logo

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం!

కరోనా కేసులు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 1000కిపైగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా, చాలామంది ఇంట్లోనే వైద్యం పొందుతూ స్వస్థత పొందుతున్నారు.

Updated : 23 Jan 2022 04:27 IST

కరోనా చికిత్సకు

87 ఆసుపత్రుల గుర్తింపు

నియోజకవర్గానికో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

ఈనాడుతో జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

ఈనాడు, గుంటూరు

కరోనా కేసులు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 1000కిపైగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా, చాలామంది ఇంట్లోనే వైద్యం పొందుతూ స్వస్థత పొందుతున్నారు. జిల్లాలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. కరోనా వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ‘ఈనాడు’ ముఖాముఖిలో జిల్లా పాలనాధికారి వివేక్‌యాదవ్‌ స్పష్టం చేశారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, కట్టడికి చర్యలు, బాధితులకు వైద్యసేవలు తదితర అంశాలపై కలెక్టర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈనాడు: నిత్యం 1000కిపైగా కేసులు వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉన్నందున వీటికి అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలేమిటి?

కలెక్టర్‌ :జిల్లాలో జనవరి నెల నుంచి కేసుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో రోజు వారీగా పరీక్షలు చేస్తున్నాం. పరీక్షించిన నమూనాల్లో 15 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉంటోంది. కేసులు ఎక్కువగా ఉన్నా, మరణాల సంఖ్య చాలా స్వల్పం. వైరస్‌ ఎక్కువ మందికి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికి ఒక కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం.

వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రజలకు మీరిచ్చే సూచనలేమిటి?

జిల్లా యంత్రాంగం పరంగా వైరస్‌ విస్తరణకు అనేక చర్యలు తీసుకుంటున్నా ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి. ప్రజలందరూ మాస్క్‌ ధరించాలని పదేపదే చెప్పి అవగాహన కల్పిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. జిల్లాలో మాస్క్‌లు ధరించని 85,295 మందికి జరిమానా విధించాం. సామాజిక బాధ్యతగా మాస్క్‌ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ వాడటం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం చేస్తే వైరస్‌ కట్టడి సాధ్యమవుతుంది. యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నందున ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. వైరస్‌ సోకినా ధైర్యంగా ఉంటూ వైద్యుల సూచనలతో మందులు వాడి పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం.

రెండో దశలో ఆక్సిజన్‌ కొరతతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారా?

రెండో దశలో తక్కువ సమయంలో వేలమంది ఆసుపత్రికి రావడం, ఎక్కువ మందికి ఆక్సిజన్‌ అవసరం కావడంతో ఇబ్బందులు ఏర్పడినా అప్రమత్తమై సమస్యను పరిష్కరించాం. అప్పటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 11 ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటుచేశాం. కొన్ని ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కూడా అవసరమైనన్ని అందుబాటులో ఉన్నాయి. ఈసారి ఆక్సిజన్‌ కొరత అనే ప్రసక్తే రాకుండా ముందస్తుగా సిద్ధంగా ఉన్నాం.

ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అవసరాలకు సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయా?

జిల్లాలో 87 ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్యం అందించడానికి గుర్తించాం. ఇందులో 6500 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్‌తో కూడిన పడకలు 3510, ఐసీయూ 1104, సాధారణ పడకలు 1882, వెంటిలేటర్‌తో కూడిన పడకలు 298 ఉన్నాయి. నియోజకవర్గంలో  ప్రతిచోట తొలుత 20 పడకలతో ప్రారంభించి అవసరాలకు అనుగుణంగా పెంచుతాం.మూడు కేంద్రాల్లో ఎక్స్‌రే, రక్త పరీక్షలు చేయడానికి ఏర్పాట్లున్నాయి. ప్రస్తుతం 700 పడకలు సిద్ధం చేశాం.

టీకా ప్రక్రియలో రెండో డోస్‌ ఎప్పటికి  పూర్తవుతుంది. 18 ఏళ్లలోపు అర్హులను గుర్తించారా?

జిల్లాలో తొలిడోసు టీకాకు 39,66,059 మందిని గుర్తించాం. 42,43,399 మందికి వేసి 107 శాతం సాధించాం. రెండో డోసు 39,66,059 మందికి వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 32,98,048 మందికి పూర్తయింది. 83 శాతం లక్ష్యానికి చేరుకున్నాం. 15 నుంచి 18ఏళ్లలోపు వారు 2,30,965 మంది ఉన్నట్లు గుర్తించి ఇప్పటికే 2,09,164 మందికి ఇచ్చి 90.6 శాతం పూర్తిచేశాం. వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోసు వేస్తున్నాం.

ఈనాడు: జిల్లాలో వైద్యులు, సిబ్బంది, ఉద్యోగులు కూడా కరోనా బారినపడుతున్నారు. బాధితులకు సేవల్లో లోపం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

కలెక్టర్‌ : జిల్లాలో ఉన్న వైద్యులు, సిబ్బందితోపాటు అదనంగా 2029 మంది కొత్తగా విధుల్లోకి తీసుకున్నాం. వీరిలో వైద్యనిపుణులు, స్టాఫ్‌నర్సులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు.  జిల్లా స్థాయి అధికారులను ప్రతి ఆసుపత్రికి నోడల్‌ అధికారులుగా నియమించి సేవలు పర్యవేక్షిస్తున్నాం. సేవలపై నిరంతరం సమీక్షిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని