logo

మంత్రివర్గంలో.. అనంత ప్రాధాన్యం

రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాకు పెద్దపీట వేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. ఇద్దరు బీసీలకు ఒకేసారి మంత్రి పదవులు ఇవ్వడంపై ఆ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

Updated : 13 Jun 2024 04:41 IST

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ముగ్గురికి అవకాశం
ఇద్దరు బీసీలకు పదవులు
ఈనాడు డిజిటల్, అనంతపురం

రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాకు పెద్దపీట వేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. ఇద్దరు బీసీలకు ఒకేసారి మంత్రి పదవులు ఇవ్వడంపై ఆ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఉరవకొండ నుంచి గెలుపొందిన పయ్యావుల కేశవ్‌ పార్టీలో సీనియర్‌ అయినప్పటికీ ఆయనకు మొదటిసారి అవకాశం లభించింది. పెనుకొండ, ధర్మవరం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సవిత, సత్యకుమార్‌యాదవ్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం గమనార్హం. ఒక ఓసీ, ఇద్దరు బీసీలకు పదవులు ఇచ్చి సామాజిక సమతూకం పాటించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అప్పట్లో గరిష్ఠంగా రెండే..

గతంలో ఉమ్మడి అనంతపురానికి మూడు మంత్రి పదవులు ఇవ్వలేదు. 2014లో మొదటి విడతలో పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డికి అవకాశం కల్పించారు. రెండో విడతలో సునీతను కొనసాగించి పల్లె స్థానంలో కాలవ శ్రీనివాసులుకు మంత్రి పదవి ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం మొదటి విడతలో పెనుకొండ నుంచి ప్రాతినిథ్యం వహించిన శంకరనారాయణకు, రెండో విడతలో కళ్యాణదుర్గం నుంచి గెలుపొందిన ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి ఇచ్చింది. 2009 కాంగ్రెస్‌ హయాంలోనూ ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులే లభించాయి. రఘువీరారెడ్డి, శైలజానాథ్‌కు పదవులు దక్కాయి. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలోనూ రఘువీరారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి మంత్రులుగా పనిచేశారు. అంతకుముందు తెదేపా ప్రభుత్వంలో 1995 నుంచి 1999 వరకు ఉమ్మడి జిల్లా నుంచి నిమ్మల కిష్టప్ప మంత్రిగా కొనసాగారు. 1999లోనూ నిమ్మల కిష్టప్ప, జయరాం మంత్రులుగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెదేపా కూటమి ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు మూడు మంత్రి పదవులు లభించాయనే చర్చ జరుగుతోంది.

ఎన్నాళ్లో వేచిన ఉదయం..

ఉరవకొండ నియోజకవర్గం నుంచి 1994, 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన పయ్యావుల కేశవ్‌ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఐదోసారి ఎన్నికయ్యారు. ఈసారి పయ్యావులకు  మంత్రి పదవి వరించింది. తెదేపా నుంచి గుర్రం నారాయణప్ప 1985లో ఎమ్మెల్యేగా గెలుపొంది..1988-89 మధ్య మంత్రిగా పనిచేశారు. తర్వాత ఉరవకొండ నుంచి గెలిచిన ఎవరికీ మంత్రి పదవి లభించలేదు. దాదాపు 35 ఏళ్ల తర్వాత నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కింది. అలాగే ధర్మవరంలోనూ 1988-89 మధ్యలో జి.నాగిరెడ్డి తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత వివిధ ప్రభుత్వాల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు పనిచేసినా ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. 35 ఏళ్ల తర్వాత భాజపా తరపున గెలిచిన సత్యకుమార్‌కు కేబినెట్‌లో చోటు లభించడం గమనార్హం. పెనుకొండలో 1994లో గెలుపొందిన పరిటాల రవీంద్ర... ఎన్టీఆర్‌ కేబినెట్‌లో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. 30 ఏళ్ల తర్వాత సవితకు మళ్లీ మంత్రి పదవి వరించింది.

అభివృద్ధికి దోహదం

2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. హంద్రీనీవా ప్రధాన కాలువతో పాటు దాని పరిధిలో జీడిపల్లి-పేరూరు, జీడిపల్లి-బైరవానితిప్ప, హెచ్చెల్సీ ఆదునికీకరణ, మడకశిర బ్రాంచి కెనాల్‌ పనులు శరవేగంగా జరిగాయి. ప్రపంచ దిగ్గజ సంస్థ కియాను జిల్లాకు తీసుకురావడంతో యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఐదేళ్లలో అంగుళం కూడా ముందుకు వెళ్లలేదు. మళ్లీ తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు లభించడం శుభసూచికమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముగ్గురు మంత్రులకు ఏ శాఖలు కేటాయించినా జిల్లాకు నిధులు రాబట్టగలరనే ధీమా వ్యక్తమవుతోంది. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులు పునఃప్రారంభంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి మళ్లీ పరుగులు పెడుతుందనడంలో సందేహం లేదని చెప్పవచ్చు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని