logo

తేడా వస్తే కొరడా

కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయితే.. మిగిలిన వారు లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలని, పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ సూచించారు. జిల్లాలో రోజు వారీ పరీక్షల

Published : 23 Jan 2022 03:17 IST

ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు సాగవు..

‘ఈనాడు’తోకలెక్టర్‌ జె.నివాస్‌

ఈనాడు, అమరావతి

కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయితే.. మిగిలిన వారు లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలని, పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ సూచించారు. జిల్లాలో రోజు వారీ పరీక్షల సంఖ్యను పెంచామని జిల్లాకు లక్ష కిట్స్‌ అందిస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్‌ పాండమిక్‌ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల ఆటలు సాగనీయబోమని కలెక్టర్‌ హెచ్చరించారు. ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వివరించారు.!

జిల్లాలో కరోనా కేసుల వ్యాప్తి ఉద్ధృతంగానే ఉంది. అదే స్థాయిలో పరీక్షల సంఖ్యను పెంచుతున్నాం. రోజులు 4వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రైవేటు ల్యాబ్‌లలో రూ.350 మాత్రమే తీసుకోవాలని ఆదేశించాం. కొన్ని ల్యాబ్‌లు తనిఖీలు చేశాం. ఎక్కువ తీసుకుంటున్న వారి వద్ద నుంచి తిరిగి రోగులకు ఇప్పించాం. జిల్లాలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక కుటుంబలో కరోనా లక్షణాలతో పరీక్ష చేయించుకుని నిర్థరణ అయితే మిగిలిన వారు కూడా చికిత్స తీసుకోవాలి. పరీక్షలు అవసరం లేదు.

* ఎక్కువ మంది ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాలో 2887 మందికి కరోనా క్రియాశీలక కేసులు ఉన్నాయి. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో 28 మంది ఆసుపత్రిలో 201 మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు.

* ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 15 కొవిడ్‌ కేర్‌ సెంటర్లు సిద్ధం చేశాం. ప్రతి సెంటర్‌కు ఒక అధికారి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. పడకలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రస్తుతం 15 కేర్‌ సెంటర్‌లో 1800 పడకలు ఉన్నాయి. అదనంగా మరో రెండు సిద్ధం చేస్తున్నాం. వాటిలో 200 పడకలు అందుబాటులో ఉన్నాయి.

* ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీకింద నిబంధనల ప్రకారం రోగులను చేర్చుకోవాలి. ప్రస్తుతం 50శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాల్సి ఉంటుంది. నిరాకరిస్తే చర్యలు  ఉంటాయి. ఆసుపత్రుల్లో ప్రాణవాయువు కొతర లేకుండా చూస్తున్నాం. 100 పడకలు పైగా ఉన్నా 13 ఆసుపత్రుల్లో 13 పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. 4906 సిలిండర్లు సిద్ధంగా ఉంచాం. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవల ఆక్సిజన్‌ ప్లాంట్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరోగ్యశ్రీ పేరుతో లేదా అనుమతుల పేరుతో గతంలో ఆసుపత్రుల నుంచి సొమ్ములు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఫిర్యాదులు వస్తే వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి రోజు వారీ ఫిర్యాదులను పరిశీలిస్తాం. ప్రైవేటు ఆసుపత్రులు చికిత్సకు తగిన విధంగా జీవో ప్రకారం బిల్లులు ఇవ్వాలి. గతంలో బిల్లులు ఇవ్వకుండా కొంతమంది ఇబ్బంది పెట్టారు.

* జిల్లాలో పరిస్థితిని ప్రతి రోజూ సమీక్షిస్తున్నాం. వైద్యులకు, వైద్య సిబ్బందికి సెలవులు ఇవ్వడం లేదు. ఆసుపత్రుల్లోనూ, ఇతర సంస్థల్లో మూకుమ్మడిగా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి  ఉంది. పాఠశాలల్లో పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నాం. వివిధ శాఖలకు చెందిన వారు వైరస్‌ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.

పరిస్థితి నియంత్రణలోనే...

ప్రస్తుతం ప్రైవేటు అసుపత్రుల అవసరం అంతగా లేదు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే పడకలు అందుబాటులో ఉన్నాయి. 17 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ 531 పడకలు ఉండగా 55 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 823 పడకలు అందుబాటులో ఉండగా ఐదుగురే ఉన్నారు. ప్రాణవాయువు ఉన్న పడకల్లో 3748 అందుబాటులో ఉండగా 69 మంది మాత్రమే ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద 55 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇంటి వద్దనే 2658 మంది ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి నియంత్రణలోనే ఉంది.

అందుబాటులో మందులు

రెండో దశలో రెమ్‌డెసివిర్‌, ఆంఫోటెరిసిన్‌ లాంటి మందులు కొరత ఏర్పడింది. ప్రస్తుతం కోవిడ్‌ చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌సీలలోనూ జ్వరం, దగ్గు, విటమిన్‌ మాత్రలను అందుబాటులో ఉంచుతున్నాం. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి అవసరమైన మందులు ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ధరలు పెంచి విక్రయించినా.. కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని