logo

విలీనానికి.. మ్యాపింగ్‌ సిద్ధం

కృష్ణా జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విలీన కసరత్తు తుది దశకు చేరింది. జిల్లాలో 250 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలను హైస్కూళ్లలో కలిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తయింది.

Published : 28 Jan 2022 02:08 IST

నేడు విద్యాశాఖకు నివేదించనున్న జిల్లా అధికారులు
ఈనాడు, అమరావతి

కృష్ణా జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విలీన కసరత్తు తుది దశకు చేరింది. జిల్లాలో 250 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలను హైస్కూళ్లలో కలిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాల అధ్యయనం పూర్తయింది. ఉన్నత పాఠశాలలకు.. 250 మీటర్లు, కిలోమీటరు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక బడులను విలీనం చేసేందుకు చేపట్టిన మ్యాపింగ్‌ సిద్ధమైంది. రహదారులను దాటి వెళ్లాల్సినవి, గదుల కొరత ఉన్న పాఠశాలలను మాత్రం కలపకుండా ఎక్కడివి అక్కడ ఉంచేశారు. మ్యాపింగ్‌ నివేదికను పీపీటీ రూపంలో విద్యాశాఖకు నేడు జిల్లా అధికారులు సమర్పించనున్నారు.

జిల్లాలో 3,173 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1773 ప్రాథమిక, 349 ప్రాథమికోన్నత పాఠశాలలు. 341 ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక బడులన్నింటినీ తెచ్చి విలీనం చేసేందుకు మ్యాపింగ్‌ సిద్ధం చేశారు. ప్రభుత్వ బడుల్లో 3.11లక్షల మంది చదువుతున్నారు. అంటే పది తరగతుల్లో ఒక్కో దానికి 30వేల మంది విద్యార్థులున్నారు. ఈ లెక్కన మూడు, నాలుగు, ఐదు తరగతుల ప్రాథమిక విద్యార్థులను కనీసం 90వేల మందికి పైగా ఉన్నత పాఠశాలల్లో కలుస్తారు.

దూరం పెరిగితే తలనొప్పులే..

గ్రామాల్లో తమకు సమీపంలో ఉన్న పాఠశాలను కిలోమీటరు దూరానికి తరలిస్తే.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. రామవరప్పాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలలు రహదారికి ఒకవైపు ఉంటే ప్రాథమిక బడులు మరోవైపు ఉన్నాయి. ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి.

నగరంలో పక్కపక్కనే ఉండడంతో..

250 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల మధ్యలో ఉన్న పాఠశాలలను మూడు విడతల్లో కలిపేలా ప్రణాళిక రూపొందించారు. వీటిలో ఏ ఇబ్బందీ లేని వాటిని ముందుగా ఎంపిక చేశారు. విజయవాడలో చాలాచోట్ల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు సమీపంలో లేదంటే పక్కపక్కనే ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎక్కడున్న వాటిని అక్కడే కొనసాగిస్తూ.. కలిపేసినట్టుగా చూపించారు. పటమటలోని గోవిందరాజులు ఉన్నత పాఠశాలకు ఆనుకునే ప్రాథమిక బడి కూడా ఉంది. ఇలాగే నగరంలోని 80శాతం పాఠశాలలు పక్కపక్కనే ఉన్నాయి. వీటిని పూర్తిగా ఒకే ప్రాంగణంలోనికి మార్చాలంటే తరగతి గదులకొరత ఉంది. అందుకే.. వాటిని ఉన్నవాటిని ఉన్నట్టుగానే ఉంచి విలీనం చూపించారు..

ఆదేశాల మేరకు విలీన ప్రక్రియ:  తాహెరా సుల్తానా, డీఈవో

కృష్ణా జిల్లాలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలల విలీనానికి సంబంధించిన మ్యాపింగ్‌ పూర్తయింది. నివేదికను విద్యాశాఖకు అందజేసేందుకు సిద్ధం చేశాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు విలీన ప్రక్రియ పూర్తిచేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని