logo

ఆరోగ్యమే.. ‘యోగ’భాగ్యం

ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితం.. ఒత్తిళ్లు, పని భారం.. చిన్న విషయాలకూ మానసిక వేదన... ఏకాగ్రత, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం.. తదితరాలతో వ్యాధుల బారిన పడుతున్నారు.

Updated : 21 Jun 2024 06:38 IST

ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితం.. ఒత్తిళ్లు, పని భారం.. చిన్న విషయాలకూ మానసిక వేదన... ఏకాగ్రత, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం.. తదితరాలతో వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని జయించడానికి.. వ్యాధులను దూరం చేయడానికి యోగా సంజీవనిలా పని చేస్తుందంటున్నారు నిపుణులు. యోగా ఆచరిస్తూ.. దేశవిదేశాల్లో తర్ఫీదు ఇస్తూ.. ఆరోగ్యకర జీవనం సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నవారెందరో.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం.

కళ్యాణదుర్గం గ్రామీణం: యోగసనాలు వేస్తున్న మహిళలు


76 ఏళ్లు.. అవలీలగా ఆసనాలు

ఆసనం వేస్తున్న ఈశ్వరయ్య

ధర్మవరం: పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పామిశెట్టి వెంకటలక్ష్మయ్య వయస్సు 76 ఏళ్లు. యోగాసనాలు అవలీలగా చేస్తున్నారు. మగ్గం నేస్తూ జీవనం సాగించే ఈయన 36 ఏళ్లుగా యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. క్రమం తప్పకుండా రోజూ ఆసనాలు వేస్తున్నారు. గాంధీనగర్‌ సత్యసాయి భజన మందిరంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి అవగాహన కల్పిస్తూ వారికి ఉపయోగపడే ఆసనాలపై శిక్షణ ఇస్తున్నారు. ధర్మవరంలో మొట్టమొదటి గురువుగా వెంకటలక్ష్మయ్య పేరొందారు.


విదేశాల్లో ప్రత్యేక ముద్ర

ఇండోనేషియాలో శిక్షణ ఇస్తున్న వంశీకృష్ణ

గుంతకల్లు: ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి యోగా దోహదం చేస్తుందన్న నమ్మకంతో గుంతకల్లుకు చెందిన వంశీకృష్ణ విదేశాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తండ్రి ప్రతాప్‌ వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు. బీటెక్‌ చదివి ఆయన హిమాలయాల్లో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రధానాచార్యుడిగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇండోనేషియా, జర్మనీ, పోలెండ్‌ తదితర  దేశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆరోగ్యకర సమాజం కోసం యోగా ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు.


బరువు తగ్గాను

పదేళ్ల కిందట అధిక బరువుతో ఇబ్బంది పడ్డాను. యోగా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలుసుకున్నా. మరికొందరికి యోగాపై అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని పట్టణంలో కేంద్రం ఏర్పాటు చేశాను. పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను.

ఈశ్వరయ్య, శిక్షకుడు


మూడేళ్లుగా సాధన

ఆరు సంవత్సరాలుగా థైరాయిడ్, గ్యాస్‌ట్రబుల్‌తో బాధపడుతున్నా. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. మూడు సంవత్సరాల నుంచి నిత్యం యోగా సాధన చేస్తున్నా. ఫలితంగా ఆరోగ్యం కుదుటపడింది.

వనజ, పార్వతీనగర్, కళ్యాణదుర్గం


వ్యాధుల నుంచి ఉపశమనం

నిద్రలేమి, నడుమునొప్పి, ఒత్తిళ్లతో సతమతమవుతున్న సమయంలో కొందరు యోగా గురించి చెప్పారు. ఏడాది నుంచి రోజూ ఆసనాలు వేస్తున్నా.. ధ్యానం చేస్తున్నా. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందాను.

పద్మ, కళ్యాణదుర్గం


తొంభై శాతం కోలుకున్నా..

ఐదేళ్లుగా తలనొప్పి, వెన్నెముక నొప్పి, ఒత్తిడితో ఇబ్బంది పడ్డా. రెండేళ్లుగా యోగా చేస్తుండటంతో 90 శాతం మేర కోలుకుంటున్నా. గతంలో ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించినా, ఔషధాలు వాడినా ప్రయోజనం లేదు. నిత్యం సాయంత్రం ధ్యానం, యోగాసనాలు చేస్తుండటంతో ఆరోగ్యం నిలకడగా ఉంది.

నాగరంజని, కోటవీధి, కళ్యాణదుర్గం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు