logo

ఇలాంటి పీఆర్సీని చరిత్రలో చూడలేదు

పీఆర్సీ నివేదికను బయట పెట్టకుండా ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లోపించిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. విజయవాడలోని ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి

Published : 24 Jan 2022 05:34 IST
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లోపించింది
ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతలు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌, పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు

ఈనాడు, అమరావతి: పీఆర్సీ నివేదికను బయట పెట్టకుండా ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లోపించిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. విజయవాడలోని ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆదివారం జరిగింది. కృష్ణా జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ, కార్మిక, పెన్షనర్ల సంఘాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం నడుస్తోందన్నారు. ‘జగన్‌ సీఎం అయినా.. ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారమే ఎన్నికవుతారనే విషయం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగంలో ఉద్యోగులు కూడా భాగమే. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు నేను 24సార్లు కలిశాను.. కానీ జగన్‌ను కేవలం రెండుసార్లు మాత్రమే కలిసే అవకాశం వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం నడుచుకోవాలి. ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి. అశుతోష్‌ మిశ్రా నివేదికను బయట పెట్టకపోవడం అత్యంత దుర్మార్గం. ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ కరపత్రాలను పంచడం లాంటివి చేస్తోంది.’ అని లక్ష్మణరావు పేర్కొన్నారు. పీడీఎఫ్‌ తరఫున ఉద్యోగ సంఘాల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగులను అణగదొక్కాలని చూసిన వారంతా భ్రష్టుపట్టిపోయారనేది గుర్తుంచుకోవాలన్నారు. అత్యంత భారీ మెజార్టీతో గెలిచిన ఇందిరాగాంధీ, జయలలిత, ఎన్టీఆర్‌ లాంటి వాళ్లంతా ఉద్యోగులతో పెట్టుకుని ఏమయ్యారో అందరికీ తెలుసన్నారు. అప్రజాస్వామ్య విధానాలు అవలంబించిన ప్రభుత్వాలు కూలికపోక తప్పదని లక్ష్మణరావు హెచ్చరించారు.

జీవోలు రద్దు చేస్తేనే...

ఎన్టీఆర్‌ హయాం నుంచి తాను పీఆర్సీ ఉద్యమాల్లో ఉన్నానని, కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయకుంటే ముఖ్యమంత్రి పిలిచినా తాము చర్చలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగిన సమయంలో సీఎం స్క్రిప్టు తీసుకొచ్చి చదివారంటూ శివారెడ్డి విమర్శించారు. ఫిట్‌మెంట్‌ ప్రకటించి ఇతర సమస్యలను సీఎస్‌తో మాట్లాడుకోమంటూ వెళ్లిపోయారన్నారు. ‘ప్రభుత్వం రెండు స్లాబులతో హెచ్‌ఆర్‌ఏను తీసుకురావడాన్ని మేము తొలినుంచి వ్యతిరేకించాం. పాత హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని సీఎం, సజ్జల, అధికారులందరినీ కోరాం. మా అభ్యంతరాలను చెప్పిన తర్వాత కూడా రాత్రికి రాత్రి జీవోలను విడుదల చేశారు. గత ప్రభుత్వంలో సాధించుకున్న లబ్ధిని కూడా తొలగించారు. ఉద్యోగులు ఎవరూ కొత్త జీతాలను తీసుకోరు. మాకు పాతజీతాలే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’ అంటూ శివారెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటంలో తుది విజయం ఉద్యోగులదే అవుతుందని స్పష్టం చేశారు.


తప్పుడు ప్రచారం తిప్పికొడతాం

-విద్యాసాగర్‌ , ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు

కరోనా సమయంలోనూ తెలంగాణ కంటే ఏపీకే ఆదాయం ఎక్కువ వచ్చింది. కానీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో ఉద్యోగులకు స్పష్టమైన అవగాహన ఉంది. పీఆర్సీ జీవోలను రద్దు చేసిన తర్వాతే మేము చర్చలకు వస్తాం. ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయిస్తోంది. వాటిని తిప్పికొట్టేందుకు మేము కూడా సాంకేతిక నిపుణులను ఏర్పాటు చేసుకుంటాం.


చావు ఖర్చుల్లోనూ మిగిల్చుకునేలా..

- విష్ణువర్థన్‌, పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉద్యోగుల చావు ఖర్చుల్లోనూ ప్రభుత్వం మిగుల్చుకోవాలని చూస్తోంది. డెత్‌ రిలీఫ్‌ ఒక నెల జీతం ఇస్తుండగా.. దానిని రూ.20 వేలకు పరిమితం చేసింది. పెన్షనర్లకు వస్తోన్న సదుపాయాలను తొలగించడం అత్యంత దారుణం. ప్రభుత్వ చర్యలు చాలా అన్యాయంగా ఉన్నాయి.


ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నికల్లో గెలవలేవు..

- పాండురంగ ప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు

ఉద్యోగులు సమ్మె చేసిన ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు మళ్లీ ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం మంకుపట్టు వీడాలి. సీపీఎస్‌ను వారంలో రద్దు చేస్తామని చెప్పిన సీఎం ఇంతవరకూ ఆ ఊసు ఎత్తలేదు. డీఏలు ఎప్పటికప్పుడు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు. ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే ఉద్యోగులు ఊరుకోరని గుర్తుంచుకోవాలి.


ఉద్యోగులు, ప్రజలకు తగాదా పెడుతోంది..

- శ్రీనివాసరావు, సీఐటీయూ కృష్ణా జిల్లా కార్యదర్శి

ప్రభుత్వం తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఉద్యోగులు, ప్రజలకు మధ్య తగాదా పెడుతోంది. పథకాల అమలుకు ఉద్యోగులు వ్యతిరేకం కాదు. మన బాధలు ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలి. నల్ల జీవోలను వెనక్కి తీసుకునేవరకూ ఉద్యోగులు కలిసికట్టుగా పోరాడి సాధిస్తాం.


ఇది పూర్తి తిరోగమన ప్రభుత్వం..

- ఓబులేసు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు

సీఎం జగన్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మంకుపట్టు పట్టిన మనిషి. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కరపత్రాలు పంచడం ఏ రాజనీతి? ఇప్పుడున్నది పూర్తి తిరోగమన ప్రభుత్వం. డౌన్‌డౌన్‌ ముఖ్యమంత్రి అనకుండా నీవే దేవుడివి.. ప్రత్యక్ష దైవమని చెబుతూ ఆందోళన చేస్తారా?. ఉద్యోగ సంఘాల శక్తిని, హక్కులను జగన్‌ హరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని