logo

‘చింతామణి నాటకంపై నిషేధం ఎత్తివేయాలి’

వందేళ్లు చరిత్ర ఉన్న చింతామణి నాటకంపై నిషేధం విధించటం అంటే.. కళకు సంకెళ్లు వేయడమేనని కవులు, కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. చింతామణి నాటకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించటాన్ని నిరసిస్తూ ఆదివారం లెనిన్‌కూడలిలో ప్రజానాట్యమండలి,

Published : 24 Jan 2022 05:45 IST


నిరసన వ్యక్తం చేస్తున్న కవులు, కళాకారులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే : వందేళ్లు చరిత్ర ఉన్న చింతామణి నాటకంపై నిషేధం విధించటం అంటే.. కళకు సంకెళ్లు వేయడమేనని కవులు, కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. చింతామణి నాటకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించటాన్ని నిరసిస్తూ ఆదివారం లెనిన్‌కూడలిలో ప్రజానాట్యమండలి, జన సాహితీ, అభ్యుదయ రచయితల సంఘం నాయకులు తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చంద్రనాయక్‌ మాట్లాడుతూ.. ఇది రాచరిక, బానిస వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్యం అనే సంగతి మరచిపోయారని ఎద్దేవా చేశారు. కరోనా ఆంక్షల వల్ల నాటకరంగం కుదేలై పోగా కళాకారులు, గాయకులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అనాదిగా సమాజంలోని అనేక సాంఘిక దురాచారాలను నాటకాల ద్వారా ఎత్తిచూపుతూ చైతన్య పరుస్తున్నారని పేర్కొన్నారు. ఒక సామాజిక వర్గాన్ని కించ పరిచేలా ఉందని చింతామణి నాటకాన్ని ప్రదర్శించటాన్ని తప్పు పట్టారు. ప్రభుత్వం తక్షణమే నాటకంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయకపోతే కవులు, కళాకారులు ఆందోళన చేయక తప్పదని స్పష్టం చేశారు. జన సాహితీ అధ్యక్షుడు దివి కుమార్‌ మాట్లాడుతూ.. సమాజాన్ని చెడగొడుతున్న బూతు సాహిత్యంపై పాలకులు దృష్టి పెట్టకుండా సాహిత్య కళారంగాలపై నిర్బంధాలు విధించటం చరిత్ర క్షమించదని అన్నారు. ఈ సందర్భంగా చింతామణి నాటకంలో ఒక సన్నివేశాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో లంక దుర్గారావు, ఆర్‌.పిచ్చయ్య, కె.వి.భాస్కరరావు, కె.నజీర్‌, మోతుకూరి అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని