logo

ఒక వైపే చూడు..

నందిగామలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు సామాజిక మాధ్యమాలు చూసి  ఇళ్లలో దొంగతనాలకు పాల్పడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.  యువత, నడివయస్కులు సైతం అంతర్జాలాన్ని అడ్డుగోలుగా

Published : 28 Jan 2022 05:20 IST

న్యూస్‌టుడే, సూర్యారావుపేట (విజయవాడ)

నందిగామలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు సామాజిక మాధ్యమాలు చూసి  ఇళ్లలో దొంగతనాలకు పాల్పడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.  యువత, నడివయస్కులు సైతం అంతర్జాలాన్ని అడ్డుగోలుగా ఉపయోగించి జీవితాన్ని ఛిద్రం చేసుకున్న సంఘటనలూ కోకొల్లలు. ఈ మాధ్యమాలను మంచిగా వాడుకొని విజయపథంలో పయనించేవారు ఎంతోమంది మన కళ్లముందే కనిపిస్తున్నారు.

విజ్ఞాన సముపార్జనకు.. కొత్త విషయాలు తెలుసుకునేందుకు.. అద్భుతమైన చేతలు, వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందేందుకు.. పరిశోధనలకు.. నూతన ఆవిష్కరణలకు.. సామాజిక మాధ్యమం పదునైన ఆయుధం. ఇదే సందర్భంలో అద్భుతమైన వ్యక్తుల నైతికత, క్రమశిక్షణను అప్పటివరకు కట్టుకున్న పెట్టని కోటలాంటి ఉన్నత వ్యక్తిత్వాన్ని క్షణాల్లో దెబ్బతీసే శక్తి కూడా దానికే ఉంది. మంచివైపుకే వెళ్తే సామాజిక మాధ్యమాలతో ఎన్నో ప్రయోజనాల్ని పొందవచ్చు. అదే చెడుమార్గంలో వెళితే జైలుకు వెళ్లి ఊచలు లెక్కపెటాల్సి రావచ్చు.. పిల్లలు ఏడుస్తున్నారని తల్లిదండ్రులు చరవాణిలోని సామాజిక మాధ్యమాలను తెరచి ఆటలు, బొమ్మలను చూడాలని ఇస్తున్నారు. అలా బాలలు తెలియకుండా వాటికి బానిసలవుతున్నారు ఉహ తెలుస్తున్నప్పటి నుంచి సొంతంగా చరవాణిలో యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవడం, అందులోని క్రీడలను ఆడటం మొదలుపెడుతున్నారు. క్రమేణా సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్నారు. ఈక్రమంలో చెడు స్నేహాలకు అలవాటుపడిన బాలలు టీన్‌ఏజ్‌లో గాడి తప్పిపోతున్నారు. జేబుదొంగతనాలు, మత్తుపదార్ధాలు, గొలుసు చోరీలు, చరవాణీల తస్కరణలు, గంజాయి విక్రయాలు, కొట్లాటలు తదితర నేరాల్లో 18 లోపు బాలలు ఉంటున్నట్లు ఏడాదిలో సుమారు 30 మంది బాలలు ఉంటున్నట్లు పోలీసుల గణాంకాలు చెపుతున్నాయి.

సైబర్‌ క్రైం అంటే ....

అంతర్జాలం ఆధారంగా ఒకరి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే అది సైబర్‌ నేరంగా పరిగణిస్తారు. ఒకరికి ఎస్‌ఎంఎస్‌ లేదా లింక్‌లు పంపి వారి బ్యాంకు ఖాతాల నుంచి నగదును దొంగిలించటం కూడా ఒక నేరమే. సైబర్‌ చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తారు.

గత 3 సంవత్సరాల్లో విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో నమోదైన సైబర్‌ నేరాలు


లారీకి నిప్పుపెట్టబోతూ...

కొన్నాళ్ల క్రితం సత్తెనపల్లిలో వేర్వేరు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు దగ్ధమవ్వడం కలకలం రేపింది. ఒకరోజు రాత్రంతా పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో మారు వేషాల్లో గస్తీ నిర్వహిస్తుండగా లారీకి నిప్పుపెట్టబోతూ 14 ఏళ్ల బాలుడు పట్టుబడ్డాడు.  ఎందుకు ఇలా చేస్తున్నావని ఆరా తీయగా స్పైడర్‌ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర ప్రభావంతో హింసకు పాల్పడుతున్నట్లు చెప్పడంతో అవాక్కయ్యారు.


విలాసంగా జీవించాలని...

గుంటూరుకు చెందిన పలువురు యువకులు విలాసంగా జీవించాలని భావించారు. సామాజిక మాధ్యమాల ద్వారా మత్తు పదార్ధాలను ఇతర రాష్ట్రాల నుంచి ఎలా తెప్పించుకోవాలని తెలుసుకుని అమలు పరిచారు. పోలీసులకు చిక్కారు.


ప్రేమ విఫలమైందని...

కడపకు చెందిన యువకుడు విజయవాడలో చదువుకుంటూ యువతితో కలసి తిరిగారు. ప్రేమను ఆమె నిరాకరించడంతో ఆమెతో దిగిన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌ ఖాతాలో అప్‌లోడ్‌ చేయటంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగం వస్తుందనుకునే తరుణంలో ఊచలు లెక్కపెడుతున్నాడు.


చరవాణి చెరలో...

ఒకపుడు కాస్తంత ఖాళీ దొరికితే చేతిలో పుస్తకం కనిపించేంది. కానీ ఇపుడు చరవాణి కనిపిస్తోంది. రాత్రి పూట చరవాణిని చూడటం మంచిది కాదంటున్నారు నేత్రవైద్య నిపుణులు. చీకటిలో కంటి నరాలు దెబ్బతింటాయని, కంటిలో తేమ తగ్గిపోయి పొడిబారుతాయని హెచ్చరిస్తున్నారు.


ఆ వీడియోతో  సాగు ఆలోచన
- ఓంకార్‌ సురేంద్ర, లాల్‌పురం, గుంటూరు

పత్తి పంట వేస్తే నష్టాలు వస్తున్నాయి. ఇక వ్యవసాయం చాలనుకున్నాను. ఇంతలో యూట్యూబ్‌లో ఓ వీడియో నన్ను ఆలోచింపజేసింది. కాశ్మీరు రేగు మొక్కలను భద్రాచలం నుంచి తెప్పించి మా ఇంటి మిద్దెపై నాటాను. అవి చక్కగా పండటంతో ఎకరం విస్తీర్ణంలో పంట వేశాను. దాదాపు 4 లక్షల ఆదాయం వచ్చింది. అంతర్జాలంలో జీవితానికి పనికొచ్చే అంశాలు చూస్తుంటాను.  


మనసుకు హాయి.. మందు పని లేదోయి
- ఎంవీ సువర్చల, పెనమలూరు, విజయవాడ

నాకు చాలా సంవత్సరాల నుంచి బ్యాక్‌ పెయిన్‌ ఉంది. ఎన్నో రకాల మందులు వాడాను, కాని తగ్గ లేదు. ఇంటి పని ఒత్తిడిలో చికాకు వాతావరణం ఉండేది.  ఓ సమావేశంలో విన్నాక అంతర్జాలంలో  వెతికి ధ్యానం నేర్చుకున్నాను. ఆరోగ్య సమస్య బాగైంది. మానసికంగానూ చాలా ప్రశాంతంగా ఉంటోంది. ఆలోచన పెరిగింది. మానవ సంబంధాలు మెరుగుపడ్డాయ్‌.


ఊరిని మార్చేద్దాం

వస్త్రవ్యాపారం చేసుకుంటూ... గృహిణిగా ఇల్లు చక్కదిద్దుకునేదాన్ని. నగర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ‘మన ఊరిని మార్చుకుందామా...’ అనే నినాదంతో ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారం ప్రారంభించాను. సొంత ఖర్చులతో నగరంలోని ప్రధాన రహదారులపై గోడలను సుందరంగా మార్చాము. 790 మంది యువత నన్ను అనుసరించారు. కొవిడ్‌ సమయంలో ఇళ్లకు ఆహారం అందించాం. ఫేస్‌బుక్‌ద్వారా ఓ సేవా సైన్యాన్ని సృష్టించాను. 

- లక్ష్మీ అన్నపూర్ణ, విజయవాడ


పర్యవేక్షణ అవసరం

పిల్లలు ఏం చూస్తున్నారు.. ఏం చేస్తున్నారు.. ఎవరెవరితో ఛాటింగ్‌లో ఉంటున్నారనేది తల్లిదండ్రులు పరిశీలించాలి.  పిల్లలుచూసే వీడియోల్నిబట్టి వారి భావోద్వేగాలు, అలవాట్లు, ఆసక్తులు, అభిరుచుల్ని గుర్తించవచ్చు. చెడుమార్గంలోకి వెళ్తుంటే ఆదిలోనే చెక్‌ పెట్టేయాలి. మానసిక రుగ్మతల బారినపడిన యువత, చిన్నారులు తల్లిదండ్రుల మాట వినరు.  

- డాక్టర్‌ టీఎస్‌ రావు, విజయవాడ జువైనల్‌ జస్టిస్‌ బోర్డు మాజీ సభ్యుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని