logo

నిరాశపర్చినసీజన్‌

పెద్ద పండుగ అయిన సంక్రాంతి ఈ ఏడాది ఆర్టీసీకి కలసి రాలేదు. తీవ్రంగా నిరాశపర్చింది. ఎన్నో ఆశలతో భారీగా ప్రణాళికలు సిద్ధం చేసినా ఒమిక్రాన్‌ రూపంలో దెబ్బ పడింది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఆదాయానికి గండి పడింది.

Published : 24 Jan 2022 05:18 IST
ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ. 1.8 కోట్లు

ఈనాడు - అమరావతి: పెద్ద పండుగ అయిన సంక్రాంతి ఈ ఏడాది ఆర్టీసీకి కలసి రాలేదు. తీవ్రంగా నిరాశపర్చింది. ఎన్నో ఆశలతో భారీగా ప్రణాళికలు సిద్ధం చేసినా ఒమిక్రాన్‌ రూపంలో దెబ్బ పడింది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఆదాయానికి గండి పడింది. ఈ సీజన్‌లో తొలుత ఆశాజనకంగానే కనిపించినా.. పండుగ తర్వాత ఒక్కసారిగా చాలా బస్సులు రద్దు చేయాల్సి వచ్చింది. ఇందుకు కారణం పెద్దగా డిమాండ్‌ లేకపోవడమే. ముఖ్యంగా 16, 17వ తేదీల్లో తిరుగు ప్రయాణాలకు బాగా గిరాకీ ఉంటుందని భావించి, ప్రత్యేక సర్వీసులను సిద్ధంగా ఉంచారు. వాటి అవసరం లేకపోయింది. మొత్తమ్మీద గత సంవత్సరం కంటే రూ.కోటి తగ్గింది.

* కృష్ణా రీజియన్‌ నుంచి ఈ పండుగకు 7వ తేదీ నుంచి 17 వరకు మొత్తం 1,266 సర్వీసులు నడపాలని భావించారు. కానీ.. కేవలం 791 మాత్రమే తిరిగాయి. తిరిగిన దూరం కూడా తగ్గింది. కేవలం 4.66 కి.మీ ప్రత్యేక సర్వీసులు నడిచాయి. అన్ని మార్గాల్లో కెల్లా హైదరాబాద్‌కు 260, విశాఖపట్నం.. 226, రాజమహేంద్రవరం.. 181, అమలాపురం.. 33, భీమవరం.. 21, రాయలసీమ.. 18, ఇతర రూట్లు.. 25 చొప్పున తిరిగాయి. ఉత్తరాంధ్ర రూట్‌లో తిరిగిన బస్సుల ద్వారా రూ.76.30 లక్షలు, హైదరాబాద్‌.. రూ.59.94 లక్షలు ఆదాయం సమకూరింది.

* డిమాండ్‌ తగ్గడానికి ప్రధాన కారణం కొవిడ్‌ భయమే. ఈ నెలలోనే మూడో దశ ప్రారంభం కావడం, నెలాఖరుకు పతాక స్థాయికి కేసులు పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో చాలా మంది ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. దీనికి తోడు చాలా మంది సొంత వాహనాల్లో ప్రయాణానికే మొగ్గు చూపారు. రెండేళ్ల నుంచి మధ్య తరగతి కుటుంబాల వారు కూడా సెకెండ్‌ హ్యాండ్‌ కార్లు కొనేశారు. వీటిల్లో సొంత ఊళ్లకు ప్రయాణాలు సాగించారు. గతేడాది కంటే ఈసారి జిల్లాలోని టోల్‌ప్లాజాల గుండా వెళ్లిన కార్ల సంఖ్య రెట్టింపు అయింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో హైదరాబాద్‌లో విద్యా సంస్థలకు జనవరి ఆఖరు వరకు సెలవులు పొడిగించారు. దీంతో పండుగ తర్వాత హైదరాబాద్‌ వెళ్లాల్సిన వారు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో తిరగాల్సిన ప్రత్యేక సర్వీసుల సంఖ్య బాగా తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని