logo

సాగర్‌ పర్యాటకుల నిట్టూర్పు!

 రెండేళ్ల క్రితం పాపికొండల వద్ద లాంచీ ప్రమాదంతో నాగార్జున కొండకు లాంచీల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తరువాత కరోనా మహమ్మారితో ఎలాంటి కదలికలు లేకుండాపోయాయి. నాగార్జునసాగర్‌లో 2020 మార్చి నుంచి లాంచీలు స్టేషన్‌కే పరిమితమయ్యాయి.

Published : 24 Jan 2022 04:28 IST

 నాగార్జున కొండకు లాంచీల రాకపోకలు ఎప్పుడో?
స్టేషన్‌కే పరిమితమైన లాంచీలు

మాచర్ల, న్యూస్‌టుడే: రెండేళ్ల క్రితం పాపికొండల వద్ద లాంచీ ప్రమాదంతో నాగార్జున కొండకు లాంచీల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తరువాత కరోనా మహమ్మారితో ఎలాంటి కదలికలు లేకుండాపోయాయి. నాగార్జునసాగర్‌లో 2020 మార్చి నుంచి లాంచీలు స్టేషన్‌కే పరిమితమయ్యాయి. లాంచీల ప్రమాదాల నివారణకు నియంత్రణ విభాగం ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. లాంచీల సామర్థ్యం(ఫిట్‌నెస్‌) పరిశీలించారు. అందుబాటులో ఉన్న 5 లాంచీలలో రెండు లాంచీలకు కాలం తీరిందని పక్కన పెట్టేశారు. శాంతిసిరి, నాగశ్రీ, అగస్త్య లాంచీలను అందుబాటులో ఉంచారు. అటవీశాఖ పర్యాటకుల నుంచి వసూళ్లు చేసే టిక్కెట్ల నగదులో తమకు కొంతభాగం ఇవ్వాలని ముడిపెట్టారు. ఈ వివాదాలు ఒక కొలిక్కివచ్చేసరికి చాలా సమయమే పట్టింది. ఇలా ఈ సమస్యలను పరిష్కరించుకొని గత నెల 18న ప్రత్యేక బృందం నాగార్జునకొండను పరిశీలించింది. సాగర్‌ నుంచి నాగార్జున కొండకు వెళ్తాయన్న ప్రకటనపై ఆశలు చిగురించాయి. సమస్యలన్నీ కొలిక్కివచ్చాయనుకున్న సమయంలో పురావస్తుశాఖ నత్తనడక పనులు పర్యాటకుల ఆశలను నీరుగారుస్తున్నాయి. తీరా అక్కడ జరుగుతున్న పనులు మందకొడిగా ఉండటంతో పర్యాటక ప్రేమికులు, బౌద్ధ బిక్షవులు నిరాశపడుతున్నారు. ఆదివారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు లాంచీల రాకపోకలు రావడంపై నిట్టూర్చారు.


పురావస్తుశాఖ ఈనెల మొదటికి కొండను శుభ్రం చేసి పర్యాటకులను అనుమతిస్తామని చెప్పింది. తీరా ఇప్పటికీ పురావస్తుశాఖ కొండను శుభ్రం చేసి, అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో మరికొంత సమయం పట్టేందుకు అవకాశం కనిపిస్తుంది. పర్యాటకులు సాగర్‌ వరకు వచ్చినా లాంచీలు కొండకు వెళ్లకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో ఏపీ పర్యాటకశాఖతోపాటు, తెలంగాణ పర్యాటకశాఖ తమ లాంచీలను సిద్ధం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రెండు రాష్ట్రాలు సాగర్‌ జలాశయంలో జాలీ ట్రిప్‌ పేరుతో లాంచీలను తిప్పుతున్నారు. దీనికి కూడా ఆశించిన మేరా ఆదాయం లేదు. సాగర్‌లో మూడు లాంచీలు తిప్పేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని లాంచీ స్టేషన్‌ మేనేజర్‌ స్వామి తెలిపారు. కొండపై పురావస్తుశాఖ అధికారులు అనుమతులు ఇస్తే లాంచీల రాకపోకలు ఉంటాయన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని