logo

నెత్తురోడిన హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌

16వ జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించిన హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌ నెత్తురోడింది. ఇటీవలే ఈ మార్గంలో రాకపోకలు ప్రారంభించగా.. గురువారం స్వల్ప వ్యవధిలో రెండు దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు దుర్మరణం చెందగా..

Published : 28 Jan 2022 02:08 IST

ఒకే రోజు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు 

ముగ్గురి దుర్మరణం

కొన ఊపిరితో ఉన్న సూర్యను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: 16వ జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించిన హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌ నెత్తురోడింది. ఇటీవలే ఈ మార్గంలో రాకపోకలు ప్రారంభించగా.. గురువారం స్వల్ప వ్యవధిలో రెండు దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు దుర్మరణం చెందగా.. ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు.
కుమార్తె ఇంటికి వెళుతూ.. అనంతలోకాలకు: విజయవాడ వాంబే కాలనీకు చెందిన బిందాని కొండలరావు(65) స్థానికంగా ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుంటాడు. ఈయన కుమార్తె అత్తగారు ఇటీవల మరణించారు. పెద్దకర్మ తదనంతర కార్యక్రమాల నిమిత్తం గురువారం భార్య నాగేశ్వరి(60)తో కలిసి ద్విచక్ర వాహనంపై ఏలూరు వెళుతున్నారు. బైపాస్‌ను దాటి బొమ్ములూరు వద్ద రామిలేరు వంతెన చేరుకుంటుండగా, వీరి వాహనం అదుపు తప్పి ప్రధాన రహదారికి, సర్వీసు రోడ్డుకు మధ్య ఉన్న గోడను ఢీకొంది. దీంతో దంపతులిరువురూ కిందపడిపోయారు. బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించిన హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దైవ దర్శనాలకు వెళుతూ..: చిత్తూరు జిల్లా రేణిగుంట జ్యోతినగర్‌కు చెందిన సూర్య(19), విశ్వ.. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. గురువారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని పశ్చిమ గోదావరి జిల్లా బయలుదేరారు. బైపాస్‌ మార్గంలో శేరీనరసన్నపాలెం వంతెన దాటిన తర్వాత వారి వాహనం అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొట్టింది. వాహనం వెనక కూర్చున్న సూర్య ఎగిరిపడి జాతీయ రహదారికి, సర్వీసు రహదారికి మధ్య ఏర్పాటు చేసిన రెయిలింగ్‌పై పడ్డాడు. దీంతో అతని శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. విశ్వకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఏలూరు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే సూర్య ప్రాణాలు కోల్పోయాడు. విశ్వను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఎస్సైలు కార్తీక ఉషారాణి, సుందరరావు, ఏఎస్సై శివాజీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని