logo

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

కలుషిత నీటి సరఫరా అవుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా పుట్టపర్తి మున్సిపాలిటీ అధికారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. ట్యాంకులు శుభ్రం చేయించకపోవడం, పైపులైన్లు లీకేజీల వల్ల నీరు కలుషితం అవుతున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు.

Updated : 21 Jun 2024 06:37 IST


తాగునీటి ట్యాంకులో కోతులు మృతిచెంది కుళ్లిపోయినా పట్టించుకోని వైనం

జిల్లా కేంద్రంలో పరిస్థితి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: కలుషిత నీటి సరఫరా అవుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా పుట్టపర్తి మున్సిపాలిటీ అధికారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. ట్యాంకులు శుభ్రం చేయించకపోవడం, పైపులైన్లు లీకేజీల వల్ల నీరు కలుషితం అవుతున్నా పట్టించుకునే నాథులే కరవయ్యారు. తాగునీటి పథకాల ట్యాంకులపై మూతలు లేవు. పైపులైన్ల లీకేజీలతో లక్షలాది లీటర్లు కలుషితం అవుతున్నాయి. కనీసం నెలకు ఒకసారీ కూడా ట్యాంకులు శుభ్రం చేసిన దాఖలాలు లేవు. తాగునీటిని సరఫరా చేసే సిబ్బంది ట్యాంకుల శుభత్రపై దృష్టి సారించడం లేదు. ట్యాంకులపై కప్పులు లేకపోవడంతో చెత్తాచెదారంతో పాటు, నీటి కోసం వచ్చే పక్షులు, కోతులు పడి మృత్యువాత పడుతున్నాయి. మున్సిపాలిటీలో దశాబ్దాల కాలం నాటి పైపులైన్లు దెబ్బతినడంతో పలుచోట్ల లీకేజీలతో తాగునీరు కలుషితం అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో పైపులైన్లు మురుగు కాలువలు, భూగర్భ మురుగునీటి వ్యవస్థకు సమీపంలో ఉండటం వల్ల, లీకేజీలోకి మురుగునీరు చేరి తాగునీరు కలుషితం అవుతోంది. రోజూ పలు ప్రాంతాల్లో రంగుమారిన జలం వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కుళాయిల్లో కలుషిత నీరు

పట్టణంలోని 56 తాగునీటి పథకాల ద్వారా రోజూ 1.1 ఎంఎల్‌డీ, సత్యసాయి తాగునీటి పథకం ద్వారా 1.35 ఎంఎల్‌డీ నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ట్యాంకులు శుభ్రం చేయకపోవడం, వాటిపై మూతలు లేకపోవడంతో నీటిలోకి వ్యర్థాలు చేరుతున్నాయి. కుళాయిలకు బురదనీరు, రంగుమారి, దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. పెద్దకమ్మవారిపల్లి, చిత్రావతిగుట్ట, ఎనుములపల్లి, బ్రహ్మణపల్లి, సాయినగర్, పెద్దబజార్, తదితర ప్రాంతాల్లో ట్యాంకులపై ఎక్కడ పైకప్పులు లేవు. అధికారుల నిర్లక్ష్యమే కారణామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. తాగునీటి ట్యాంకుల శుభ్రత, పైపులైను లీకేజీలను నియంత్రించడంలో అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారు.

అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం

పెద్దకమ్మవారిపల్లి తాగునీటి ట్యాంకుకు పైకప్పు లేకపోవడంతో కోతులు, పక్షులు మృత్యువాతపడటంతో పాటు, చెత్తాచెదారం పడుతున్నాయి. కనీసం ట్యాంకుల శుభ్రత, నీటి సరఫరాపై అధికారులు సిబ్బంది గాలికి వదిలేసి, ప్రజల అరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. నెలరోజుల క్రితం పెద్దకమ్మవారిపల్లి తాగునీటి పథకంలోకి మూడు కోతులు పడి మృత్యువాతపడితే ఎవరికీ తెలియదు. గ్రామస్థులు జలం దుర్వాసన వస్తున్నాయని, ట్యాంకు వద్దకు వచ్చి పరిశీలించే వరకు పట్టించుకోలేదంటే వారి నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. కనీసం మూడు నెలలకు ఒక్కసారి కూడా ట్యాంకులు శుభ్రం చేయడం లేదు. ఇప్పటికైన సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి ఆరోగ్యాలతో చెలగాటం ఆడకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పథకాల నిర్వహణపై దృష్టి సారిస్తాం..

మున్సిపాలిటీలోని ట్యాంకులు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. కమ్మవారిపల్లిలో తాగునీటి ట్యాంకుల్లో మృతి చెందిన కోతులను బయటకు తీసి శుభ్రం చేయించాం. మున్సిపాలిటీ పరిధిలోని ట్యాంకులన్నింటిపైనా పైకప్పులు వేయించడంతో పాటు పైపులైన్ల లీకేజీలను నియంత్రిస్తాం.

అంజయ్య, కమిషనర్‌


మూడు వానరాలు పడినా..

బయటకు తీసిన
కోతుల కళేబరాలు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: పుట్టపర్తి మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో గురువారం వెలుగుచూసింది. తాగునీటి ట్యాంకులో మూడు కోతులు పడి మృత్యువాతపడినా వారెవరికీ తెలియకపోవడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకమ్మవారిపల్లి ట్యాంకులో పడి మూడుకోతులు మృతి చెందాయి. పూర్తిగా నీటిలోకి కుళ్లిపోయాయి. నివాసాలకు సరఫరా అయ్యే, నీరు కలుషితమై రావడంతో గ్రామస్థులు కొందరు వెళ్లి ట్యాంకును పరిశీలించగా కుళ్లిపోయిన కోతుల ఆస్తిపంజరాలు కన్పించడంతో అందరూ అవాక్కయ్యారు. ట్యాంకులపై ఎక్కడా పైకప్పులు లేవు. ట్యాంకు శుభ్రం చేసి ఎన్ని తెలియడం లేదని గ్రామస్ధులు వాపోతున్నారు. గ్రామస్థులు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకొని అరకొరగా శుభ్రం చేసి చేతులు దులుపుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని