logo

టెండర్లకు స్పందన ఏదీ?

ఒకప్పుడు ఆర్‌అండ్‌బీలో పనులకు టెండర్లు పిలుస్తున్నారంటే కార్యాలయంలో కోలాహాలం ఉండేది. గుత్తేదారులు ఫారం తీసుకునే ప్రక్రియ నుంచి టెండరు దాఖలు వరకు సందడి నెలకొనేది. గుత్తేదారులు పోటీపడి నిర్ణీత మొత్తం కంటే తక్కువకే

Published : 28 Jan 2022 02:37 IST

చెక్‌ రూపంలో బిల్లులు చెల్లిస్తామన్నా రాని గుత్తేదారులు
ఈనాడు, అమరావతి

ఒకప్పుడు ఆర్‌అండ్‌బీలో పనులకు టెండర్లు పిలుస్తున్నారంటే కార్యాలయంలో కోలాహాలం ఉండేది. గుత్తేదారులు ఫారం తీసుకునే ప్రక్రియ నుంచి టెండరు దాఖలు వరకు సందడి నెలకొనేది. గుత్తేదారులు పోటీపడి నిర్ణీత మొత్తం కంటే తక్కువకే పనులు చేయడానికి ముందుకు వచ్చి దక్కించుకునేవారు. గత మూడేళ్లుగా గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్‌అండ్‌బీ విభాగం పిలుస్తున్న పనులకు స్పందన కరవైంది. ఇప్పటికే పనులు చేసి ఆర్థికంగా కుదేలయ్యామని పాత బిల్లులు ఇవ్వకుండా పని చేసే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో 92 పనులకు రూ.164 కోట్ల నిధులు మంజూరు చేసినా ఇప్పటివరకు నామమాత్రంగానే పనులు మొదలయ్యాయి. ఒప్పందాలు చేసుకున్నవారు సైతం పనులు చేయడానికి వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. సింహభాగం పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందన కరవైంది. ఇటీవల పాత బకాయిలు కొన్ని విడుదల చేయడంతో కొందరు ముందుకువచ్చారు. ఆర్‌అండ్‌బీ గుత్తేదారులకు ప్రభుత్వం చెల్లించే బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా కాకుండా బ్యాంకు నుంచి చెక్‌ రూపంలో నేరుగా చెల్లిస్తామని చెప్పి గుత్తేదారులను ఇంజినీర్లు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది.  గతేడాది అధిక వర్షాలతో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి.
రెండేళ్లుగా ఇంతే... జిల్లాలో ప్రధాన రహదారులు సైతం రెండేళ్లుగా కనీస మరమ్మతు చేయకపోవడంతో భారీ గోతులు పడి అధ్వానంగా తయారయ్యాయి. రాత్రివేళ ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు గోతులు పడి గాయపడటం, చనిపోవడం సాధారణంగా మారింది. ముఖ్యమైన రోడ్ల మరమ్మతుకు నిధులు మంజూరైనా గుత్తేదారులు ఆసక్తి చూపకపోవడంతో పనులు సాగడం లేదు. రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల ప్రయాణ సమయం పెరగడంతోపాటు విలువైన ఇంధనం వృథా అవుతోంది. న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో 13 రోడ్ల విస్తరణకు రూ.121.46 కోట్లతో 94.11  కిలోమీటర్లు అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందులో రెండు రోడ్ల పనులు మాత్రమే మొదలయ్యాయి.
రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల ప్రయాణ సమయం పెరగడంతోపాటు విలువైన ఇంధనం వృథా అవుతోంది. న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో 13 రోడ్ల విస్తరణకు రూ.121.46 కోట్లతో 94.11  కిలోమీటర్లు అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందులో రెండు రోడ్ల పనులు మాత్రమే మొదలయ్యాయి.


నకరికల్లు-గురజాల వెళ్లే మార్గంలో నకరికల్లు సమీపంలో రహదారి దుస్థితి ఇది. ఈ రహదారిలో 8 కిలోమీటర్ల దూరం మరమ్మతుకు రూ.3.13 కోట్లతో రెండుసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారుల నుంచి స్పందన లేదు. దీంతో రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. నర్సింగపాడుకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో డస్ట్‌ వేసి సరిచేశారు. ఇటీవల వర్షాలకు మరింత దారుణంగా గుంతలు పడి వాహనదారులు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. ఇదే మార్గంలో గుండ్లపల్లి వద్ద డిసెంబరు 31న నకరికల్లుకు చెందిన అవినాష్‌ ద్విచక్ర వాహనంపై వెళుతూ గుంతలో పడి తలకు దెబ్బతగిలి అక్కడికక్కడే చనిపోయారు. ఆరోజు అవినాష్‌ పుట్టినరోజు కావడం గమనార్హం. ఇదే గుంతలో గుండ్లపల్లి చెందిన తపాలాశాఖ ఉద్యోగి మురళీ నవంబరు నెలలో పడి 15రోజులుపైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబరులో మృతిచెందారు.  


?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని