logo

16 కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు

 కృష్ణా జిల్లాలో కొత్తగా మరో రెండు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం కేంద్రాల సంఖ్య 16కు చేరింది. ఇప్పటికే జిల్లాలో 14 కేంద్రాలు ఉండగా నూజివీడు, నందిగామలో ఆదివారం నుంచి కొత్తగా రెండు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే నూజివీడు, నందిగామలో

Published : 24 Jan 2022 05:18 IST
కొత్తగా మరో రెండు ఏర్పాటు
అందుబాటులో 2 వేల మంచాలు

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లాలో కొత్తగా మరో రెండు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం కేంద్రాల సంఖ్య 16కు చేరింది. ఇప్పటికే జిల్లాలో 14 కేంద్రాలు ఉండగా నూజివీడు, నందిగామలో ఆదివారం నుంచి కొత్తగా రెండు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే నూజివీడు, నందిగామలో ఒక్కో కేంద్రం ఉండగా ప్రస్తుతం అదనంగా ఒక్కొక్కటి ఏర్పాటు చేశారు. జిల్లాలోని విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాలు తప్ప మిగతా అన్నింటిలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఉన్నాయి. పదహారు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో మొత్తం 2వేల మంచాలు సిద్ధం చేసి ఉంచారు. ఆదివారం నాటికి 16 కేంద్రాల్లో కలిపి 63 మంది కొవిడ్‌ బాధితులు చేరి చికిత్స పొందుతున్నారని కృష్ణా జిల్లా వైద్యారోగ్య అధికారిణి డాక్టర్‌ ఎం.సుహాసిని వెల్లడించారు.

* జిల్లాలో ప్రస్తుతం రోజుకు 300కు పైగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు అధికంగా ఉన్నవాళ్లు మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారు. మిగతా వాళ్లంతా హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి ఆసుపత్రిలో మొత్తం 77 మంది కొవిడ్‌ బాధితులు ఉన్నారు. మరో రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులున్నాయి. రెండు రోజుల క్రితం వరకు ఈ సంఖ్య 40లోపే ఉండేది. ప్రస్తుతం రోజుకు పది మంది వరకు బాధితులు వచ్చి చేరుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

* ఇందిరాగాంధీ మైదానంలో పరీక్షలకు బ్రేక్‌..విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో రోజుకు 300 మంది వరకు కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలను చేయించుకుంటున్నారు. రిపబ్లిక్‌డే పరేడ్‌ నేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజులు స్టేడియంలో పరీక్షలను నిలుపుతున్నట్టు జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. తుమ్మలపల్లి సహా మిగతా కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లాలో అధికారికంగా కనీసం ఏడు నుంచి పది వేల మధ్యలో ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో పరీక్షలను చేయించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని