logo

తప్పిన ప్రమాదం

రైలు బోగీలను కలిపి ఉంచే లింకు రాడ్‌(కప్లింగ్‌) విరిగి గూడ్సు రైలు తొమ్మిది బోగీలను ట్రాక్‌పై వదిలేసి ముందుకెళ్లిన ఘటన బాపట్లలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరక్కపోవటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Published : 24 Jan 2022 04:12 IST
రైలు బోగీల మధ్య విరిగిన లింకు రాడ్‌
ఎనిమిది బోగీలు వదిలేసి ముందుకెళ్లిన గూడ్సు బండి


విరిగిపోయిన బోగీ లింకు రాడ్‌ (కప్లింగ్‌

బాపట్ల, న్యూస్‌టుడే : రైలు బోగీలను కలిపి ఉంచే లింకు రాడ్‌(కప్లింగ్‌) విరిగి గూడ్సు రైలు తొమ్మిది బోగీలను ట్రాక్‌పై వదిలేసి ముందుకెళ్లిన ఘటన బాపట్లలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరక్కపోవటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నెల్లూరు జిల్లా బిట్రగుంట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్సు రైలు(బీసీఎల్‌) బాపట్ల రైల్వేస్టేషన్‌ దాటగానే ఉప్పరపాలెం గేటు వద్ద ఆదివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో 48, 49 బోగీల మధ్య ఉన్న లింకు రాడ్‌(కప్లింగ్‌) విరిగిపోయి 200 మీటర్ల దూరం ట్రాక్‌పై లాక్కుంటూ వచ్చింది. రైలింజన్‌ 48 బోగీలతో ముందుకెళ్లిపోయింది. లింకు తెగిపోయి మిగిలిన తొమ్మిది బోగీలు ట్రాక్‌పై నిలిచిపోయాయి. గార్డ్‌ గమనించి స్థానిక స్టేషన్‌ అధికారులకు సమాచారం అందించాడు. రైల్వే అధికారులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని విరిగిన లింకు రాడ్‌, ట్రాక్‌పై నిలిచిన తొమ్మిది బోగీలను పరిశీలించారు. ఇనుప రాడ్‌ విరిగిపోయి లాక్కు రావటం వల్ల రైలు పట్టాలపై కాంక్రీట్‌, చెక్కు స్లీపర్లు దెబ్బతిన్నాయి. 48 బోగీలతో రైలును అప్పికట్ల పంపించారు. గంటకు పైగా బోగీలు పట్టాలపై ఉండిపోవటంతో చెన్నై నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో గంట సేపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు- విజయవాడ విక్రమ సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను స్టూవర్టుపురం స్టేషన్‌లో అరగంటకు పైగా నిలిపేశారు. పలు గూడ్సు రైళ్లు కూడా నిలిచిపోయాయి. మరో గూడ్సు రైలింజన్‌తో ట్రాక్‌పై నిలిచిన తొమ్మిది బోగీలను స్థానిక రైల్వేస్టేషన్‌లోని లూప్‌లైన్‌లోకి అధికారులు పంపించి రాకపోకలు పునరుద్ధరించారు. విజయవాడ నుంచి వచ్చిన రైల్వే అధికారులు విరిగిన లింకు రాడ్‌ తొలగించి కొత్తది అమర్చి మరమ్మతులు చేశారు. మిగిలిన తొమ్మిది బోగీలను ఆదివారం సాయంత్రం విజయవాడకు పంపించారు. విరిగిన రాడ్‌తో రైలు ఇంకా ముందుకెళ్లి ఉంటే రైలు బోగీలు పట్టాలు తప్పి ప్రమాదం జరిగి ఉండేదని పలువురు అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌ కూడా పూర్తిగా దెబ్బతినేదని..., అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పి పరిమిత నష్టమే జరిగిందని పేర్కొన్నారు.

విడిపోయిన రైలు బోగీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని