logo

భార్యకు వాతలు పెట్టిన భర్త.. అత్తమామలపై కేసు

అదనపు కట్నం కోసం భార్యను కొట్టి అట్లకాడతో వాతలు పెట్టిన భర్త కటకటాలపాలయ్యాడు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. తుమ్మపూడి శివపార్వతి, ప్రేమ్‌కుమార్‌ భార్యా భర్తలు. వారు యనమలకుదురు

Published : 23 Jan 2022 03:39 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: అదనపు కట్నం కోసం భార్యను కొట్టి అట్లకాడతో వాతలు పెట్టిన భర్త కటకటాలపాలయ్యాడు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. తుమ్మపూడి శివపార్వతి, ప్రేమ్‌కుమార్‌ భార్యా భర్తలు. వారు యనమలకుదురు శివపార్వతినగర్‌లో నివసిస్తుంటారు. వారికి 2015లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నంగా రెండెకరాల భూమి, రూ.4 లక్షల నగదు, కొంత బంగారం ఇచ్చారు. వివాహం జరిగిన దగ్గర్నుంచి భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఎందుకు చేయడం లేదంటూ పలుసార్లు భార్య ప్రశ్నిస్తోంది. దీంతో పుట్టింటి నుంచి అదనంగా రూ.10 లక్షలు కట్నం తేవాలంటూ భార్యను వేధించడం, కొట్టడం ప్రారంభించాడు. ఈ నెల 20న భర్త ప్రేమ్‌కుమార్‌ భార్యతో వివాదానికి దిగి కొట్టాడు. వంట గదిలోకి వెళ్లి అట్లకాడ కాల్చి చేతులపై వాతపెట్టాడు. ముఖంపైనా వాతలు పెట్టడానికి ప్రయత్నించగా ఈమె తీవ్రభయాందోళనలకు గురై పక్క ఇంట్లోకి పరిగెత్తింది. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితురాలు శివపార్వతి భర్త తనకు వాతలు పెడుతున్నట్లుగా చిత్రీకరించిన వీడియోతో సహా శనివారం పెనమలూరు పోలీసులకు  ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భర్త ప్రేమ్‌కుమార్‌, వాతలకు వత్తాసు పలికిన అత్త నాగేంద్రమ్మ, మామ నాగేంద్రరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని