త్రచికిత్సలు యధావిధిగానే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.

ఔషధాలకు ఇండెంట్లు...
బోధనాసుపత్రి సూపరింటెండెంట్లతో మంగళవారం రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు జూమ్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి కొవిడ్‌ కేసులపై సమీక్షించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే అవసరమైన మందులకు ఇండెంట్లు పంపాలని, వాటిని కేంద్ర ఔషధ భాండాగారం నుంచి పొందాలని డీఎంఈ సూచించారు. గుంటూరు జీజీహెచ్‌లో రెమ్‌డ్‌సెవిర్‌తో పాటు ఐవీ ఫ్లూయిడ్స్‌ వంటివి లేవని, వాటిని సమకూర్చుకోవటానికి ఇండెంట్లు పంపామని ఆసుపత్రివర్గాలు పేర్కొన్నాయి. వైద్యులు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, రోగులకు ఆక్సిజన్‌ మాస్కులు సమకూర్చుకుని మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఆసుపత్రి సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో పనిచేస్తున్న 10 మంది పీజీ వైద్యులు, 15 మంది హౌస్‌ సర్జన్లు, 12 మంది నర్సులు వైరస్‌ బారిన పడ్డారు.


రద్దీకి అనుగుణంగా కొవిడ్‌ వార్డుల ఏర్పాటు
-డాక్టర్‌ ప్రభావతి, సూపరింటెండెంట్‌

నాన్‌కొవిడ్‌ విభాగాల నుంచి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేసుకుంటున్నాం. మూడో వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంటోంది. రోగుల రద్దీకి అనుగుణంగా నాన్‌కొవిడ్‌ వార్డులను ఖాళీ చేయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. వైరస్‌బారిన పడుతున్న వారిలో ఆసుపత్రి ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఇది ప్రమాదకరం కాదు. తిరిగి త్వరగానే కోలుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని