logo

Fraud-Jagananna Colonies: అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల

గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు జగనన్న కాలనీల పేరుతో ప్రజాధనాన్ని మెక్కేశారు. ఇళ్ల పట్టాల పంపిణీని అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. రాప్తాడు పరిధిలోని ప్రభుత్వ లేఅవుట్‌లోని ఓపెన్‌ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కూడా ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించేశారు.

Updated : 16 Jun 2024 08:05 IST

గత ప్రభుత్వంలో వైకాపా నాయకులొక్కొక్కరికి 3 ఇళ్లు మంజూరు

ఈనాడు డిజిటల్, అనంతపురం: గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు జగనన్న కాలనీల పేరుతో ప్రజాధనాన్ని మెక్కేశారు. ఇళ్ల పట్టాల పంపిణీని అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. రాప్తాడు పరిధిలోని ప్రభుత్వ లేఅవుట్‌లోని ఓపెన్‌ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కూడా ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించేశారు. వైకాపా స్థానిక నాయకులతో పాటు రాప్తాడు నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు సైతం జగనన్న కాలనీల్లోని ఇళ్లను అమ్ముకుని సొమ్ము వెనకేసుకున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. పార్టీలు చూడం అంటూనే తెదేపా సానుభూతిపరులైన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయకుండా ఒక్కో స్థలాన్ని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఇతరులకు విక్రయించారు. ఇలా ఒక్కో నాయకుడు వందల సంఖ్యలో ఇళ్ల స్థలాలను అమ్ముకుని.. నియోజకవర్గ స్థాయిలోని వైకాపా కీలక నాయకుడి సోదరులకు పెద్దమొత్తంలో వాటాలు సమర్పించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో గత పాలకులు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాప్తాడు ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

బిల్లులు బొక్కేశారు

జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షలు మంజూరు చేస్తారు. వివిధ స్థాయిల్లో విడతల వారీగా బిల్లులు లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తారు. అయితే రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రాప్తాడు, ప్రసన్నాయపల్లి, మరూరు, చెర్లోపల్లి, బుక్కచర్ల, గొల్లపల్లి, బండమీదపల్లి, గాండ్లపర్తి, బొమ్మేపర్తి, బోగినేపల్లి, పాలచెర్ల గ్రామాల్లో పెద్దమొత్తంలో బిల్లులను పక్కదారి పట్టించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే బిల్లులు మంజూరు చేశారు. అప్పట్లో హౌసింగ్‌ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అర్హత లేకపోయినా ఇళ్లు మంజూరు చేసినట్లు చూపి బిల్లులు కట్టబెట్టారు. ఇలా ఒక్క రాప్తాడు మండలంలోనే 300 ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు మంజూరు చేశారు. ఇలా రూ.5 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.

  • మరూరు గ్రామంలో వైకాపా నాయకుడి తల్లి, భార్య పేరుతో ఒకే కుటుంబంలో రెండు ఇళ్లు మంజూరు చేశారు. జియో ట్యాగింగ్‌ పూర్తి చేసి రూ.2.54 లక్షలు కట్టబెట్టారు.
  • రాప్తాడులో కీలకంగా వ్యవహరిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధి భార్య, తల్లి పేరుతో రెండు ఇళ్లు మంజూరు చేశారు. ఇలా ఇళ్లు నిర్మించకపోయినా ఇద్దరి పేరుతో రూ.2.35 లక్షల మేర బిల్లులు స్వాహా చేశారు.

రాప్తాడు పరిధిలోని జగనన్న కాలనీ.. ఇందులోనే ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్న వైకాపా నాయకులు

రాప్తాడులో ‘రాణి’ గారి లీలలు

రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని జగనన్న కాలనీల్లో వైకాపా నాయకులు పాగా వేశారు. అర్హులకు కాకుండా వైకాపా సానుభూతిపరులకు ఇళ్ల పట్టాలు కట్టబెట్టారు. స్థానికంగా ఉండే వైకాపా నాయకురాలు ఒకరు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ వైకాపా కీలక నాయకుడి అండతో అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆడించినట్లు తెలుస్తోంది. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన ఇళ్ల పట్టాలను తన వద్దే పెట్టుకుని వాటితో వ్యాపారం చేసినట్లు ఆరోపణలున్నాయి. తెదేపాకు చెందిన 15 మంది లబ్ధిదారుల పట్టాలను ఇప్పటికీ అందించలేదు. దీనిపై బాధితులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రాప్తాడు పరిధిలోని జగనన్న కాలనీలోని రెడ్‌ మార్క్‌లో ఉంచిన ప్లాట్లను సైతం వైకాపా నాయకులు విక్రయించుకున్నారు. ఇప్పటికే చాలామంది నిర్మాణాలు సైతం మొదలుపెట్టారు. ఇలా సుమారు 40 వరకు ఇళ్ల స్థలాలు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు మొన్నటివరకు పట్టించుకోలేదు. ఇప్పుడు తెదేపా అధికారంలోకి రావడంతో వీటిపై విచారణ చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

బొమ్మేపర్తి గ్రామంలో వైకాపా నాయకులకు నిబంధనలకు విరుద్ధంగా 12 గృహాలు మంజూరు చేశారు. వీటి నిర్మాణం చేపట్టకపోయినా రూ.14.68 లక్షల మేర బిల్లులు నొక్కేశారు. వీటన్నింటిపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


విచారణ జరుగుతోంది

రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని జగనన్న కాలనీల్లో అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. సంబంధిత అధికారుల వివరణ కోరడంతోపాటు విచారణకు ఆదేశించాం. వారంలోగా పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం.

నరసింహారెడ్డి, హౌసింగ్‌ పీడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని