logo

జగనన్న పాపం.. రైతులకు శాపం

ప్రభుత్వ ప్రచార పిచ్చి.. అధికారుల నిర్లక్ష్యంతో  రీసర్వేలో జరిగిన పొరపాట్లు రైతులకు శాపంగా మారుతున్నాయి. కొత్త పాసుపుస్తకాల్లో తప్పుల కారణంగా పంట రుణాల నవీకరణకు రైతులు అవస్థలు పడుతున్నారు.

Updated : 19 May 2024 05:11 IST

రీసర్వే గ్రామాల్లో పంట రుణాల నవీకరణ కష్టాలు
కొత్త పాసుపుస్తకాల్లో విస్తీర్ణం తగ్గడంతో నష్టపోతున్న వైనం

ఈనాడు డిజిటల్, అనంతపురం -న్యూస్‌టుడే, ఉరవకొండ, బొమ్మనహాళ్, కళ్యాణదుర్గం గ్రామీణం: ప్రభుత్వ ప్రచార పిచ్చి.. అధికారుల నిర్లక్ష్యంతో  రీసర్వేలో జరిగిన పొరపాట్లు రైతులకు శాపంగా మారుతున్నాయి. కొత్త పాసుపుస్తకాల్లో తప్పుల కారణంగా పంట రుణాల నవీకరణకు రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల రెన్యువల్‌ చేయబోమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు.  కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులకు రుణాల మంజూరులో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రీసర్వే జరిగిన గ్రామాల్లో 1బీ, అడంగల్‌ పత్రాలకు సంబంధించి గందరగోళం నెలకొంది. ఆయా గ్రామాల్లో కొంతమంది ఖాతాలను అధికారులు లాక్‌ చేశారు. దీంతో అన్నదాతలు బ్యాంకు రుణాల కోసం రెవెన్యూ అధికారుల వెంట తిరగాల్సి వస్తోంది. వీఆర్వో, ఎమ్మార్వో కనికరిస్తే తప్ప రుణాలు అందే పరిస్థితి కనిపించడం లేదు.

సంయుక్త ఖాతాలపై  గందరగోళం

భూవివాదాల శాశ్వత పరిష్కారానికి రీసర్వే చేపట్టినట్లు జగన్‌ ప్రభుత్వం పేర్కొంది. వివాదాలు పరిష్కారం కాకపోగా.. మరింత పెరిగాయి. సరైన శిక్షణ లేకుండానే అధికారుల్ని క్షేత్రస్థాయిలో పంపడంతో చాలాచోట్ల తప్పులు దొర్లాయి. కొన్నిచోట్ల క్షేత్రస్థాయికి వెళ్లకుండానే రీసర్వే పూర్తిచేసినట్లు చూపించారు. రికార్డుల స్వచ్ఛీకరణపై శ్రద్ధ పెట్టలేదు. దీంతో కొత్తగా జారీ చేసిన పాసుపుస్తకాల్లో పేర్లు, విస్తీర్ణం తదితరాలను తప్పుగా ముద్రించారు. పాత పుస్తకాల్లో విస్తీర్ణణం.. కొత్తవాటిలో నమోదు చేసిన దానికి తేడాలు ఉండటంతో రైతులు పాసుపుస్తకాలు వెనక్కి ఇచ్చేశారు. వాటిని ఇప్పటికీ సరిదిద్దలేదు. ఒకే సర్వేనెంబరుపై ఉన్న రైతులకు జాయింట్‌ పాసుపుస్తకాలు ఇచ్చారు. నలుగురు, ఐదుగురు రైతులకు కలిపి ఒకే పాసుపుస్తకం జారీ చేశారు. అలాంటి వారికి రుణాలు రెన్యువల్‌ చేయడానికి కొన్ని బ్యాంకుల్లో ఒప్పుకోవడం లేదు. రెవెన్యూ అధికారుల సంతకాలు పెట్టించుకురావాలని వెనక్కి పంపిపస్తున్నారు.

అధికారులు చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు

రీసర్వే జరిగిన గ్రామాల్లో ఇప్పటికీ కొంతమంది రైతులకు 1బీ, అడంగల్‌ పత్రాలు ఆన్‌లైన్‌లో రావడం లేదు.  దీంతో మీభూమిలో పత్రాలను జిరాక్స్‌ తీసుకుని రెన్యువల్‌ కోసం వెళ్తున్నారు. వాటిని బ్యాంకర్లు అంగీకరించడం లేదు. వీఆర్వో, తహసీల్దార్‌ సంతకాలు కావాలని చెబుతున్నారు. జాయింట్‌ ఖాతాలు ఉన్న రైతులకు అభ్యంతరం చెబుతున్నారు. రెవెన్యూ అధికారుల సంతకాలు ఉంటే తప్ప రుణాల నవీకరణ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కొత్తగా నియమితులైన అధికారులు కొందరు సంతకాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు.

తప్పులతో తంటాలు

సాధారణంగా ఏటా పంట రుణాల పరిమితిని బ్యాంకులు పెంచుతాయి. గతేడాది ఎకరాకు రూ.30 వేలు ఇచ్చిన రైతుకు ఈ ఏడాది రూ.40 వేల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే గతేడాది రుణానికి సంబంధించి వడ్డీ కట్టేస్తే అదనంగా రావాల్సిన మొత్తాన్ని బ్యాంకర్లు తిరిగిస్తారు. రీసర్వే జరిగిన గ్రామాల్లోని రైతులకు ఇచ్చిన పాసుపుస్తకాల్లో చాలామందికి విస్తీర్ణం తప్పుగా నమోదు చేశారు. కొంతమందికి 1.5 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు తక్కువగా నమోదు చేశారు. అలాంటి రైతులకు గతేడాది కంటే తక్కువ రుణం మంజూరు చేస్తారు.  గతేడాది రుణానికి వడ్డీలు కట్టడం తప్ప తిరిగి బ్యాంకు నుంచి పొందేది ఏమి ఉండదు. అధికారులు చేసిన తప్పులకు అన్నదాతలు బలవుతున్నారు.


పరిష్కారం చూపాలి

- బి.కృష్ణయ్య, దర్గాహొన్నూరు, బొమ్మనహాళ్‌

నాకు 5 ఎకరాల పొలం ఉంది. రెండో విడత కింద రీసర్వే జరుగుతోంది. 1బీ, అడంగల్‌ పత్రాలను ఆన్‌లైన్‌లో లాక్‌ చేశారు. మీభూమి వెబ్‌సైట్‌లో 1బీ, అడంగల్‌ పత్రాలు ప్రింట్‌ తీసుకుని బ్యాంకుకు వెళితే అధికారులు నిరాకరించారు. జిరాక్స్‌లపై రెవెన్యూ అధికారుల సంతకాలు చేసుకుని రావాలని చెప్పారు. అధికారుల వద్దకు వెళితే తాము కేవలం ఎన్నికల విధుల కోసమే వచ్చామంటూ సంతకాలు పెట్టడానికి నిరాకరిస్తున్నారు. ఇలాగైతే రుణాలు ఎలా అందుతాయి. అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలి.


మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు

- వెంకటేశులు, కురాకులతోట, కళ్యాణదుర్గం మండలం

సర్వే నంబరు 2-29బీలో 1.30 ఎకరాల భూమి ఉంది. 1బీ కోసం కొన్ని నెలలుగా అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సంబంధిత రెవెన్యూ అధికారులకు  పలుమార్లు సమస్యను మొరపెట్టుకొన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సాగు పెట్టుబడికిగాను రుణాల కోసం పడిరాని పాట్లు పడాల్సి వస్తుంది. సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని