logo

ఆహ్లాద వేళ.. అప్రమత్తంగా ఉందాం!

కొవిడ్‌ మహమ్మారి రాకతో ఇళ్లకు వచ్చిపోయే బంధుమిత్రులు తగ్గిపోయారు. ఆన్‌లైన్‌ ఉద్యోగాలు, చదువుల నేపథ్యంలో గదులకే పరిమితం కావడంతో పిన్నలు మొదలు పెద్దల వరకు చెప్పలేని ఒత్తిడికి గురవుతున్నారు.

Published : 23 Jan 2022 04:01 IST

 ఉద్యానవనాల్లో సేదతీరే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి

 కొవిడ్‌ ప్రొటోకాల్‌ అమలుకు పురపాలక శాఖ చర్యలు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే

మాస్కు ఒకరికి లేకున్నా ఇబ్బందే నాయనా...

కొవిడ్‌ మహమ్మారి రాకతో ఇళ్లకు వచ్చిపోయే బంధుమిత్రులు తగ్గిపోయారు. ఆన్‌లైన్‌ ఉద్యోగాలు, చదువుల నేపథ్యంలో గదులకే పరిమితం కావడంతో పిన్నలు మొదలు పెద్దల వరకు చెప్పలేని ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో జనం నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్న  ఉద్యానవనాలకు పెద్ద సంఖ్యలోనే వెళ్తున్నారు. జిల్లాలో గుంటూరు నగరం, ఇతర పురపాలికల్లో ప్రస్తుతం 30 వరకు ఉన్న పార్కులు ప్రజల సందర్శనతో కళకళలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో ఆరు నుంచి ఎనిమిది వేలు, అలాగే శని, ఆదివారాల్లో అయితే దాదాపు 12 వేలకు పైగా కుటుంబాల వారు వీటిలో సేద తీరుతున్నారని అంచనా.

ఏర్పాట్లు ఇవీ

కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రొటోకాల్‌ అమలుకు పురపాలక శాఖ చర్యలు తీసుకుంది. పార్కులోకి ప్రవేశించేవారు కచ్చితంగా మాస్కులు ధరించేలా చూడడం, ప్రవేశ ద్వారాల వద్దనే సందర్శకుల చేతులను శానిటైజ్‌ చేయించడం, ఆటల సమయంలో పిల్లలు భౌతిక దూరం పాటించేలా చూడడంతో పాటు ప్రతి రోజూ ఉదయం సమయంలో సోడియం పైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వీటన్నింటితో పాటు కొవిడ్‌ పొంచి ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండాలంటూ మైక్‌ ద్వారా ప్రకటనలు చేయిస్తున్నారు.

మన వంతుగా..

వైరస్‌ విస్తరణ అధికంగా జరగడానికి కారణం బాధితుడు తనకు కొవిడ్‌ ఉందని గ్రహించే సమయానికి అంటే అతనికి లక్షణాలు బయటపడే సమయానికే అతని ద్వారా మరింత మందికి వైరస్‌ విస్తరించే అవకాశం ఉంది. అందువల్ల పార్కుల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య ఉందో తెలియదు కనుక ఖచ్చితంగా ఇతరులతో మాట్లాడే సమయంలో కొన్ని అడుగుల దూరం పాటించాలి. మాస్కును పొరపాటున కూడా తీయకూడదు. గతంలో మాదిరి చెట్లు, పూలు వంటి వాటిని ముట్టుకోకుండా ఉండాలి. మనం కూర్చునే బల్లను కూడా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు ఇంటి నుంచి ఏదైనా దుప్పటి వంటిది తీసుకొచ్చి దాని మీద కూర్చుని, తిరిగి వెళ్లిన తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవాలి. పిల్లలు ఆడుకునే సమయంలో దగ్గర ఉండడంతో పాటు.. వారు ఆట పరికరాలు వినియోగించి వచ్చిన తర్వాత చేతులను శానిటైజ్‌ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి అన్నింటితో పాటు తాగునీరు, తినే ఆహార పదార్థాలు ఇంటి దగ్గరి నుంచే తెచ్చుకోవడం మంచిదని వారు వివరిస్తున్నారు.

పార్కు ప్రవేశద్వారం వద్దే చేతుల శానిటైజేషన్‌

పక్కాగా నిర్వహణ

కొవిడ్‌ నేపథ్యంలో ఉద్యానవనాల నిర్వహణను పక్కాగా చేస్తున్నాం. పలు జాగ్రత్తలు పాటిస్తున్నాం.  ప్రొటోకాల్‌ అమలు పక్కగా జరిగేలా ఏర్పాట్లు చేశాం. మైక్‌ ద్వారా కూడా చెప్పిస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలి.

- శ్రీనివాసరావు, పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకుడు, గుంటూరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని