logo

రైలు ఢీ కొని వ్యక్తి దుర్మరణం

రైలు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన ఉత్సల మురళీ(48) ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తూ మద్యానికి బానిసై కొంత కాలంగా విధులకు వెళ్లకుండా ప్రైవేటు వ్యాను డ్రైవరుగా పని చేస్తున్నాడు.

Published : 24 Jan 2022 05:41 IST
ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రైలు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన ఉత్సల మురళీ(48) ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తూ మద్యానికి బానిసై కొంత కాలంగా విధులకు వెళ్లకుండా ప్రైవేటు వ్యాను డ్రైవరుగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి మద్యం తాగి గన్నవరం సమీపంలోని మర్లపాలెం చెరువు వద్ద పట్టాలపై పడిపోయిన మురళిని రైలు ఢీ కొనటంతో మృతి చెందాడు. ఆదివారం సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ఆదినారాయణ తెలిపారు.

 


మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

పోరంకి(పెనమలూరు), న్యూస్‌టుడే: పోరంకిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. పోరంకి శ్రీనివాసనగర్‌లో నివాసం ఉండే గండి శ్రీరామ్‌ప్రకాష్‌, సత్య అనిత సింధు భార్యా భర్తలు. వారికి పదేళ్ల క్రితం వివాహం కాగా ఓ కుమార్తె ఉంది. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అతడి కుటుంబానికి కాకినాడలో ఓ ఇల్లు ఉండగా.. దానిని అత్తింటివారు ఇటీవల విక్రయించారు. తమకు రావాల్సిన వాటాను అత్తింటి వారు ఇవ్వడం లేదని ఈమె తరచూ తన సోదరుడితో చెప్పి బాధపడేది. అత్తింటి వారిని అడుగుతున్నా వాటా ఇవ్వాల్సిన పనిలేదంటూ ఈమెతో వివాదానికి దిగుతూ వేధించేవారు. ఈ నెల 22వ తేదీన అనిత సింధుకు అనారోగ్యంగా ఉందని వెంటనే బయల్దేరి రావాలంటూ ఈమె భర్త రాజోలులో ఉన్న తన బావమరిది రాజశేఖర్‌కు సమాచారం అందించగా అతడు పోరంకి వచ్చాడు. అప్పటికే తన సోదరి అనిత సింధు పురుగు మందు తాగి మృతి చెంది ఉండడాన్ని రాజశేఖర్‌ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తింటి వేధింపులే తన సోదరి మృతికి కారణమంటూ రాజశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త శ్రీరామ్‌ ప్రకాష్‌, అత్త అనంతలక్ష్మి, మామ రామకృష్ణ, బంధువులు కొల్లేపల్లి శారదకామేశ్వరి, వెంగలశెట్టి ప్రసన్నలక్ష్మి, వెంగలశెట్టి అచ్చర్లరావు, కొల్లేపల్లి శ్రీనివాసరావులపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


16 మంది జూదరుల పట్టివేత

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : మొగల్రాజపురంలోని ఓ హోటల్‌లో జూదమాడుతున్న 16 మందిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం రాత్రి ఆదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.70వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హోటల్‌లో పెద్ద మొత్తంలో జూదం జరుగుతున్నట్లు సమాచారం రావటంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా వేసి, ఒక్కసారిగా దాడులు చేశారు. మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు అధికార పార్టీ నేతలు ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. పోలీసులు ఈ విషయాన్ని ధ్రుకవీరించటం లేదు. జూదరులను విచారణ నిమిత్తం మాచవరం పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని