logo

సీఎం క్యాంపు కార్యాలయం వద్ద హడావుడి

తమ సమస్యపై సీఎంను కలవాలంటూ హడావుడి చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన ఇరువురిని శనివారం పోలీసులు అదుపులో తీసుకున్నారు. వివరాలు.. ఉదయం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం అయినముక్కలకు

Published : 23 Jan 2022 04:01 IST

కార్యాలయ సమీపంలో ఇద్దరిని అదుపులో తీసుకుంటున్న సీఐ సాంబశివరావు

తాడేపల్లి, న్యూస్‌టుడే: తమ సమస్యపై సీఎంను కలవాలంటూ హడావుడి చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన ఇరువురిని శనివారం పోలీసులు అదుపులో తీసుకున్నారు. వివరాలు.. ఉదయం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం అయినముక్కలకు చెందిన దర్శినపు గురవమ్మ, ధనూష్‌ ఓ చిన్నారితో కలిసి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ సమీపంలోని నాలుగో చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. అక్కడున్న భద్రత సిబ్బంది వారిని అడ్డుకోగా, తాము పేదలమని, దోర్నాలలోని కేజీబీవీ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న వంట మనిషి ఉద్యోగం కోసం సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని వచ్చినట్లు గురవమ్మ చెప్పింది. శనివారం సీఎం స్పందన కేంద్రానికి సెలవని, సోమవారం రావాలని భద్రత సిబ్బంది సూచించారు. నిరాకరించిన వారు సీఎంను కలవాల్సిందేనంటూ హడావుడి చేశారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో భద్రత సిబ్బంది తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ సాంబశివరావు తమ సిబ్బందితో నాలుగో చెక్‌పోస్టు వద్దకు చేరుకొని వారిని గ్రామానికి వెళ్లిపోవాలని కోరారు. వినకపోవడంతో ఇరువురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి వివరాలు తెలుసుకునే క్రమంలో ధనూష్‌ తమను స్టేషన్‌కు ఎందుకు తెచ్చారని, సీఎంకు సమస్యను తెలిపేందుకు వస్తే అదుపులో తీసుకుంటారా అంటూ పోలీసులను నిలదీశారు. ఆగ్రహించిన పోలీసులు అతడిని స్టేషన్‌ లోపలికి లాక్కెళ్లారు. ఇంతలో గురవమ్మ అతడిని కొడుతున్నారంటూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి ఆమెనూ మహిళా పోలీసు బలవంతంగా లోపలికి తీసుకెళ్లారు. అనంతరం తమతో వాగ్వాదానికి దిగిన ధనూష్‌ గురించి తాడేపల్లి పోలీసులు దోర్నాల పోలీసులతో ఆరా తీసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని