logo

‘ఉపాధి’తో పంట కాలువలకు మహర్దశ

జిల్లాలో సాగు నీటి రంగాన్ని గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఐదేళ్లుగా పైసా ఖర్చు పెట్టలేదు. ప్రధాన కాలువలే కాదు... పంట కాలువలన్నీ దయనీయ దుస్థితికి చేరాయి.

Updated : 13 Jun 2024 02:53 IST

156 కి.మీ. మేర పనులు చేపట్టాలని కార్యాచరణ

బొమ్మనహాళ్‌ మండలం దేవగిరి వద్ద హెచ్చెల్సీ కాలువ దుస్థితి

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: జిల్లాలో సాగు నీటి రంగాన్ని గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఐదేళ్లుగా పైసా ఖర్చు పెట్టలేదు. ప్రధాన కాలువలే కాదు... పంట కాలువలన్నీ దయనీయ దుస్థితికి చేరాయి. దీంతో తుంగభద్ర నుంచి అరకొరగా ప్రవహించే జలాలు సైతం సాఫీగా ముందుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీల్లో(పంట కాలువలు) పేరుకపోయిన పూడిక, ఏపుగా పెరిగిన ముళ్లకంపలు, చెత్తాచెదారమే కారణం. కొత్తగా కొలువుదీరిన తెదేపా ప్రభుత్వం  సాగునీటి రంగంపై దృష్టి సారించింది. ఎక్కడికక్కడ ప్రధాన కాలువలే కాదు.. పంట కాలువలను సైతం బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈమేరకు కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశాలతో జలవనరుల శాఖ రంగంలోకి దిగింది. ఉపాధి హామీ నిధులతో పంటకాలువలకు మహర్దశ పట్టనుంది. కాలువల్లో పూడిక, ముళ్లకంపల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. హెచ్చెల్సీ, డ్వామా అధికారుల సమన్వయంతో ఈ పనులకు పూనుకుంటున్నారు. ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ అంశంపై ఇటీవల కలెక్టర్‌ అధికారులతో సమీక్ష జరిపారు. తొలి ప్రాధాన్యతగా పంటల కాలువలను శుభ్రం చేయాలని సంకల్పించారు. హెచ్‌ఎల్‌ఎంసీ పరిధి కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్, ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లోని కీలకమైన పది డిస్ట్రిబ్యూటరీలపై దృష్టి పెట్టారు. మొత్తం 156 కి.మీ. మేర పూడికతీత, ముళ్లకంపలు తొలగింపు పనులు చేపడతారు.

1.43 లక్షల ఎకరాల ఆయకట్టు

హెచ్చెల్సీ కింద మొత్తం 2.85లక్షల ఎకరాలు ఉంటే... ఇందులో ఒక్క అనంత జిల్లా పరిధిలోనే 1.43 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. హెచ్‌ఎల్‌సీ ప్రధాన కాలువ, జీబీసీ, గుత్తి ఉప కాలువ, ఎమ్పీఆర్‌ ఉత్తర, దక్షిణ కాలువలు, తాడిపత్రి ఉప కాలువ కిందే ఆయకట్టు ఉంది. ఈ కాలువల పొడవు 337.49 కి.మీ. ఉన్నాయి. వీటి కింద మొత్తం 101 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. 2014-19 మధ్య తెదేపా హయాంలో జీబీసీ, ఎమ్పీఆర్‌ దక్షిణ, ఉత్తర కాలువల ఆధునికీకరణ సింహభాగం పూర్తి అయ్యాయి. తర్వాత వైకాపా ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఈనేపథ్యంలో ఎమ్పీఆర్‌ దక్షిణ, ఉత్తర కాలువల కింద కొంతమేర పనులు మొదలయ్యాయి. పనులన్నీ జులై 15వ తేదీ నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.


పనులకు శ్రీకారం చుట్టాం

హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలో పంట కాలువల్లో పూడికతీత, ముళ్లకంపల తొలగింపుపై దృష్టి సారించాం. ఉపాధి హామీ నిధులతో పనులు చేయిస్తాం. సాంకేతిక సహకారం అందిస్తాం. అంచనాలు, పనుల నిర్వహణ డ్వామా యంత్రాంగమే చూస్తుంది. ఇప్పటికే ఎమ్పీఆర్, జీబీసీల పరిధిలో పనులు చేపట్టాం. హెచ్‌ఎల్‌ఎంసీ, పీఏబీఆర్‌ కుడి కాలువల కింద పనులు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.

రాజశేఖర్, ఎస్‌ఈ, హెచ్చెల్సీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని