logo

రాయితీ వేరుసెనగ విత్తనకాయలు పక్కదారి?

ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాధార ప్రాంతాల్లో వేరుసెనగ పంట సాగు ప్రధానం. ఏటా ప్రభుత్వం రాయితీతో విత్తన కాయలు పంపిణీ చేస్తోంది. అయితే సరైన నిబంధనలు, పర్యవేక్షణ కొరవడటంతో పేరు రైతులది.. విత్తనం పక్కదారి అన్న చందంగా మారింది.

Published : 13 Jun 2024 02:39 IST

నేరుగా వాహనాల్లో వ్యాపారులకు చేరుతున్నట్లు ఆరోపణలు
కొందరి అధికారుల సహకారంపై అనుమానాలు
పుట్టపర్తి, కదిరి, న్యూస్‌టుడే

ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాధార ప్రాంతాల్లో వేరుసెనగ పంట సాగు ప్రధానం. ఏటా ప్రభుత్వం రాయితీతో విత్తన కాయలు పంపిణీ చేస్తోంది. అయితే సరైన నిబంధనలు, పర్యవేక్షణ కొరవడటంతో పేరు రైతులది.. విత్తనం పక్కదారి అన్న చందంగా మారింది. రాయితీ విత్తనం నేరుగా వ్యాపారులకు చేరడం వెనుక కొందరు అధికారుల సహకారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంపిణీ కేంద్రాల వద్దకు రైతులు తక్కువగా రావటం.. వాహనాల్లో బస్తాలను తరలించడం చూస్తే విత్తనం పక్కదారి పట్టిందనటానికి ఊతమిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి విత్తనం పక్కదారితో అక్రమార్జనకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

‘‘గాండ్లపెంట మండలంలో వారం కిందట మిల్లుకు వెళ్లే వాహనంలో రాయితీ వేరుసెనగ కాయలు తీసుకెళ్లారు. అందులోనూ రైతులు లేకుండా పెద్దసంఖ్యలో రాయితీ వేరుసెనగ బస్తాలతో ట్రాక్టరులో తీసుకెళ్లటం కనిపించింది. పంపిణీ కేంద్రాల నుంచి మిల్లుకు నేరుగా వెళ్లాయంటే ఈ తతంగం వెనుక పక్కా ప్రణాళికే ఉంటుంది. రైతులైతే సంబంధిత గ్రామాలకు తీసుకెళ్లాలి. అలా కాకుండా మిల్లుకు వెళ్లాయంటే.. పక్కదారి కాక మరేమిటో అధికారులే చెప్పాలి.’’

రైతుల ఇళ్లకు చేరని విత్తనం

ప్రభుత్వం వేరుసెనగ విత్తనం పొందే రైతులకు రాయితీ కల్పించింది. కిలో విత్తన కాయలు ధర రూ.95. అందులో ప్రభుత్వ రాయితీ రూ.38, రైతు రూ.57 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 30 కిలోల బస్తాకు రూ.1,140 రాయితీ ఇస్తే రైతులు రూ.1,710 చెల్లించాల్సి ఉంది. వీటిని ముందే బయోమెట్రిక్‌ వేసి పేర్లు నమోదు చేసుకున్న రైతులకే ఇస్తారు. వాళ్లు పంపిణీ కేంద్రాలకు వచ్చి విత్తనం తీసుకెళ్లాలి. ఒక్కో పట్టాదారు పాసుపుస్తకానికి గరిష్ఠంగా మూడు బస్తాల విత్తనం ఇస్తారు. అయితే రైతులకు ఒక్కో కూపన్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. ఏదేమైనా పేర్లు నమోదు చేసుకున్న రైతులు రాకుండా వేరుసెనగ మాత్రం వాహనాల్లో వెళ్లటం వెనుక మతలబుతోనే పక్కాగా పక్కదారి పడుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మండల స్థాయి అధికారులు కొందరు తమకు అనుకూలమైన చోట్ల వ్యాపారులకు సహకరించటం ద్వారా అక్రమాలకు కారణంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లా: శ్రీసత్యసాయి

రాయితీ వేరుసెనగకు నమోదు చేసుకున్న రైతులు 1,01,020
పంపిణీ చేసిన విత్తనం 86,035 క్వింటాళ్లు
నిల్వ ఉన్నది  2,500 క్వింటాళ్లు


అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

రాయితీ వేరుసెనగ విత్తన పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. విత్తనాన్ని అర్హులైన రైతులకే అందజేస్తున్నాం. కొన్నిచోట్ల కూపన్లు అమ్ముకోవడంతో అక్రమాలకు తావిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గోదాములపైనా దాడులు జరుపుతున్నాం. రైతుల అవసరాన్ని బట్టి విత్తన కాయలు ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాం.

సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని