AP PRC: పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు: ఆర్టీసీ కార్మిక సంఘాలు

పీఆర్సీ జీవోల రద్దు, ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

Updated : 28 Jan 2022 15:50 IST

విజయవాడ: పీఆర్సీ జీవోల రద్దు, ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమంలో ఆర్టీసీ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని.. అన్ని రకాల ఆందోళనలకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తే మంచి జరుగుతుందని భావించామని.. విలీనానికి ఎందుకు అంగీకరించామా అని ఇప్పుడు ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. ఉన్న సౌకర్యాలు కోల్పోతుంటే మేం కోరుకున్న విలీనం ఇదేనా? అని కార్మికవర్గాల్లో చర్చ జరుగుతోందని చెప్పారు. రివర్స్‌ పీఆర్సీతో జీతాలు తగ్గే పరిస్థితి ఎదురైందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలూ తీర్చడం లేదు: బొప్పరాజు

ఆర్టీసీలో పది సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమానికి మద్దతు ఇచ్చాయని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఏడు నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటాయని అన్ని సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయని చెప్పారు. ప్రభుత్వంలో కలిపినా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017లో ఏరియర్స్ ఇప్పటికీ చెల్లించలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీర్చడం లేదు కానీ ఆర్టీసీ ఆదాయం మాత్రం కావాలంటున్నారని చెప్పారు. ప్రమోషన్లపై త్వరగా కోరిన విధంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

సమ్మెకు కారణం ప్రభుత్వమే: సూర్యనారాయణ

తమ పట్ల ప్రభుత్వం వితండవాదం వైఖరి ప్రదర్శిస్తోందని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఉద్యోగులు చికిత్సకు సంబంధించి చాల సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమాధానం లేని అనేక ప్రశ్నలు ఆర్టీసీ ఉద్యోగుల ముందున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని చెప్పారు. తాము చర్చలకుపోవడం లేదని ప్రభుత్వం అపవాదును పక్కన పెట్టాలన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తమతో చాయ్‌ పే చర్చలు జరిపిందని వివరించారు. సమ్మెకు కారణం ప్రభుత్వమని, ఉద్యోగులు కాదని ప్రజలు గుర్తించాలని సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని