logo

బడి పిలుస్తోంది..

పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్‌ 12 నాటికి సెలవులు ముగిశాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5127 పాఠశాలలున్నాయి.

Updated : 13 Jun 2024 04:43 IST

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
 అనంతపురం విద్య,  న్యూస్‌టుడే

పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్‌ 12 నాటికి సెలవులు ముగిశాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5127 పాఠశాలలున్నాయి. అందులో ప్రభుత్వ పాఠశాలలు 3,855, ప్రైవేటు పాఠశాలలు 1272 ఉన్నాయి. మొత్తం విద్యార్థులు సుమారు 5.88 లక్షల మంది పాఠశాలల్లో చదువుతున్నారు. గురువారం పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు.

అవస్థలు తప్పవా?

  • ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదులు, ఫ్యాన్లు, లైట్లు తదితర మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నాడు-నేడు పథకం కింద ఉమ్మడి జిల్లాలో 2,184 పాఠశాలల్లో మరమ్మతులు, అదనపు భవనాల నిర్మాణం చేపడుతున్నారు.
  • గత ప్రభుత్వం నాడు-నేడు పథకానికి సకాలంలో నిధులు విడుదల చేయక ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగాయి. ఇటీవల కొన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. నిర్మాణ సామగ్రి కొన్ని పాఠశాలల్లో అస్తవ్యస్తంగా ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నూతన ప్రభుత్వం ఏర్పడింది. విద్యాశాఖ బాధ్యతలు చేపట్టి మంత్రి పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సమస్యలపై దృష్టిసారించాల్సి ఉంది.

అనంతపురం: ఎస్కేడీ పాఠశాలలో అసంపూర్తిగా గదుల నిర్మాణం

కొనుగోళ్లు చేయలేక..

జూన్‌ వచ్చిందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రులు అమ్మో జూన్‌ అంటూ బెంబేలెత్తుతున్నారు.  స్కూల్‌ ఫీజులు, బస్సు ఫీజులు, పుస్తకాలు, స్కూల్‌ బ్యాగులు, క్యారియర్‌ బ్యాగులు, వాటర్‌ బాటిళ్లు, బూట్లు, సాక్సులు, యూనిఫారం, జామెంట్రీ బాక్సులు, పెన్నులు, పెన్సిళ్లు తదితర విద్యాసామగ్రిని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాసామగ్రి ఉచితంగా ప్రభుత్వమే ఇస్తుంది. అయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేయాల్సిందే. కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లలో 30 శాతం ఫీజు కడితేనే పుస్తకాలిస్తామని షరతు పెట్టడంతో చాలామంది తల్లిదండ్రులు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఉచిత కిట్ల పంపిణీకి సన్నాహాలు

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా విద్యా సామగ్రి కిట్ల రూపంలో పంపిణీ చేస్తుంది. పాఠ్య పుస్తకాలు 90 శాతం జిల్లాకు వచ్చాయి. రాత పుస్తకాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. బెల్టులు, షూ, బ్యాగులు అనంత జిల్లాలో 15 మండలాలకు మాత్రమే వచ్చాయి. యూనిఫారం ఇంకా రావాల్సి ఉంది. వాటిని మండల కేంద్రాల నుంచి పాఠశాల స్టాక్‌ పాయింట్‌కు పంపించారు. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తరువాత వాటిని పంపిణీ చేయనున్నట్లు సమాచారం.

ఉమ్మడి జిల్లాలో మొత్తం పాఠశాలలు 5,127
ప్రభుత్వానివి.. 3,855
ప్రైవేటు.. 1,272
మొత్తం విద్యార్థులు 5.88 లక్షలు


గదుల కొరత

కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గదుల కొరత ఉంది. నాడు-నేడు పథకం కింద గదుల కొరత ఉన్న పాఠశాలల్లో అదనపు గదులు నిర్మిస్తున్నారు. అనంత జిల్లాలో 1,102 పాఠశాలలు, శ్రీసత్యసాయి జిల్లాలో 1,081 పాఠశాలలు మొత్తం 2,184 పాఠశాలలు ఈ పథకం కింద ఎంపికయ్యాయి. అనంతలో 984, శ్రీసత్యసాయి జిల్లాలో 480 మొత్తం 1,464 పాఠశాలల్లో అదనపు గదులు నిర్మిస్తున్నారు. ఇతర పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. రెండేళ్లుగా మూడు విడుతల్లో అరకొరగా నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికి కేవలం రూ.359 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 2022 పనులు ఆరంభించగా 2024 జూన్‌ నాటికి కూడా పూర్తి కాలేదు. విద్యార్థులు ఇబ్బందుల దృష్ట్యా గదుల సమస్య పరిష్కరించాలి.


ఫీజుల భారం

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వేసవి సెలవుల్లో అడ్మిషన్లు నిర్వహించకూడదు, పుస్తకాలు విక్రయించరాదు. నిబంధనలు తుంగలోతొక్కి ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు, పుస్తక విక్రయాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు మాత్రమే అన్ని పాఠశాలల్లో బోధించాలి. కానీ ప్రైవేటు పాఠశాలలు తమకు ఇష్టం వచ్చిన సీరీస్‌తో పుస్తకాలు కట్టబెడుతున్నారు. పుస్తకాలకే వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు సీరీస్‌ పుస్తకాలతో పాటు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు కూడా విద్యార్థులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని